దేశ ఆర్థిక వ్యవస్థలో 10 శాతం తెలంగాణ అందిస్తోంది : సీఎం రేవంత్

 దేశ ఆర్థిక వ్యవస్థలో 10 శాతం తెలంగాణ అందిస్తోంది : సీఎం రేవంత్

  దేశ ఆర్థిక వ్యవస్థలో 10 శాతం తెలంగాణ అందిస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  గచ్చిబౌలిలో ఎలీ లిల్లీ  గ్లోబల్ కెపబిలిటీ సెంటర్  ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు రేవంత్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో ఈరోజు చరిత్రక మైలురాయిగా  నిలిచిపోతుందన్నారు. 2000లకు పైగా  లైఫ్ సెన్సెస్ కంపెనీలు  హైదరాబాద్ లో ఉన్నాయని చెప్పారు. 200కి పైగా ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌ నగరం నుంచి తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్  లైఫ్ సైన్సెస్ ఆఫ్ ఇండియాగా మారుతోందన్నారు 

రేవంత్ మాటల్లో..  ‘2047 నాటికి  తెలంగాణను  ట్రిలియన్ డాలర్ ఎకానమిగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.  ఎలీ లిల్లీ (Eli Lilly) సంస్థ లీడర్ షిప్ ను,  ఉద్యోగులను హైదరాబాద్‌ నగరానికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను.  ఈ రోజు ప్రారంభమైన ఎలీ లిల్లీ నూతన కేంద్రం… ఆ సంస్థ గ్లోబల్ కార్యకలాపాలను మరింత వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ టెక్నాలజీ, ఇన్నొవేషన్ సెంటర్, ప్రపంచవ్యాప్తంగా రోగులకు పరిష్కారాల కోసం పరిశోధనలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎలీ లిల్లీ సంస్థను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయడమంటే ఈ నగరం ఘనతను మీరు ప్రపంచానికి చాటి చెప్పినట్లే.  హైదరాబాద్‌ నగరంలో టాలెంట్ ఉంది, లీడర్‌షిప్ ఉంది, విజన్ ఉంది, మంచి పాలసీ ఉంది, మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అందుకే ఎలీ లిల్లీ లాంటి గ్లోబల్ లీడర్‌కు ఇది అనుకూలమైన కేంద్రంగా మారింది. భారతదేశ లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్ ఇప్పటికే గుర్తింపు పొందింది. 

భారత్‌లో ఫార్మాస్యూటికల్ ఉత్పత్తిలో సుమారు 40 శాతం తెలంగాణలోనే జరుగుతోంది.  ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ప్రతి 3 టీకాలలో ఒకటి హైదరాబాద్‌లో అభివృద్ధి చేయడం లేదా తయారవుతుండటం మాకు గర్వకారణం.  హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీ, భారతదేశంలోని అతిపెద్ద లైఫ్ సైన్సెస్  పరిశోధన- అభివృద్ధి సముదాయంగా నిలిచింది.  ప్రపంచంలోని అగ్రశ్రేణి ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ సంస్థల కోసం హైదరాబాద్ అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రపంచ గమ్యస్థానంగా మారింది.  ఈరోజు, ఎలీ లిల్లీ సంస్థ రాకతో, లైఫ్ సైన్సెస్ రంగంలో మేము మరో మెట్టుకు చేరుకున్నాం.  మధుమేహం, ఆంకాలజీ, ఇమ్యునాలజీ, న్యూరోసైన్స్ రంగాలలో ఎలీ లిల్లీ సంస్థ కృషి ఒక గేమ్-ఛేంజర్ గా నిలిచిపోతుంది. 

►ALSO READ | ఇదే పచ్చి నిజం.. 5 ఏళ్లలో AI 80 శాతం ఉద్యోగాలను రీప్లేస్ చేస్తుందన్న ఇన్వెస్టర్!

 ఎలీ లిల్లీ సంస్థ చేసిన కృషి మిలియన్ల మంది జీవితాలను ప్రభావితం చేయడంతో వారిని రక్షించడానికి తోడ్పడింది.  నేను, మా  ప్రభుత్వం అన్ని వేళలా మీకు అండగా ఉంటాం.  పారదర్శకత, అభివృద్ధి, ఆవిష్కరణలకు అనువైన వాతావరణం కల్పిస్తాం.  హైదరాబాద్‌లో పని చేయబోయే ఎలీ లిల్లీ ఉద్యోగులు.. కేవలం హైదరాబాద్‌లో నివసించడం,  పనిచేయడం మాత్రమే కాదు ఇప్పుడు మీరు మా కుటుంబ సభ్యులుగా మారారు.  మీరు హైదరాబాద్ నుంచి గ్లోబల్ హెల్త్‌కేర్ భవిష్యత్తును తీర్చిదిద్దనున్నారు.  మీ సహకారంతో, తెలంగాణను భారతదేశ లైఫ్ సైన్సెస్  రాజధానిగా మాత్రమే కాకుండా  ప్రపంచంలో ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలకు నంబర్ వన్ హబ్‌గా తీర్చిదిద్దుతాం’. అని రేవంత్ అన్నారు.