గోడదూకి వెళ్లి అమరులకు సీఎం నివాళి

గోడదూకి వెళ్లి  అమరులకు సీఎం నివాళి

 

  • అమరవీరుల సమాధుల వద్ద ఒమర్ అబ్దుల్లా ప్రార్థనలు
  • అనంతరం ఎల్జీ మనోజ్ సిన్హా, పోలీసులపై ఫైర్
  • ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫతేహా అర్పిస్తామని వెల్లడి

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సోమవారం అనేక ఉద్రిక్త పరిస్థితుల నడుమ అమరవీరులకు నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థన(ఫతేహా)లు నిర్వహించారు. ఆదివారమంతా గృహ నిర్భందంలో ఉన్న ఆయన.. సోమవారం ఉదయమే ఆయన ఎవరికీ సమచారం ఇవ్వకుండా  కారు నడుపుకుంటూ  డౌన్‌‌‌‌టౌన్ ఏరియాలోని ఖన్యార్ చేరుకున్నారు. కిలో మీటర్ దూరం నడిచి నక్షబంద్ సాహిబ్  శ్మశానవాటికకు వెళ్లారు. అయితే, శ్మశానవాటికలోకి వెళ్లకుండా అక్కడున్న భద్రతా సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. దాంతో  ఒమర్ అబ్దుల్లా భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ,  భద్రతా సిబ్బంది అనుమతించకపోవడంతో ఆయన అమాంతం గోడదూకి  శ్మశానవాటికలోకి వెళ్లారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేతలంతా ఆయనలాగే గోడదూకి శ్మశానవాటిక గేట్లు తెరిచారు. అనంతరం 
వారంతా  అమరవీరులకు నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థన(ఫతేహా)లు నిర్వహించారు. 

మేం బానిసలం కాదు..ప్రజా సేవకులం 

అమరవీరులకు నివాళి అర్పించిన అనంతరం సీఎం ఒమర్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ.." భద్రత మా బాధ్యత అని చెప్పుకునే వాళ్లు.. నక్షబంద్ సాహిబ్ శ్మశానవాటికలో ‘ఫతేహా’ అర్పించకుండా మమ్మల్ని అడ్డుకోవడం నిజంగా బాధాకరం.1931లో డోగ్రా సైన్యం చేతిలో మరణించిన 22 మంది అమరవీరుల సమాధులు ఇక్కడే ఉన్నాయి. ఏటా వారికి జులై 13న ఫతేహా అర్పిస్తాం. అయితే, ఆదివారం మమ్మల్ని అమరవీరులకు నివాళి అర్పించకుండా చేసేందుకు నిర్బంధంలో ఉంచారు. ఈ రోజు కూడా మళ్లీ అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిన్న నిర్బంధం అమలులో ఉంటే.. ఈరోజు నన్ను ఎందుకు ఆపారు? ఇది స్వతంత్ర దేశం. కానీ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, పోలీసులు మమ్మల్ని బానిసల్లా చూస్తున్నారు. బానిసలం కాదు మేం మేం ప్రజల సేవకులం. పోలీసులు యూనిఫాం ధరించి కూడా చట్టాన్ని ఎందుకు అతిక్రమిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మమ్మల్ని పట్టుకోవడానికి, మా జెండాని చించడానికి ప్రయత్నించారు. కానీ అవన్నీ వృథా. మేం ఇక్కడికి వచ్చి ‘ఫతేహా’ అర్పించాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు మేం అమరవీరులకు నివాళి అర్పిస్తాం" అని ఒమర్ పేర్కొన్నారు.