హరీష్ రావు తండ్రి మృతికి CM రేవంత్, కేంద్రమంత్రి సంజయ్ సంతాపం

హరీష్ రావు తండ్రి మృతికి CM రేవంత్, కేంద్రమంత్రి సంజయ్ సంతాపం

హైదరాబాద్: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూశారు. ఈ క్రమంలో హరీష్ రావు తండ్రి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులు సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. హరీష్ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

‘‘మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మరణం బాధాకరం. సత్యనారాయణ రావు ఆత్మకు శాంతి చేకూరాలి. ఈ క్లిష్ట సమయంలో హరీష్ రావు కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని అమ్మ వారిని వేడుకుంటున్నా’’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంతాపం తెలిపారు. 

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు ఇంటికెళ్లి సంతాపం వ్యక్తం చేశారు. సత్యనారాయణ రావు పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. అనంతరం హరీష్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

గతకొంత కాలంగా అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోన్న హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు మంగళవారం (అక్టోబర్ 28) తెల్లవారుజూమున తుది శ్వాస విడిచారు. బంధువులు, కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్‎లోని హరీష్ రావు నివాసం క్రిన్స్ విల్లాస్‎లో ఉంచారు. మంగళవారం (అక్టోబర్ 28) మధ్యాహ్నం ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.