రేవంత్ గురి .. 14 సీట్లు గెలిచేందుకు మాస్టర్ ప్లాన్

రేవంత్ గురి .. 14 సీట్లు గెలిచేందుకు మాస్టర్ ప్లాన్
  • హోరాహోరీ ఉన్న చోట స్పెషల్​ ఫోకస్.. ట్రయాంగిల్ ఫైట్ సీట్లలో కొత్త వ్యూహం
  • పాలనే రెఫరెండంగా జనంలో ప్రచారం.. ఇంటి నుంచే ఎలక్షన్ ప్లాన్లు అమలు
  • లోకల్ లీడర్లు, కేడర్​కు నేరుగా ఫోన్లు.. సౌత్​లో కాంగ్రెస్​కు కీలకంగా తెలంగాణ

రాష్ట్రంలో ఎక్కువ ఎంపీ సీట్ల గెలుపే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి హోంవర్క్ చేస్తున్నారు. ఎక్కువ స్థానాల్లో పార్టీ​ జెండా ఎగురవేసి తనకు సీఎంగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్​కు జాతీయస్థాయిలో అండగా నిలువాలని భావిస్తున్నారు. దాదాపు నెలరోజులుగా పూర్తిగా ఇంటి నుంచే రాజకీయ వ్యూహాలను అమలుచేస్తున్నారు. ఇటు ముఖ్యనేతల నుంచి అటు లోకల్ గా కింది స్థాయి కేడర్ వరకు నేరుగా ఫోన్​లో మాట్లాడుతున్నారు. ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా గెలుపుపైనే ఫోకస్ పెట్టారు. సెగ్మెంట్లలో పోటీదారుల బలాబలాలను బట్టి ఎప్పటికప్పుడు స్ట్రాటజీలో మార్పులు చేస్తున్నారు. మరోవైపు తన పాలనే రెఫరెండంగా చెబుతూ జనంలోకి వెళ్తున్నారు. తక్కువటైంలోనే 5 గ్యారంటీల అమలు, ప్రజలకు అందుబాటులో పాలన, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అన్నీ కలిసి 14 సీట్లు గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు.

హైదరాబాద్​, వెలుగు: పీసీసీ చీఫ్​గా కాంగ్రెస్  ఎంపీ అభ్యర్థుల ఎంపికలో అన్నీ తానై వ్యవహరించిన సీఎం రేవంత్ రెడ్డి వారిని గెలిపించుకునే బాధ్యతను కూడా తానే తీసుకున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా, పార్టీ బాస్​గా మొదటిసారి లోక్ సభ ఎన్నికలను ఎదుర్కొంటున్న ఆయన దీన్ని సవాల్​​గా తీసుకున్నారు. దక్షిణాదిలో తెలంగాణ, కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండటంతో ఎక్కువ సీట్లు గెలువాలనే పట్టుదలతో ఉన్నారు. సౌత్ లో తెలంగాణ పైనే బీజేపీ కూడా ఫోకస్ చేయడంతో..  రేవంత్ మరింత సీరియస్​గా దృష్టి పెట్టారు. తన ఇమేజ్​కు, పాలనకు రెఫరెండమే అంటూ ప్రతిపక్షాలకు సవాల్ చేస్తున్నారు. 

పొలిటికల్ హోం వర్క్

గత నెలలో షెడ్యూల్​ ప్రకటనతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి సీఎం రేవంత్ ఇంట్లోనే సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు 14  సీట్ల గెలుపు టార్గెట్ గా ప్లానింగ్ మొదలుపెట్టారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్​చార్జి దీపాదాస్ మున్షీ, పార్టీ సీనియర్లను సమన్వయం చేస్తూ అన్ని ఎంపీ సీట్లపై పూర్తి సమాచారంతో వ్యూహాలను రూపొందిస్తున్నారు. గ్రౌండ్ లో పార్టీ, నేతల బలాలు, బలహీనతలపై స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలుతో ఎప్పటికప్పుడు రిపోర్టులు తీసుకుంటున్నారు. వీటి ఆధారంగానే దశలవారీగా పార్టీ అభ్యర్థులను ఫైనల్ చేస్తూ వచ్చారు.  

