
- ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఆస్తి, ప్రాణ నష్టం జరిగే ప్రమాదం
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు తప్పనిసరిగా డ్యూటీలో ఉండాలి
- అధికారులు హాఫ్ డే ఫీల్డ్‌లో తిరగాలి.. కలెక్టర్లు రోజూ రిపోర్ట్ ఇవ్వాలి
- 25 నుంచి ప్రతి మండల కేంద్రంలో రేషన్ కార్డుల పంపిణీ
- సరిపడా ఎరువులు ఉన్నా తప్పుడు ప్రచారం జరుగుతున్నది
- వ్యవసాయేతర అవసరాలకు యూరియా మళ్లిస్తే చర్యలు తీసుకోండి
- వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: వానాకాలం సీజన్లో కలెక్టర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాలు, వరదల వల్ల గానీ.. సీజనల్ వ్యాధుల వల్లగానీ ఎక్కడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ‘‘రైతులు, గిరిజనులు, పేదల ప్రాణాలు మనకు అత్యంత ముఖ్యం.. మీరు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రాణ, ఆస్తి నష్టం జరగవచ్చు.. అందుకు బాధ్యులైన ఏ అధికారినీ ఉపేక్షించబోం..’’ అని కలెక్టర్లను సీఎం హెచ్చరించారు.
ముఖ్యంగా ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాచలం లాంటి ఏజెన్సీ జిల్లాలపై ఫోకస్పెట్టాలని.. ఆయా చోట్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు తప్పనిసరిగా విధుల్లో ఉండేలా చూసుకోవాలని, కలెక్టర్లు ప్రతిరోజూ తనకు రిపోర్ట్ చేయాలని ఆయన స్పష్టంచేశారు. భారీ వర్షాలు, వ్యవసాయం, ఆరోగ్యం, సాగునీటి సరఫరా, రేషన్ కార్డుల జారీ వంటి ఐదు కీలక అంశాలపై సోమవారం సెక్రటేరియేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ ఐదు కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ఒక్కో నియోజకవర్గ బాధ్యతలను ఆర్డీవో, ఆపైస్థాయి అధికారులకు అప్పగించాలని ఆయన సూచించారు. రేషన్ కార్డుల్లోని సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్లను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ఇప్పటివరకు 7 లక్షలకుపైగా కొత్త రేషన్‌కార్డులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు రేషన్‌కార్డుల పంపిణీ చేయాలని ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రులు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక చోట తప్పనిసరిగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని.. అన్ని మండల కేంద్రాల్లో పంపిణీ జరగాలని ఆయన సూచించారు.
రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, ఆందోళన అవసరం లేదని సీఎం అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 96 లక్షల 95 వేల రేషన్ కార్డులు ఉన్నాయని.. దాదాపు 3 కోట్ల 10 లక్షల మంది సన్నబియ్యాన్ని వినియోగించుకుంటున్నారని తెలిపారు. రేషన్ కార్డుల పంపిణీని పకడ్బందీగా నిర్వహించాలని, జిల్లా ఇన్చార్జ్ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం రేవంత్ ఆదేశించారు.
ప్రతి మండలానికి ఒక డిసిగ్నేటెడ్ ఆఫీసర్‌ను నియమించి.. కొత్త కార్డులు, పేర్ల తొలగింపు, నమోదు వంటి వివరాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఇంతకుముందు రేషన్ కార్డులకు, రేషన్ దుకాణాలకు డిమాండ్ లేదని.. దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు పెద్దగా పట్టించుకునేవారు కాదని.. అవి బ్లాక్ మార్కెట్‌లో అమ్ముడుపోయేవని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రజలందరికీ సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించడంతో ప్రతి ఒక్కరు సన్నబియ్యం తీసుకుంటున్నారని తెలిపారు. ఇటీవల పౌరసరఫరాల శాఖ మూడు నెలలకు ఒకేసారి రేషన్ ఇచ్చిందని, దీనివల్ల రేషన్ కార్డులకు విపరీతమైన డిమాండ్ పెరిగిందని ఆయన అన్నారు.
క్షేత్రస్థాయిలో పర్యటించండి
సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులు ప్రబలే సమయం కనుక అలర్ట్‌గా ఉండాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. ముఖ్యంగా ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాచలం వంటి గిరిజన ప్రాంతాల్లోని ఆదివాసీలు ఈ వ్యాధుల బారిన పడుతున్నారని... వారికి రవాణా సౌకర్యాలు లేకపోవడం, వైద్య సహాయం సరిగా అందకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయన్నారు. వర్షాలు వచ్చినప్పుడు డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి దోమల వల్ల కలిగే వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని హెచ్చరించారు. నీరు నిలిచి ఉండే ప్రదేశాల్లో దోమలు పెరగకుండా కిరోసిన్ చల్లడం, దోమల మందు కొట్టడం వంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రుల్లో డాక్టర్లు అందరూ విధుల్లో ఉండేలా చూడాలని, డాక్టర్లు లేదా వైద్య సిబ్బంది గైర్హాజరైతే ప్రజలకు అసౌకర్యం కలుగుతుందన్నారు.
కలెక్టర్లు పర్యవేక్షించి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు విధులకు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని తెలిపారు. మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పశువుల ఆరోగ్యం విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని, వాటికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా కిందిస్థాయిలో ఉండే వెటర్నరీ డిపార్ట్‌మెంట్లను అలర్ట్ చేయాలని ఆదేశించారు. కలెక్టర్లు పీహెచ్‌సీలు, ఏరియా హెల్త్ సెంటర్లు, జిల్లా ఆస్పత్రులను ఆకస్మిక తనిఖీలు చేయాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్లు, లోకల్ బాడీస్ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. జిల్లా పరిధిలో ఉన్న ఐఏఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో హాఫ్ డే పర్యటనలు, ఆకస్మిక తనిఖీలు తప్పనిసరిగా చేయాలన్నారు.
