కేసీఆర్ ఆరు సెంటిమెంట్.. అధికారులకు తప్పని తిప్పలు

కేసీఆర్ ఆరు సెంటిమెంట్.. అధికారులకు తప్పని తిప్పలు

సెంటిమెంట్ సొంతానికి ఉంటే ఎవరికీ నష్టంలేదు. పైత్యంగా మారితేనే అందరికీ తిప్పలు తెచ్చిపెడుతుంది. సీఎం కేసీఆర్ ఆరో నంబర్ సెంటిమెంట్ ఇప్పుడు చాలామంది అధికారులకు సంకటంగా మారింది. ప్రతిదానికీ ఆరో నంబర్ లింకు ఉండాలంటూ అతి చేస్తుండడం ఆఫీసర్లకు కొత్త సమస్యలు తెచ్చిపెడుతోందని మొత్తుకుంటున్నారు. 

కేసీఆర్ వెహికల్ నంబర్లలో ఆరో నంబర్ పెట్టుకోవడం అందరికీ తెలిసిందే. ఇంత వరకు సమస్య లేదుగానీ ఈ మధ్య రకరకాల కార్యక్రమాలు, స్కీమ్ ల పేరుతో జరుగుతున్న హడావుడిలోనూ ఆరో నంబర్ పైత్యం చూపించాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారట. మొన్న నిమ్స్ హాస్పిటల్ బిల్డింగ్ భూమి పూజతో పాటు బాలింతలకు న్యూట్రిషన్ కిట్లు పంచే కార్యక్రమం పెట్టాలని నిర్ణయించారు. వేదికపై సీఎం చేతుల మీద ఇవ్వడానికి ఆరుగురు బాలింతలే ఉండాలని కండీషన్ పెట్టారట. బిడ్డకు జన్మనిచ్చి వారి మంచిచెడ్డలు చూసుకునే బాలింతలకు వారు ఉన్న దగ్గరే కిట్లు అందించాలి. కానీ పొలిటికల్ మొహర్బానీల కోసం ఆరుగురి తీసుకొని అరగంటకుపైగా నిలబెట్టి ఇవ్వడం విమర్శలకు దారితీసింది.

తర్వాత కొల్లూరులో 15వేల డబుల్ ఇండ్ల ప్రారంభంలోనూ ఆరుగురికే సీఎంతో ఇప్పించాలని చెప్పారట. ఏళ్ల తరబడి సాగదీసి ఈ ప్రాజెక్టు పూర్తయినా పేదలకు ఇయ్యకుండా రెండేళ్లు ఎండకు, వానకు నానబెట్టారు. రెండేళ్లలోనూ ఈ ఇండ్లు ఇవ్వడానికి అర్హులను ఎంపిక చేసే సోయి కూడా సర్కారుకు లేదు. ఎలక్షన్ ముందు డ్రామాకు తప్ప నిజంగా ఇచ్చే ఉద్దేశం లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఊహించినట్లే ఎలక్షన్ ముందు ఓపెన్ చేసి.. ఆరుగురికి సీఎం కేసీఆర్ తో ఇండ్లు ఇప్పించారు. ఇప్పుడు మాకెప్పుడు ఇస్తారంటూ జనం నుంచి అధికారులకు ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. మంత్రుల నుంచి ఎమ్మెల్యేల దాకా జనం నుంచి తప్పించుకు తిరుగుతుంటే మేం జవాబు చెప్పుకోలేకపోతున్నామని ఆఫీసర్లు ఫీలవుతున్నారు. 

లేటెస్ట్ గా అమరుల స్మారకం పేరుతో నిర్మించిన టూరిజం కట్టడాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఇందులో అమరుల పేర్లే లేకపోవడం వివాదాస్పదం అయ్యింది. ఈ కార్యక్రమానికి కనీసం గుర్తించిన అమరుల కుటుంబాలనూ ఆహ్వానించలేదు. అర్థం లేని సొంత సెంటిమెంట్ కోసం ఆరుగురు కుటుంబాలనే పిలిచి సన్మానం చేసి గొప్పలు చెప్పుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది అమరుల కుటుంబాలవారు మన సర్కారులోనూ కనీస గౌరవం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆరు సెంటిమెంటే తనను నిలబెడుతుందని కేసీఆర్ నమ్ముతున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి రాష్ట్రమంతా జనం బీఆర్ఎస్ లీడర్లను ముఖం మీదే నిలదీయడం, సమస్యలు తీరట్లేదని రోడ్డెక్కడం లాంటి ఘటనలతో పరిస్థితి బాగలేదన్న ఆందోళన వెంటాడుతోందని చెబుతున్నారు. అందుకే ఆరో నంబర్ సెంటిమెంట్ ను అవసరం లేనిచోట్లా అతిగా ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నట్లు సెక్రటేరియట్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఆయన సెంటిమెంట్ ఆఫీసర్లకు తిప్పలు తెస్తున్నా చెప్పుకోలేక పోతున్నామంటున్నారు.