ప్రచారంపైనా ఫోకస్​

పార్టీ అభ్యర్థుల్లో సీనియర్లు, జూనియర్లు, పాత, కొత్త నేతల బ్యాలెన్స్ తో తన మార్క్ వేసిన రేవంత్ ప్రచారంపైనా ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో సభ పెట్టిన తుక్కుగూడలోనే జనజాతర సభను నిర్వహించి ప్రచారంలో తొలి అడుగు వేశారు. 

ఎప్పటికప్పుడు ముఖ్య నేతలతో మీటింగ్ లు, సెగ్మెంట్ లీడర్లతో మాట్లాడటంతోపాటు అవసరమైతే లోకల్ కార్యకర్తలకు నేరుగా ఫోన్ చేస్తున్నారు. బాధ్యతలు అప్పగిస్తూ కలిసికట్టుగా పనిచేసేలా ఆదేశాలిస్తున్నారని నేతలు చెబుతున్నారు. సెగ్మెంట్ల వారీగా సమన్వయ కమిటీలు, పార్లమెంట్, అసెంబ్లీ, బూత్ కమిటీలు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో అంతర్గతంగా విభేదాలు ఉన్నవాటిని గుర్తించి.. ఈ సారి ముందే జాగ్రత్త పడుతున్నారు. స్థానికంగా కీలక నేతలతో భేటీ అవుతున్నారు. 

ఇటు పాలన.. అటు ప్లానింగ్

వందరోజుల్లో ఏం చేశామో చెబుతూ జనంలోకి వెళ్తున్న రేవంత్ రెడ్డి.. అమలుచేసిన గ్యారంటీలు, అమలుకు సిద్ధంగా ఉన్న పథకాలను వివరిస్తున్నారు. తక్కువటైంలో నిరుద్యోగులు, రైతుల కోసం ఏం చేశారో చెబుతున్నారు. ఇదే టైంలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన నష్టాలు, వాటి వల్ల తలెత్తిన ఇబ్బందులను జనం ముందుంచుతున్నారు. కాళేశ్వరం కుంగుబాటు, ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు, భూకబ్జాలు, ఇష్టారాజ్యంగా నిధుల వాడకం, తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లాంటివి ప్రతి ఇంటా చర్చించుకునేలా చేశారు. 

భార్యాభర్తల ఫోన్ల ట్యాపింగ్, బ్లాక్ మెయిలింగ్, కోట్లాది రూపాయల వసూళ్లు, చివరికి మహిళలనూ వేధించిన ఘటనలు జనంలో కలకలం రేపాయి. మరోవైపు సర్కారు నిలబడదంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం, బీఆర్ఎస్, -బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్నాయనే విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇక 17 ఎంపీ సీట్లలో కనీసం 14 గెలిచేలా రేవంత్​రెడ్డి రాజకీయ వ్యూహాన్ని అమలుచేస్తున్నారు. దీనికోసం కాంగ్రెస్ సునాయాసంగా గెలిచే సీట్లు, కొంత ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన సెగ్మెంట్లను గుర్తించారు. 

తొలి దశలో సొంత పార్టీ ఎమ్మెల్యేల బలం, బలగం ఉన్న ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, భువనగిరి, పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాల్లో పూర్తి సానుకూలంగా ఉన్నట్టు అంచనా వేశారు. ఆ సెగ్మెంట్లకు ఇప్పటికే మంత్రులను ఇన్​చార్జీలుగా నియమించి రోజువారీగా ప్రచారం తీరును మానిటర్ చేస్తున్నారు. ఈ సెగ్మెంట్ల సమాచారాన్ని రకరకాల మార్గాల్లో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఇందుకోసం రేవంత్ ప్రత్యేక విభాగాన్ని కూడా నియమించినట్లు తెలుస్తోంది. ఇక ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మల్కాజ్ గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్, కరీంనగర్, హైదరాబాద్ సీట్లపై కిందిస్థాయిలో కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. బలహీనపడిన బీఆర్ఎస్ ఓట్లను కాంగ్రెస్ వైపు మలుపుకోవడం, బీజేపీ ఫోకస్ ఉన్న ప్రాంతాల్లో కొత్త వ్యూహంతో ఆయన పనిచేస్తున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 

