
- వంద శాతం మురుగు నీటి శుద్ధి లక్ష్యంగా ప్రణాళికలు
- ఓఆర్ఆర్ పరిధిలో 39 ఎస్టీపీలకు శంకుస్థాపన
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో100% మురుగునీటి శుద్ధి లక్ష్యంగా మెట్రో వాటర్ బోర్డు అంబర్‌పేటలో నిర్మించిన ఆరు ఎస్టీపీలను ఆదివారం సీఎం రేవంత్ ప్రారంభించారు. రూ.539.23 కోట్లతో వీటిని నిర్మించారు. అలాగే, రూ.109.24 కోట్లతో రాజేంద్రనగర్ నియోజకవర్గపరిధిలో 64 ఎంఎల్డీల సామర్థ్యం గల ఎస్టీపీని అత్తాపూర్ లో నిర్మించారు. రూ.44.46 కోట్లతో కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని 25 ఎంఎల్డీల కెపాసిటీ ఉన్న ముల్లకతువా ఎస్టీపీని కూడా అధికారులు పూర్తి చేశారు.
రూ.34.13 కోట్లతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని 14 ఎంఎల్డీల సామర్థ్యం గల మరో ఎస్టీపీని శివాలయ నగర్లో నిర్మించారు. రూ.3849.10 కోట్లతో ఓఆర్ఆర్ పరిధిలో కొత్తగా నిర్మించనున్న 39 ఎస్టీపీలకు కూడా సీఎం శంకుస్థాపన చేశారు. ఔటర్ రింగ్‌రోడ్ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో కూడా 39 ఎస్టీపీలను నిర్మిచడంతో 972 ఎంఎల్డీల మురుగు నీటిని శుద్ధి చేసి మూసీలోకి వదిలేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మూసీ ప్రక్షాళన పథకంలో భాగంగానే ఈ ఎస్టీపీలను నిర్మిస్తున్నారు. హైదరాబాద్ సిటీలో 1,650 ఎంఎల్డీ మురుగునీరు ఉత్పత్తి అవుతుండగా, ప్రస్తుతం నిర్మించిన ఎస్టీపీలతో 925 ఎంఎల్డీ మురుగునీరు శుద్ధి చేసే సామర్ధ్యం ఏర్పడింది. త్వరలో ప్రారంభించే 39 ఎస్టీపీలతో మరో 725 ఎంఎల్డీల మురుగునీటి శుద్ధికి అవకాశం ఉంటుంది.