రాష్ట్రానికి ‘దావోస్​’ పెట్టుబడులు రూ.40,232 కోట్లు

రాష్ట్రానికి ‘దావోస్​’ పెట్టుబడులు రూ.40,232 కోట్లు
  • వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్న సర్కారు
  • నాలుగేండ్లలో హయ్యెస్ట్.. గతేడాదితో పోలిస్తే రెట్టింపు
  • రాష్ట్ర యువతకు 35 వేల ఉద్యోగ అవకాశాలు
  • 200 సంస్థలతో ప్రభుత్వం సంప్రదింపులు
  • ఇన్వెస్ట్‌‌మెంట్లకు ఆసక్తి చూపిన దిగ్గజ కంపెనీలు

హైదరాబాద్, వెలుగు: దావోస్ పర్యటనను కొత్త సర్కార్ విజయవంతంగా ముగించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రానున్నాయి. ఏకంగా రూ.40,232 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో వివిధ సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వీటితో దాదాపు 30 వేల నుంచి 35 వేల ఉద్యోగాలు లభించనున్నాయి. వరల్డ్ ఎకనమిక్​ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో గతేడాదితో పోలిస్తే ఈ సారి రెట్టింపు స్థాయిలో పెట్టుబడులకు ఎంఓయూలు కుదుర్చుకోవడం గమనార్హం.

దావోస్‌‌‌‌లో మూడు రోజుల పాటు జరిగిన వరల్డ్‌‌‌‌ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో ప్రపంచ దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయి. టాటా గ్రూప్, అదానీ, జిందాల్, గోడి ఇండియా, వెబ్ వెర్క్స్, ఆరాజెన్ లైఫ్ సైన్సెస్, గోద్రేజ్ ఇండియా, సర్జికల్ ఇన్‌‌‌‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్, ఉబర్, క్యూ సెంట్రియో, ఓ9 సొల్యూషన్స్ లాంటి దిగ్గజ కంపెనీలన్నీ తెలంగాణలో వివిధ రంగాల్లో తమ ప్రాజెక్టుల స్థాపన, విస్తరణకు ముందుకొచ్చాయి. దాదాపు 200 సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. మరోవైపు పెట్టుబడుల్లో రాష్ట్ర యువతకు ఏ రకంగా మేలు జరుగుతుందనే కోణంలో ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. యూత్‌‌‌‌లో నైపుణ్యాల పెంపునకు, భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఉపయోగపడే కంపెనీలపై ఎక్కువగా ఆసక్తి చూపింది. ఆ మేరకు తెలంగాణలో పెట్టుబడులు పెడితే.. ఎలాంటి సదుపాయాలు, సహకారం ప్రభుత్వం నుంచి ఉంటుందనే దానిపై వివరించి ఒప్పించడంలో సఫలమైంది. ఇక అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు అదానీ గ్రూప్ ముందుకు వచ్చింది. రాష్ట్రంలోని 50 ప్రభుత్వ ఐటీఐల్లో స్కిల్ కోర్సుల నిర్వహణకు టాటా గ్రూప్ పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నది.

రైతుల పక్షాన నిలబడాలని సీఎం పిలుపు

దావోస్‌‌‌‌లో సీఎం రేవంత్ రెడ్డి వివిధ ఫోరమ్ లలో మాట్లాడారు. చిన్న, సన్నకారు రైతుల పక్షాన నిలబడాలని ప్రపంచ దిగ్గజ కంపెనీలకు పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ప్రక్రియకు సహకరించాలని కోరారు. హైదరాబాద్‌‌‌‌ను ఆసియా మెడికల్ టూరిజం రాజధానిగా మార్చడానికి హెల్త్ కేర్ ను  సాఫ్ట్ వేర్ తో సమ్మిళితం చేయాలని అన్నారు. హెల్త్ కేర్ సేవలను అందరికీ అందుబాటులో ఉంచేందుకు, అధునాతన వైద్య సేవలను మారుమూల ప్రాంతాల ప్రజలకు అందించేందుకు డిజిటల్ సాంకేతికను ఉపయోగించాలని అన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైనా.. పారిశ్రామికవేత్తలు, గ్లోబల్ బిజినెస్ లీడర్లకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

డబ్ల్యూఈఎఫ్ వేదికగా తెలంగాణలో పెట్టుబడుల ప్రకటనలు (2020 నుంచి 2024 వరకు.రూ.కోట్లలో)
2020  –  500
2022  –  4,128
2023  –  19,900
2024  –  40,232