రాష్ట్ర చిహ్నానికి తుదిరూపు..సిద్ధమైన రాష్ట్ర గీతం జయ జయహే

రాష్ట్ర చిహ్నానికి తుదిరూపు..సిద్ధమైన రాష్ట్ర గీతం జయ జయహే
  • రాష్ట్ర ఆవిర్భావ వేడుకలపై సీఎం రేవంత్ ​ఫోకస్​
  • అందెశ్రీ, మ్యూజిక్​ డైరెక్టర్​ కీరవాణి, కళాకారుడు రాజేశంతో రివ్యూ
  • పోరాటం, త్యాగాలను స్ఫురించేలా లోగో ఉండాలని సూచన 
  • భారీ ఎత్తున ఉత్సవాలకు ఏర్పాట్లు

హైదరాబాద్​, వెలుగు : తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జూన్​ 2న నిర్వహించే ఈ వేడుకల్లో రాష్ట్ర లోగో, రాష్ట్ర గీతాన్ని సీఎం రేవంత్​రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఇందుకు మరో మూడు రోజులే సమయం ఉండడంతో సీఎంప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర లోగో, రాష్ట్ర గీతంపై జూబ్లీహిల్స్​లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం రివ్యూ చేశారు. లోగో రూపకర్త రుద్ర రాజేశం, గీత రచయిత అందెశ్రీ, మ్యూజిక్​ డైరెక్టర్​ ఎం.ఎం. కీరవాణి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం తదితరులతో రేవంత్​రెడ్డి వేర్వేరుగా సమావేశమై, పలు అంశాలపై చర్చించారు. 

తెలంగాణ పోరాటం, త్యాగాలను స్ఫురించేలా రాష్ట్ర చిహ్నం ఉండాలని సూచించారు. రాష్ట్ర గీతం ట్యూన్​సిద్ధం కాగా, దీనిపై కూడా పలు సూచనలు చేశారు. గత ప్రభుత్వ రాచరిక వ్యవహారాలకు భిన్నంగా సీఎం ముందుకు వెళ్తున్నారు. ప్రగతి భవన్​ కంచె తొలగించి.. ప్రజా వాణి కార్యక్రమం తీసుకువచ్చారు. ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా టీఎస్​ స్థానంలో టీజీ కోడ్​ను అమల్లోకి తెచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహంలోనూ మార్పులు చేయిస్తున్నారు. ఈ సమావేశాల్లో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి,  ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాంచంద్రు నాయక్, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ మహేశ్​ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే సంపత్, ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ పాల్గొన్నారు.

ట్యాంక్ బండ్ పై కనుల పండువగా కార్నివాల్​

జూన్ 2 వ తేదీన  సాయంత్రం ట్యాంక్ బండ్ పై పండుగ వాతావరణాన్ని తలపించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ట్యాంక్ బండ్ పరిసరాలను రంగు రంగుల  విద్యుద్దీపాలతో అలంకరించనున్నారు.  సీఎం రేవంత్​తోపాటు రాష్ట్ర   మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అవతరణ వేడుకల్లో సామాన్య ప్రజలు కూడా ఉత్సాహంగా తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించేలా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. 

సందర్శకులను ఆకట్టుకునే ప్రదర్శనలు, ఆట వస్తువులు, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు పై అధికారులు ప్రత్యేక శ్రద్ధవహిస్తున్నారు. ట్యాంక్ బండ్ పై దాదాపు 80 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో రాష్ట్రంలోని హస్త కళలు, స్వయం సహాయక బృందాలు తయారు చేసే వస్తువులు, చేనేత ఉత్పత్తులు, నగరం లోని పలు ప్రముఖ హోటళ్ల ఫుడ్ కోర్టులు ఉండనున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పలు సాంస్కృతిక కళా బృందాలతో కార్నివాల్ ఏర్పాటు చేస్తున్నారు.  

ప్రధాన వేదికపై పలు శాస్త్రీయ, జానపద, దక్కనీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం 'జయ జయహే తెలంగాణ' పై పోలీసు సిబ్బందితో  ప్రదర్శన నిర్వహించనున్నారు. పటాకలు కాలుస్తూ ఉత్సవ వాతావరణాన్ని అనుభూతి పొందేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

గ్రామ గ్రామాన వేడుకలు

కాంగ్రెస్​ సర్కారు ఏర్పడిన తర్వాత మొదటిసారి నిర్వహిస్తున్న వేడుకలు కావడంతో గతానికి భిన్నంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  రాష్ట్ర రాజధానితోపాటు ప్రతి జిల్లా, మండలం, గ్రామాల్లో అంగరంగ వైభవంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని సీఎం రేవంత్​రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆఫీసర్లు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రాష్ట్ర రాజధానిలో వేడుకలకు సికింద్రాబాద్​లోని పరేడ్​గ్రౌండ్​ను సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు,  ప్రముఖులు హాజరుకానున్నారు. 

జూన్​ 2న ఉదయం రేవంత్​రెడ్డి గన్-పార్క్ లో అమరవీరుల స్తూపానికి  పూలమాలలు సమర్పించి, నివాళులు అర్పించిన అనంతరం పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు.  పరేడ్ గ్రౌండ్ లో జరిగే ఉత్సవాలకు దాదాపు 20వేల మందికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. షామియానాలు వేయిస్తున్నారు. సభా ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్​ క్యాంపులతోపాటు తాగునీటి వసతి, మరుగుదొడ్ల సౌకర్యం కల్పిస్తున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఎల్ఈడీ స్క్రీన్స్​, కార్యక్రమ లైవ్ ప్రసారానికి ఏర్పాట్లు చేస్తున్నారు.  అలాగే, జిల్లా, మండలం, గ్రామస్థాయిల్లో కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.