ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం

ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం
  • ఈ నెల 17 వరకు ఢిల్లీలోనే సీఎం? 
  • వివిధ పార్టీల నేతలు, రైతు సంఘాల లీడర్లతో భేటీ అయ్యే చాన్స్  

న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ లోని బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చారు. ఆయనకు ఎయిర్ పోర్టులో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ స్వాగతం పలికారు. కేసీఆర్ అక్కడి నుంచి తుగ్లక్ రోడ్ లోని సీఎం క్యాంప్ ఆఫీసుకు చేరుకున్నారు. ఢిల్లీ సర్దార్ పటేల్ రోడ్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆఫీసులో మంగళ, బుధవారాల్లో ఆయన రాజశ్యామల యాగం చేయనున్నారు. బుధవారం పూజలు పూర్తయ్యాక పార్టీ ఆఫీసును ప్రారంభిస్తారు. 

ఈ యాగంలో కేసీఆర్ దంపతులు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆఫీసు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి, మాజీ మంత్రి రేవణ్ణ, ప్రకాశ్ రాజ్, వివిధ రాష్ట్రాల నేతలు పాల్గొననున్నట్లు తెలిసింది. పార్టీ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు పలువురు మంత్రులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ఢిల్లీకి చేరుకున్నారు. వీరికి తెలంగాణ భవన్ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఢిల్లీ బాట పట్టారు. కాగా, బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్టీ ఎంపీలు పరిశీలించారు.   

రిటైర్డ్ బ్యూరోక్రాట్లతోనూ భేటీ.. 

టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వచ్చిన కేసీఆర్... ఈ నెల 17 వరకు ఇక్కడే ఉంటారని తెలిసింది. ఈ సందర్భంగా జాతీయ నేతలు, రైతు సంఘాల లీడర్లు, రిటైర్డ్ బ్యూరోక్రాట్లతో సమావేశమవుతారని సమాచారం. బీఆర్ఎస్ ను జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలని అనుకుంటున్న కేసీఆర్.. అందుకు పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. జాతీయ పార్టీలకు పేరొందిన ఉత్తరాది బెల్ట్ లో భారీ ప్రచారానికి సిద్ధమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ‘‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’’ నినాదంతో ముందుకెళ్తున్న నేపథ్యంలో ఉత్తరాదికి చెందిన రైతు సంఘాల నేతలకు పెద్దపీట వేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన రైతుల సంఘాల నేతలను పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవానికి ఆహ్వానించినట్లు తెలిసింది. కాగా, ఉత్తరాది రాష్ట్రాల్లోనూ పార్టీ ఆఫీసులు ప్రారంభించే అవకాశం ఉంది. 

12 మంది రుత్వికుల ఆధ్వర్యంలో యాగం.. 

12 మంది రుత్వికుల ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు రాజశ్యామల యాగం జరగనుంది. ఇందుకోసం యాగశాల నిర్మాణం పూర్తయింది. మంగళవారం ఉదయం 9 గంటలకు గణపతి పూజతో యాగం ప్రారంభం కానుంది. శృంగేరి పీఠం పండితులు గోపీకృష్ణ శర్మ, ఫణి శశాంక శర్మ ఆధ్వర్యంలో పూజలు జరగనున్నాయి.