ఆదిలాబాద్ పై ఆచితూచి

2019లో ఆదిలాబాద్ సీటు బీజేపీ సొంతమైంది. అక్కడ ఆ పార్టీకి బలం, బలగం లేకున్నా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఓట్ల చీలిక బీజేపీకి కలిసొచ్చింది. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సోయం బాపురావుకు 35.5% ఓట్లు రాగా.. బీఆర్ఎస్ కు 30% , కాంగ్రెస్ కు 29.05% ఓట్లు పడ్డాయి. ఈసారి ఆ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఖానాపూర్ మాత్రమే కాంగ్రెస్ ఖాతాలో ఉంది. దీంతో ఈసారి పొలిటికల్ బ్యాగ్రౌండ్ లేని, ఎప్పుడూ ప్రజల్లో ఉండే టీచర్ ఆత్రం సుగుణను కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారు. అసెంబ్లీ గెలుపు కంటే ముందు నుంచే ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి, ఉట్నూర్ లాంటి ప్రాంతాలు వేదికగా కాంగ్రెస్ జనంలోకి పోతున్నది. 

పార్టీ అధికారంలోకి వచ్చాక ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప లాంటి బలమైన నేతలు కాంగ్రెస్ లో చేరారు. నిర్మల్, ఆదిలాబాద్ కు చెందిన మరికొందరు సీనియర్లు రేవంత్ కు టచ్ లో ఉన్నట్టు చెబుతున్నారు. బీఆర్ఎస్ బలహీనపడటం వల్ల ఆ పార్టీ ఓట్లు కాంగ్రెస్ కు టర్న్ అయ్యేలా రేవంత్ వ్యూహాన్ని అమలుచేస్తున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లా ట్రయాంగిల్ ఫైట్ కాకుండా రెండు పార్టీల పోరుగా మారితే కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. దీనికి తోడు ఆదివాసీ ఆడబిడ్డ, మంత్రి సీతక్కకు ఈ సెగ్మెంట్ బాధ్యత అప్పగించారు. ఆమె ఇప్పటికే ఆదిలాబాద్ మొత్తాన్ని చుట్టివస్తున్నారు. తనదైన శైలిలో జనంలో కలిసిపోతున్నారు. ఆదిలాబాద్ సెగ్మెంట్ పరిధిలో బీజేపీకి 4, బీఆర్ఎస్ కు 2 ఎమ్మెల్యే స్థానాలుంటే కాంగ్రెస్ కు ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. 

ఇందూరు ఇంద్రజాలం

నిజామాబాద్ పార్లమెంట్ సీటుపై సీఎం రేవంత్ మరింత దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. ఇది బీజేపీ సిట్టింగ్ సీటు అయినా ఈసారి హస్తగతం చేసుకోవాలని సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సీటు పరిధిలో కాంగ్రెస్ 2, బీజేపీ 2, బీఆర్ఎస్ 3 స్థానాలను గెలిచాయి. గత రెండు అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే కాంగ్రెస్ ఓట్లు బాగా పెరిగాయి. దీంతో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని రంగంలోకి దించారు. ఇక్కడ్నుంచి క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ బలహీనపడటంతో మండల, గ్రామస్థాయి క్యాడర్ కాంగ్రెస్ వైపు మారారు. పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడం, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఒకే సామాజికవర్గం కావడంతో కాంగ్రెస్ కు కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. స్థానికంగా పెండింగ్ లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడం కోసం రాష్ట్ర సర్కారు మంత్రి శ్రీధర్ బాబుతో కమిటీ వేసింది. ఈ కమిటీలో జీవన్ రెడ్డి కూడా ఉన్నారు. ఇదే అంశంతో ఆయన రైతుల ముందుకెళ్తున్నారు. 

