రామగుండం ప్లాంట్ కు ఒడిశా బొగ్గా?: కేసీఆర్

రామగుండం ప్లాంట్ కు ఒడిశా బొగ్గా?: కేసీఆర్

పక్కనే సింగరేణిలో బొగ్గుంటే ఎక్కడో 950 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశాలోని మందాకిని ప్లాంట్‌‌ బొగ్గును రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్‌‌కు కేంద్రం కేటాయించింది. దీంతో కరెంటు ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. ఈ విధానం సరిగా లేదు. కరెంటు ప్రొడక్షన్‌‌ కాస్ట్‌‌ తగ్గాలంటే థర్మల్‌‌ ప్లాంట్లకు బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో మార్పులు తేవాలి. కొత్తగా ఏర్పడే ప్రభుత్వంతో నేనే చొరవ తీసుకొని మాట్లాడతా. బొగ్గు కేటాయింపుల విధానంలో మార్పు చేయిస్తా’ అని సీఎం కేసీఆర్‌‌ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో నిర్మిస్తున్న 1,600 మెగావాట్ల విద్యుత్‌‌ ప్లాంట్‌‌ను శనివారం సాయంత్రం సీఎం సందర్శించారు. తర్వాత ఎన్టీపీసీ, జెన్‌‌కో అధికారులతో రాష్ట్ర విద్యుత్‌‌ అవసరాలు, ప్రాజెక్టులపై సమీక్షించారు.  దేశంలో ఎక్కడ విద్యుత్‌‌ ప్లాంట్‌‌ ఉంటే అక్కడికి దగ్గరలోని బొగ్గును వాడితే ప్రజలకు భారం తగ్గుతుందని కేసీఆర్‌‌ అన్నారు. ‘పిట్‌‌ హెడ్‌‌ ప్లాంట్ల స్థాపన లక్ష్యం కూడా ఇదే. దూర ప్రాంతాల నుంచి బొగ్గు తెస్తే ఉత్పత్తి ధరపై రవాణా చార్జీల భారం పడుతుంది. రాష్ట్ర జెన్‌‌కో ప్లాంట్లు వంద శాతం సింగరేణి బొగ్గునే వాడుతున్నాయి. ఎన్‌‌టీపీసీ కూడా సింగరేణి బొగ్గునే వాడాలి’ అని కోరారు. దీనిపై కొత్త కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని, నిర్ణయం తీసుకునేలా చొరవ తీసుకుంటానని చెప్పారు.

ప్రాజెక్టులపై ‘సోలార్‌‌’కు అనుమతిస్తం

1,600 మెగావాట్ల ప్లాంట్‌‌లో రెండు 800 మెగావాట్ల సామర్థ్యమున్న యూనిట్లు వచ్చే ఏడాది అక్టోబర్‌‌లో, మిగతా రెండు 2021 ఫిబ్రవరిలో ఉత్పత్తి ప్రారంభిస్తాయని అధికారులు చెప్పగా గడువుకు ముందే నిర్మాణం పూర్తి చేయాలని సీఎం కోరారు. ఇక్కడ విద్యుత్‌‌ ఉత్పత్తికి ఏడాదికి పైగా పట్టనున్నందున రాష్ట్రంలో వ్యవసాయం, పరిశ్రమలు, ఎత్తిపోతల పథకాలకు తక్షణమే 2 వేల మెగావాట్లు సరఫరా చేయాలన్నారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే ఏటా 6 వేల మెగావాట్లు అవసరం ఉంటుందని గుర్తు చేశారు. సీఎం విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఎన్‌‌టీపీసీ సీఎండీ 2 వేల మెగావాట్లు సరఫరా చేస్తామని చెప్పారు. దీంతో  విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల రిజర్వాయర్లపై సోలార్‌‌ విద్యుత్‌‌ ఉత్పత్తికి ఎన్‌‌టీపీసీకి అనుమతిస్తామని సీఎం చెప్పారు. పైలెట్‌‌ ప్రాజెక్టు కింద చిన్న రిజర్వాయర్లు కేటాయిస్తామని, తర్వాత పెద్ద వాటిపై ఏర్పాటుకు అనుమతిస్తామని సీఎం తెలిపారు. విద్యుత్‌‌ వినియోగంలో దేశంలోనే రాష్ట్రం నంబర్‌‌వన్‌‌గా ఉందన్నారు.

ఇద్దరు సీఎండీలు దూసుకెళ్తున్నరు

పవర్‌‌ ప్లాంట్ల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, అనుమతుల్లో జాప్యం ప్లాంట్‌‌ నిర్మాణ సమయంపైనా పడుతోందని కేసీఆర్‌‌ చెప్పారు. పీజీసీఎల్‌‌ లైన్ల నిర్మాణం, నిర్వహణలో మెరుగైన విధానం రావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో 13.50 లక్షల మొక్కలు నాటిన ఎన్‌‌టీపీసీ అధికారులను అభినందించారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో తీవ్ర విద్యుత్‌‌ కొరత ఎదుర్కొన్నామని, ఈరోజు దేశంలోనే అత్యుత్తమంగా తెలంగాణ మారిందని అన్నారు. జెన్‌‌కో సీఎండీ ప్రభాకర్‌‌రావు, సింగరేణి సీఎండీ శ్రీధర్‌‌ నాయకత్వంలో రెండు సంస్థలు మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయని ప్రశంసించారు. సీఎం వెంట సీఎస్‌‌ ఎస్‌‌కే జోషి, మంత్రి కొప్పుల ఈశ్వర్‌‌, ఎంపీ సంతోష్‌‌కుమార్‌‌, ఎమ్మెల్యేలు చందర్‌‌, మనోహర్‌‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌‌రావు, పెద్దపల్లి కలెక్టర్‌‌ దేవసేన, కరీంనగర్‌‌ జెడ్పీ చైర్‌‌పర్సన్‌‌ తుల ఉమ, ఎన్‌‌టీపీసీ సీఎండీ గురుదీప్‌‌సింగ్‌‌, జెన్‌‌కో సీఎండీ ప్రభాకర్‌‌రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌‌శర్మ తదితరులు ఉన్నారు.

ఎఫ్‌‌సీఐలో ఈ ఏటి నుంచే ప్రొడక్షన్‌‌

రామగుండం ఫర్టిలైజర్స్‌‌ కార్పొరేషన్‌‌ ఇండియా లిమిటెడ్‌‌ ప్లాంట్‌‌ పునురుద్ధరణపైనా సీఎం సమీక్షించారు. ఎఫ్‌‌సీఐని తెరిపించడానికి కేంద్రంతో పోరాడాల్సి వచ్చిందని చెప్పారు. ఉత్పత్తి ప్రారంభమైతే రాష్ట్రానికి కావాల్సిన ఎరువులను ఇక్కడి నుంచే తీసుకోవచ్చన్నారు. ఈ ఏడాది నుంచే ప్రొడక్షన్‌‌ ప్రారంభిస్తామని ఎఫ్‌‌సీఐఎల్‌‌ సీఈవో థాపర్‌‌ తెలిపారు.