
తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. అక్టోబర్ 15వ తేదీన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. అదే రోజు బీఆర్ఎస్ అభ్యర్థులకు బి ఫారాలను అందజేయనున్నారు. తెలంగాణ ఎన్నికల్లో పాటించాల్సిన నియమ నిబంధనలు.. తదితర అంశాలపై అభ్యర్థులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. అంతేకాదు బీఆర్ఎస్ మేనిఫెస్టోను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అక్టోబర్ 15వ తేదీనే విడుదల చేయనున్నారు. ఆ తర్వాత అదేరోజు (అక్టోబర్ 15) న హైద్రాబాద్ నుంచి బయలుదేరి... హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ పాల్గొంటారు.
సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనలు
అక్టోబర్ 16వ తేదీ జనగామ, భువనగిరి నియోజకవర్గాల కేంద్రాల్లో బీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తారు. అక్టోబర్ 18న మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో.., అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభల్లో సిఎం పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.
ALSO READ : 10 గంటలు పని చేస్తున్నారా.. అయితే మీ బ్రెయిన్ వీక్ అవ్వొచ్చు..
కేసీఆర్ నామినేషన్లు ..
తెలంగాణ ఎన్నికల్లో కామారెడ్డి, గజ్వేల్ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇందులో భాగంగా నవంబర్ 9వ తేదీన గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేస్తారు. ఇందులో భాగంగా నవంబర్ 9వ తేదీ ఉదయం సిద్దిపేట జిల్లా కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ఆనవాయితీ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గజ్వేల్ లో కేసీఆర్ మొదటి నామినేషన్ వేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో రెండో నామినేషన్ దాఖలు చేస్తారు. అనంతరం మూడు గంటల నుంచి ప్రారంభమయ్యే కామారెడ్డి బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.