ఆ రెండూ హాట్ సీట్లే

గ్రేటర్ పరిధిలో అసెంబ్లీలో సరైన ఫలితాలు రాకపోవడంతో.. ఇక్కడ ప్రయోగాలకే రేవంత్ మొగ్గు చూపించారు. చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని పార్టీలోకి తీసుకున్నారు. ఇదే సీటు టికెట్ ఆశించిన పట్నం సునీతా మహేందర్ రెడ్డిని మల్కాజ్ గిరి బరిలో దింపారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మారిన పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఓట్లను మళ్లించే వ్యూహంతోనే రేవంత్ పావులు కదుపుతున్నారు. గత ఎన్నికల్లో తాను గెలిచిన మల్కాజ్ గిరి సీటును మళ్లీ గెలుచుకునేలా లీడర్లు, కేడర్ ను గైడ్ చేస్తున్నారు. ఈ స్థానాల్లో మెజార్టీ ఓట్లు సాధించేందుకు రేవంత్ ప్రత్యేక బృందాలతో మానిటర్ చేస్తున్నారు.

ఓరుగల్లుపై రేవంత్ మార్క్

వరంగల్, సికింద్రాబాద్ లోక్​సభ స్థానాలను రేవంత్ రాజకీయ ప్రయోగశాలలుగా ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరిని పార్టీలోకి తీసుకొచ్చి, ఆయన బిడ్డ కడియం కావ్యకు వరంగల్ టికెట్ ఇవ్వడంపై కొన్ని రోజులు మిశ్రమ స్పందన వచ్చింది. దీనిపై రేవంత్ జిల్లా నేతలను పిలిచి. మాట్లాడినట్టు తెలుస్తోంది. కడియం అవసరం, అనివార్యం ఏమిటో వారికి వివరించి, నచ్చజెప్పినట్టు సమాచారం. వరంగల్ పరిధిలో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండగా.. కడియం చేరికతో లోక్​సభ నియోజకవర్గం మొత్తం హస్తగతమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో ఎమ్మెల్యే కనీసం 25వేల మేజార్టీ తగ్గకుండా గెలిచారు. కాంగ్రెస్​కు పాలకుర్తి నుంచి ఏకంగా 55 వేల ఓట్ల ఆధిక్యత దక్కింది. ఈ బలాన్ని నిలబెట్టుకునేలా ఎమ్మెల్యేలు, మేయర్, కార్పొరేటర్లు, ఇతర నేతలతో రేవంత్ స్వయంగా సమన్వయం చేస్తున్నారు. సికింద్రాబాద్ లో కూడా రేవంత్ ఇదే ప్రయోగం చేశారు.  

నేడు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశం

కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశం బుధవారం జరగనుంది. జూబ్లీ‌హిల్స్‌లోని ఎమ్మేల్యే రాజ్ గోపాల్ రెడ్డి ఇంట్లో ఈ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభంకానుంది. భువనగిరి టికెట్‌ను చామల కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గెలిచారు. దీంతో సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ఈ సమావేశంలో సీఎం రేవంత్ సారథ్యంలో వ్యూహ రచన చేయనున్నట్లు తెలుస్తోంది.

గులాబీ గడ్డపై కాంగ్రెస్ జెండా!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత జిల్లా ఉమ్మడి మెదక్ పై కూడా రేవంత్ ప్రయోగం చేస్తున్నారు. మెదక్, జహీరాబాద్ లో బీసీ అభ్యర్థులనే బరిలో నిలిపారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు సీట్లు బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల ప్రకటన తర్వాత ముదిరాజ్ నేత నీలం మధును నిలబెట్టి ప్రత్యర్థి పార్టీలకు రేవంత్​సవాల్ విసిరారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల వైఫల్యాలనే అస్త్రాలుగా ఎంచుకుని కాంగ్రెస్​ ప్రచారం సాగిస్తున్నది. పార్టీలోని అసమ్మతులను బుజ్జగిస్తూనే సీనియర్ మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖకు ఇన్​చార్జి బాధ్యతలు అప్పగించారు. జహీరాబాద్ నుంచి సీనియర్ నేత సురేశ్​ షెట్కార్​ను బరిలో నిలిపారు. మొత్తంగా పార్లమెంట్​ ఎన్నికల తర్వాత గులాబీ గడ్డపై కాంగ్రెస్​ జెండా ఎగిరేసేందుకు రేవంత్​రెడ్డి శాయశక్తులా కృషి చేస్తున్నారు.