
- గుడి, చర్చి, మసీదు ఓపెనింగ్‌కు సర్కార్ ఆహ్వానం
- రాజ్‌భవన్‌లో గవర్నర్, సీఎం భేటీ తర్వాత మారిన సీన్
హైదరాబాద్, వెలుగు: కొత్త సెక్రటేరియెట్ ప్రాంగణంలో నిర్మించిన గుడి, చర్చి, మసీదును శుక్రవారం సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ ప్రోగ్రామ్‌కు గవర్నర్ తమిళిసై హాజరుకానున్నారు. ఈ మేరకు రాజ్ భవన్ వర్గాలు గవర్నర్ షెడ్యూల్‌ను రిలీజ్ చేశాయి. మంత్రివర్గ విస్తరణలో భాగంగా సీఎం కేసీఆర్ గురువారం రాజ్ భవన్ వెళ్లారు. మంత్రి మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత.. గవర్నర్ తమిళిసైతో కేసీఆర్ 25 నిమిషాల పాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా పెండింగ్ బిల్లులు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ తదితర అంశాలపై చర్చ జరిగినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే సచివాలయంలోని గుడి, మసీదు, చర్చి ప్రారంభోత్సవానికి రావాలని గవర్నర్‌ను కేసీఆర్ ఆహ్వానించినట్టు సమాచారం. గతంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, కొత్త సెక్రటేరియెట్, అమరవీరుల స్మృతి చిహ్నం ఓపెనింగ్‌కు గవర్నర్‌కు సర్కారు ఆహ్వానం పంపలేదు. దీంతో ఆయా కార్యక్రమాలకు తమిళిసై దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో శుక్రవారం సెక్రటేరియెట్‌లో జరగనున్న కార్యక్రమానికి రానుండటం ఆసక్తిగా మారింది.