
హైదరాబాద్ : ఈనెల 15న సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో సంయుక్త సమావేశం జరగనుంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో ఈ సమావేశం జరుగనుంది. ఈ భేటీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు టీఆర్‌ఎస్ రాష్ట్రస్థాయి నేతలు కూడా హాజరుకానున్నారు. టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ, పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారానే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రొటోకాల్ రగడ
ఈ మధ్య టీఆర్ఎస్ అధినేత కేసీఆర్... బీజేపీపై దూకుడుగా వెళ్తున్నారు. మొయినాబాద్ ఫాంహౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అంశంలోనూ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఇష్యూ ఇప్పుడు రెండు పార్టీల మధ్య చిచ్చు రాజేస్తోంది. రామగుండలో ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోడీ వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేసీఆర్ పై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే బీజేపీపై టీఆర్ఎస్ ఎదురుదాడి చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించలేదని, కేసీఆర్ ను ఆర్ఎఫ్ సీఎల్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదంటూ ఆరోపణలు చేసింది. దీనికి కౌంటర్ గా కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా తమదైన స్టైల్లో సమాధానాలు ఇచ్చారు. ఈ ఎపిసోడ్ లో రెండు ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం సాగింది.
మోడీ కామెంట్స్ పై చర్చ
బేగంపేటలో బీజేపీ నిర్వహించిన సభలో రాష్ట్ర ప్రభుత్వంపై పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని లూటీ చేసేవాళ్లను అస్సలు వదిలిపెట్టమని హెచ్చరించారు. అంతేకాదు.. తనను ఎన్ని తిట్టినా భరిస్తానని, రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం సహించని చెప్పడంతో.. మోడీ వ్యాఖ్యలు టీఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని వ్యాఖ్యలపై కూడా సమావేశంలో కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది. బీజేపీ నాయకులు, కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టే అవకాశం ఉందంటున్నారు.
ఈడీ, ఐటీ దాడులపైనా చర్చ
మరోవైపు టీఆర్ఎస్ కు చెందిన నాయకుల ఆఫీసులు, ఇండ్లల్లోనూ ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్న తీరుపైనా పార్టీ నాయకులతో కేసీఆర్ చర్చించే చాన్స్ ఉంది. దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఇండ్లు, ఆఫీసులు, బంధువుల ఇండ్లల్లోనూ ఈడీ, ఐటీ శాఖ అధికారుల సోదాలు జరుగుతుండడంతో టీఆర్ఎస్ వర్గాల్లో కలవరం రేపుతోంది. ఈ ఇష్యూను కేవలం ఇద్దరు, ముగ్గురు రాజకీయ నేతలపై జరుగుతున్న దాడిలా భావించకుండా.. రాష్ట్ర ప్రభుత్వంపైనే కేంద్రం దాడులు చేయిస్తున్నట్లుగా టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది.
గవర్నర్ కామెంట్స్ పై చర్చ
రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇటీవల చేసిన కామెంట్స్ పైనా మాట్లాడనున్నారు. రాజ్ భవన్.. ప్రగతిభవన్ లా కాదని, ఎవరైనా తమ సమస్యలను చెప్పుకోవడానికి రావొచ్చని అన్నారు. అంతేకాదు.. ప్రభుత్వ అధికారులు తమ పర్యటనల్లో ప్రొటోకాల్ పాటించడం లేదంటూ తరచూ గవర్నర్ చేస్తున్న కామెంట్స్ ను తిప్పికొట్టాలంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని రాజ్ భవన్ కు గవర్నర్ పిలిపించుకున్న విషయంపైనా డిస్కస్ చేసే అవకాశం ఉంది. యూనివర్సిటీల నియామక బోర్డు బిల్లుపై గవర్నర్ వ్యక్తం చేసిన సందేహాలను మంత్రి సబితతో పాటు విద్యాశాఖ అధికారులు నివృత్తి చేశారు.
పార్టీ బలోపేతంపై ఫోకస్
మరోవైపు.. టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా మార్చిన సమయంలో పార్టీ బలోపేతంపై అధినేత కేసీఆర్ ప్రధానంగా దృష్టి పెట్టారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ను విస్తరింపజేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలోనే పార్టీ ముఖ్యనాయకులకు కొన్ని కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు కొన్ని రాష్ట్రాల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందంటున్నారు. సౌత్ ఇండియాతో పాటు తెలంగాణలో బీజేపీ పార్టీ బలోపేతంపై ప్రధాని మోడీ ఎక్కువ ఫోకస్ చేయడంతో కేసీఆర్ అలర్ట్ అయ్యారని తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీని పలు రాష్ట్రాల్లో విస్తరింపజేయాలనే వ్యూహంలో ఉన్నారు.
ఆపరేషన్ ఆకర్ష్ పై దృష్టి
ఇంకోవైపు.. నాయకుల వలసలపై కూడా చర్చించే అవకాశం ఉంది. పార్టీలో అసంతృప్తిగా ఉన్న నాయకులు ఎవరు..? వారు పార్టీ మారే అవకాశం ఏమైనా ఉందా..? ఒకవేళ ఉంటే సదరు నేతలు ఉన్న నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి..? అన్నదానిపై చర్చించనున్నారు. పార్టీలో ప్రస్తుతం ఉన్న సీనియర్ నాయకులు టీఆర్ఎస్ ను వీడకుండా ఉండేలా పార్టీ ముఖ్యనేతలకు కొన్ని బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నాయకులను టీఆర్ఎస్ లో చేర్చుకునే అంశంపైనా చర్చించే అవకాశం ఉంది.
మొత్తంగా ఉన్నట్లుండి కేసీఆర్.. టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ, పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేయడంలో ఉన్న అంత్యరం ఏంటన్నదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది.