ఆచరించి చూపిస్తేనే.. కేసీఆర్​ మాటలకు విలువ ఉంటది

V6 Velugu Posted on Jun 24, 2021

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సుదీర్ఘ కాలం పాటు విలువలతో కూడిన రాజకీయాలే దేశంలో నడిచాయి. సిద్ధాంతాల ప్రాతిపదికన రాజకీయ పార్టీలు పనిచేశాయి. కానీ, మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుందన్నట్టుగా.. రాజకీయ పార్టీల సంఖ్య పెరిగేకొద్దీ విలువలు కూడా తగ్గుతూ వచ్చాయి. ఆయారాం.. గయారాంలు కూడా పెరిగిపోయారు. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి వచ్చింది. ఒక పార్టీ సింబల్ మీద గెలిచిన వారు మరో పార్టీలోకి జంప్ అవడం ఎక్కువైపోయింది. అది తప్పు కాదనే భావానికి పొలిటీషియన్లు వచ్చేశారు. ఈ పరిణామాలు అన్ని రాజకీయ పార్టీలనూ కలవర పెట్టాయి. దీంతో రాజ్యాంగ సవరణ చేసి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకొచ్చారు. అయినా పార్టీ ఫిరాయింపులు ఆగలేదు సరి కదా.. మరింత పెరిగాయి. వీటిని కొన్ని పార్టీల అధినేతలు కూడా ప్రోత్సహిస్తున్నారు. అధికారంలో ఉన్నవారు స్పీకర్ వ్యవస్థను తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం మొదలు పెట్టారు. పార్టీ ఫిరాయింపులపై వచ్చిన ఫిర్యాదులను పక్కన పెట్టి అధికార పార్టీలో వారు విలీనం అయినట్లు బులిటెన్ విడుదల చేసే సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఈ విషయంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకున్నా.. తమది స్వతంత్ర వ్యవస్థ అని, ఎవరూ జోక్యం చేసుకోరాదని అంటున్నారు. 

ఎన్నికల్లో డబ్బు ప్రాధాన్యత పెరిగింది
రాజకీయ పార్టీలు సిద్ధాంతాలను వదిలేయడంతో ఎన్నికల్లో డబ్బు ప్రాధాన్యత పెరగడమే కాకుండా సాధ్యాసాధ్యాలతో సంబంధం లేకుండా ఎన్నికల్లో హామీలను గుప్పించే సంస్కృతికి తెరలేచింది. ఎలాగైనా డబ్బు వెదజల్లి ఎన్నికల్లో గెలవడం.. ఆ తర్వాత ఖర్చు చేసిన డబ్బులను రాబట్టుకునేందుకు అవినీతికి పాల్పడటం చాలా మంది రాజకీయ నాయకులకు అలవాటుగా మారింది. ఇక ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గెలిచిన తర్వాత పట్టించుకోవడం మానేస్తున్నాయి. ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యల గురించి పట్టించుకోవడం మానేస్తున్నాయి. ఎన్నికల సంస్కరణలు ఎన్ని తెచ్చినా దొడ్డిదారిన వాటిని తుంగలో తొక్కి తమ పని తాము కానిచ్చుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. చివరికి స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల  కమిషన్  అధికార పార్టీ చెప్పు చేతల్లో పని చేసే స్థితికి వచ్చింది.

వ్యవస్థలను ఇష్టానుసారం వాడుకుంటున్నయ్​
స్పీకర్ వ్యవస్థ, ఎన్నికల కమిషన్లు మాత్రమే కాదు ఇతర వ్యవస్థలు కూడా అధికార పార్టీ జేబు సంస్థలుగా పని చేయడం మొదలు పెట్టాయి. సీబీఐ, ఐటీ, ఈడీలు కేంద్రంలో అధికారంలో ఉండే వారు చెప్పినట్లు నడుస్తుంటే, ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్, పోలీస్ వ్యవస్థలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వారి చెప్పు చేతల్లో పని చేస్తున్నాయి. దీంతో అధికారంలో ఉన్నవారు తమ రాజకీయ ప్రత్యర్థుల మీద వాటిని ప్రయోగించి రాజకీయ విలువలను దిగజారుస్తున్నారు. అటు కేంద్రంలోనూ, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జరుగుతున్న పరిణామాలను చూస్తే ఈ వ్యవస్థలను అధికార పార్టీలు ఎలా వాడుకుంటున్నాయో అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్​లో జగన్మోహన్​రెడ్డి, తెలంగాణలో కేసీఆర్  కీలకమైన వ్యవస్థలను తమ ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నారు. చివరికి తన కేబినెట్ లో ఉన్న మంత్రి ఈటల రాజేందర్​పై కూడా ఏసీబీ, విజిలెన్స్ లను సీఎం కేసీఆర్  ప్రయోగించారు. అంటే ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు, విలువలు ఎలా ఉన్నాయో దీనిని బట్టి అర్థమవుతోంది. అలాగే ఎంత విచ్చలవిడిగా వ్యవస్థలను తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారో అద్దం పడుతోంది. అలాంటి కేసీఆర్ ఇప్పుడు రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడడం విచిత్రంగా, విడ్డూరంగా ఉంది.

ముందు మీరు ఆచరించాలి
ఇతర పార్టీ సింబల్ మీద గెలిచిన వారిని కేబినెట్ లోకి తీసుకోవడం, పార్టీ ఫిరాయింపులను విచ్చలవిడిగా ప్రోత్సహించడం, ఎన్నికల్లో డబ్బు ప్రాధాన్యత పెంచడం, ప్రతిపక్షం లేకుండా చేయడం, అసెంబ్లీలో ఇతర పార్టీల నాయకుల గొంతు నొక్కడం ఇలా ఎన్నో పనులను కేసీఆర్​ చేస్తున్నారు. ముఖ్యమంతి సెక్రటేరియట్​కు రావాల్సిన అవసరం లేదనట్లుగా క్యాంపు కార్యాలయానికే పరిమితం కావడం, సీఎంను కలిసే అవకాశం ఎవరికీ లేకపోవడం ఇలా చెప్పుకుంటే అనేక విషయాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ సంప్రదాయాన్ని, పోరాటాల వారసత్వాన్ని తుంగలో తొక్కి రాజకీయ విలువలను దిగజార్చిందే సీఎం కేసీఆర్. అలాంటి కేసీఆర్ రాజకీయాల్లో చిల్లరగాళ్లు మోపయ్యారని అంటే ప్రజలు పెద్దగా రిసీవ్ చేసుకోరు. విలువలతో కూడిన రాజకీయాలు చేసి దేశంలోనే కేసీఆర్ నంబర్ వన్ అని అనిపించుకునే అవకాశం ఆయనకు ఉంది. ఎందుకంటే ఉద్యమ నాయకుడిగా ఉంటూ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు కనుక. కానీ ఆ అవకాశాన్ని వదులుకుని కేసీఆర్ రాజకీయలను భ్రష్టుపట్టించారని చెప్పకతప్పదు. ఇప్పటికైనా బాగారెడ్డిని ఆదర్శంగా తీసుకుని కేసీఆర్ కూడా విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని కోరుతున్నాం. లేకుంటే మీరు చెప్పిన విషయాలకు మీరే ప్రాధాన్యత ఇవ్వడం లేదని అనుకోవాల్సి వస్తుంది.

ఆవేదన చెందితే లాభం ఉండదు
రాజకీయాల్లో చిల్లరగాళ్లు మోపయ్యారని సీఎం కేసీఆర్ ఎవరిని ఉద్దేశించి కామెంట్ చేశారో కానీ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకైతే తెరలేపారు. రాజకీయాలను చిల్లర చేస్తూ చిల్లరగాళ్లు మోపయ్యారని ఆవేదన చెందితే ఎలాంటి లాభం లేదు. ఆదర్శ రాజకీయాలకు, విలువలతో కూడిన రాజకీయాలకు సీఎం కేసీఆర్ బాట వేసి, ఆ తర్వాత చిల్లరగాళ్ల గురించి మాట్లాడితే ఏమైనా ప్రయోజనం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విలువలతో కూడిన రాజకీయాలకు అవకాశం ఉంటుందని అందరూ భావించారు. ఎందుకంటే.. తెలంగాణ ఉద్యమాల చరిత్ర కలిగిన ప్రాంతం. అనేక పోరాటాలు, త్యాగాల తర్వాత రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కాబట్టి పోరాటాల సంప్రదాయం ఉట్టిపడే విధంగా విలువలతో కూడిన రాజకీయాలను కేసీఆర్​  చేస్తారని రాష్ట్రం వచ్చిన కొత్తలో అంతా అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా కేసీఆర్ నడుస్తున్నారు.

- దాసోజు శ్రవణ్, ఏఐసీసీ అధికార ప్రతినిధి

Tagged CM KCR, ap cm jagan, dasoju sravan, telangana Movement, Baga Reddy

Latest Videos

Subscribe Now

More News