
- ఇప్పటికే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.10 వేల కోట్ల రుణం
- మొత్తం రూ.20 వేల కోట్లతో పనులు పరుగులు పెట్టించాలన్న సీఎం
- ఆ మేరకు మిగతా ప్రాజెక్టులకు కోత పడే చాన్స్?
హైదరాబాద్, వెలుగు: పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించాలని, ఇందుకోసం పూర్తిస్థాయి బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లు కేటాయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్–1, 2లో మేజర్ పనులు పూర్తయ్యాయని, ఇక ఫోకస్ అంతా పాలమూరుపైనే పెడదామని ఆయన పేర్కొన్నట్టు సమాచారం. ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని, డబ్బుకు కొదవలేకుండా చూసుకుంటానని హామీ ఇచ్చినట్టు తెలిసింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తెచ్చిన రూ.10 వేల కోట్ల అప్పులకు తోడు, రాష్ట్ర సర్కారు బడ్జెట్‌లో మరో రూ.10 వేల కోట్లు కేటాయిస్తుందని.. ఆ మొత్తంతో రిజర్వాయర్లు, పంపుహౌస్‌లు, టన్నెళ్లు, కాలువల పనులు పరుగులెత్తించాలని సీఎం ఆదేశించారు.
నిధుల కొరతతో..
పాలమూరు-–రంగారెడ్డి ప్రాజెక్టును ఉమ్మడి ఏపీలోనే ప్రతిపాదించారు. అయితే తెలంగాణ సర్కారు నీటిని తీసుకునే ప్రాంతాన్ని జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు మార్చింది. 2015లో రూ.32,500 కోట్ల వ్యయ అంచనాలతో ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. పనులను 18 ప్యాకేజీలుగా విభజించి ఆరు రిజర్వాయర్లు, ఐదు లిఫ్టులుగా రూపొందించారు. ఇప్పటివరకు భూసేకరణతో కలిపి రూ.6,874 కోట్ల విలువైన పనులు మాత్రమే జరిగాయి. నిధుల కొరత కారణంగానే జాప్యం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 20న ప్రాజెక్టును కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్‌లో ఇంక్లూడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కార్పొరేషన్ ద్వారా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి సేకరించే రూ.10 వేల కోట్ల రుణాన్ని పాలమూరు ప్రాజెక్టుకు కేటాయించింది.
త్వరలోనే సీఎం భేటీ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే పాలమూరు ప్రాజెక్టు పనులను చాలా వరకు పూర్తి చేయాలని సర్కారు భావిస్తోంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ త్వరలోనే ఇంజనీర్లు, వర్క్ ఏజెన్సీలతో సమావేశమై ఆదేశాలు ఇవ్వనున్నట్టు తెలిసింది. ఈ ఏడాది పాలమూరు ప్రాజెక్టును టాప్ ప్రయారిటీగా తీసుకోవాలని సీఎం నిర్ణయించడంతో పూర్తిస్థాయి బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లు కేటాయించనున్నట్టు తెలిసింది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌లో ఇరిగేషన్‌కు రూ.22,500 కోట్లు ఇచ్చారు. పూర్తిస్థాయి బడ్జెట్‌లో మరో మూడు నాలుగు వేల కోట్లు పెంచే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఓటాన్ ఎకౌంట్ లో పాలమూరు ప్రాజెక్టుకు రూ.2,500 కోట్లు ఇవ్వగా.. ఇప్పుడు మరో రూ.7,500 కోట్లు కలిపి.. మొత్తం రూ.10 వేల కోట్లను ప్రతిపాదించనున్నారు. ఈ మేరకు మిగతా ప్రాజెక్టులకు కేటాయించిన మొత్తంలో కోత పెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఓటాన్ అకౌంట్లో దేనికెన్ని?
ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.5,500 కోట్లు, పాలమూరుకు రూ.2,500 కోట్లు, సీతారామ ఎత్తిపోతలకు రూ.వెయ్యి కోట్లు, భీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్టులకు రూ.1,085 కోట్లు కేటాయించారు. మొత్తంగా మేజర్ ఇరిగేషన్‌కు రూ.20,120.34 కోట్లు, మైనర్ ఇరిగేషన్‌కు రూ.2,379.66 కోట్లు ఇచ్చారు. ఇందులో కాళేశ్వరం సహా కొన్ని ప్రాజెక్టులకు కోతపెట్టి పాలమూరుకు మళ్లించే అవకాశాలున్నట్టు ఇంజనీర్లు చెబుతున్నారు.
వచ్చే ఏడాది నీళ్లిచ్చేలా..
నార్లాపూర్ (అంజనాగిరి), ఏదుల (వీరాంజనేయ), వట్టెం (వెంకటాద్రి), కరివెన (కురుమూర్తిరాయ), ఉద్దండాపూర్, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్లు, పంపుహౌస్ పనుల్లో వీలైనన్నింటిని వచ్చే ఏడాది మే నాటికి పూర్తి చేయాలని సర్కారు భావిస్తోంది. పెండింగ్ పనులను తర్వాతి ఏడాది పూర్తి చేసి, ఆయకట్టుకు నీళ్లివ్వాలని నిర్ణయించింది. ఏ పనులు ముందు చేపడితే ప్రయోజనం ఉంటుందన్న దానిపై సలహాలు, సూచనలు ఇవ్వాలని అధికారులు, రిటైర్డ్ ఇంజనీర్లను సీఎం కోరినట్టు తెలిసింది.