కోల్‌కతా: దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేంద్ర సర్కారు చేపట్టిన రెండో విడత ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్)కు వ్యతిరేకంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కదంతొక్కారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఆధ్వర్యంలో మంగళవారం కోల్‌కతాలో భారీ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీని మమతా బెనర్జీ ముందుండి నడిపించారు. మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో కలిసి కోల్‌కతా వీధులగుండా నడుచుకుంటూ వెళ్లారు.
ప్రజలకు అభివాదం చేస్తూ.. ‘సర్’కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకుసాగారు. మొత్తం 3.8 కిలోమీటర్ల మేర ఈ మార్చ్ కొనసాగింది. దాంతో ఆ దారులన్నీ వేలాదిమంది టీఎంసీ కార్యకర్తలతో నిండిపోయాయి. సర్‌కు వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కుమ్మక్కై ఈ సమగ్ర సవరణను నిర్వహిస్తున్నదని, ఇది ‘నిశ్శబ్ద రిగ్గింగ్’ అని టీఎంసీ ఆరోపించింది.