ఉదయం 7 గంటలకు లేచి ఫీల్డ్‌పైకి వెళ్తే, కింది స్థాయి సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉంటారని.. పనిలో నిమగ్నమవుతారని ఆయన చెప్పారు. సీఎంవో అధికారులకు కూడా ఒక్కొక్క అధికారికి రెండు జిల్లాలను కేటాయించి, జిల్లా కలెక్టర్లు ఏం చేస్తున్నారో నివేదిక తయారు చేసి తన దృష్టికి తీసుకురావాలన్నారు. సీఎస్‌ను కూడా ఆదేశించానని, ప్రతిరోజు 33 జిల్లాల కలెక్టర్ల కార్యాచరణ నివేదికను మరుసటి రోజు ఉదయమే తనకు అందించాలని తెలిపారు. ఆదివాసీలు, గిరిజనులు ఉన్న ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆస్పత్రుల్లో మందులు, డాక్టర్ల లభ్యతను పర్యవేక్షించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని స్పష్టం చేశారు.
ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే, ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని.. కంటింజెన్సీ ఫండ్స్‌ను వాడుకోవాలని చెప్పారు. నిధులు తక్కువ పడితే సీఎస్ కు తెలియజేయాలని అధికారులకు సూచించారు. అత్యవసర సమయాల్లో కలెక్టర్లు ఖర్చు చేయడానికి ఒక కోటి రూపాయల వరకు నిధులు వారి ఖాతాల్లో ఉండేలా చూడాలన్నారు.
సరిపడేంత ఎరువులు
రాష్ట్రంలో సరిపడినంత ఎరువులు ఉన్నాయని, ఆందోళన అవసరం లేదని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఎరువుల దుకాణాల్లో ఎంత స్టాక్ ఉందో బయట నోటీస్ బోర్డు పెట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం చాలా బఫర్ స్టాక్ ఉందని, ఆగస్టు నెలలో అవసరం పడితే కేంద్రం నుంచి తెచ్చుకుంటామన్నారు. ఎరువులు దొరకడం లేదని ఒక కృత్రిమ కొరతను సృష్టించి, సోషల్ మీడియాలో భయపెట్టి, ప్రజలు దుకాణాల వద్ద ముందుగానే గుమిగూడే పరిస్థితి కల్పిస్తున్నారని మండిపడ్డారు. అందుకే కలెక్టర్లు తమ పరిధిలో ఎన్ని దుకాణాలు ఉన్నాయి, వాటి దగ్గర ఎంత స్టాక్ ఉంది, ఆ రోజు ఎంత స్టాక్ ఇవ్వగలరు అనేది నోటీస్ బోర్డు పెట్టి స్పష్టంగా డిస్‌ప్లేలో పెట్టించాలని ఆయన సూచించారు. ప్రతి ఎరువుల దుకాణం దగ్గర ఇద్దరు పోలీసులు, రెవెన్యూ సిబ్బందిని పెట్టి క్రమబద్ధీకరించాలన్నారు. రాయితీ ఎరువులను ఇతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం హెచ్చరించారు.
వ్యవసాయేతర అవసరాలకు యూరియాను దారి మళ్లించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎరువులకు సంబంధించిన ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్‌ను బస్ స్టాండ్‌లు, ఇతర పబ్లిక్ ప్లేస్‌లలో ప్రదర్శించాలని ఆదేశించారు. ఇటీవల కేంద్రమంత్రి జేపీ నడ్డాను కలిసినప్పుడు.. 20-–25% ఎరువులు వ్యవసాయం కాకుండా ఇతర కార్యక్రమాలకు, ముఖ్యంగా డీజిల్‌లో పొగ తగ్గించడానికి, కాలుష్యం తగ్గించడానికి ఇతర వాటికి సబ్సిడీ యూరియాను వాడుతున్నారని ఆయన చెప్పారని సీఎం గుర్తుచేశారు.
ఐ బ్లూ, డీఈఎఫ్ తయారీ యూనిట్లపై కూడా నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయని తెలిపారు. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్‌ను ఎరువుల దుకాణాల ముందు, బస్ స్టాండ్‌లు, ఇతర పబ్లిక్ ప్లేసులలో కనిపించేలా ప్రదర్శించాలని సీఎం ఆదేశించారు. నాట్లు ఎంత వేశారో, ఎంత యూరియా అవసరం ఉందో గుర్తించాలన్నారు. గోదావరిలో ఆగస్టులో, కృష్ణాలో కొంచెం ముందు నీళ్లు వస్తాయని, దాని ప్రకారం వ్యవసాయం జరిగితే యూరియా కూడా సరైన రీతిలో అందుబాటులోకి తేవాలని కలెక్టర్లకు చెప్పారు.
వాట్సాప్ గ్రూప్‌లు పెట్టుకొని సమస్యలు పరిష్కరించండి
ఇంచార్జ్ మంత్రులు భారీ వర్షాలు, ఆరోగ్యం, వ్యవసాయం, నీటిపారుదల శాఖ (నీటిని వడిసి పట్టుకోవడం, వినియోగించుకోవడం), పౌరసరఫరాలు (రేషన్ కార్డులు) ఈ ఐదు అంశాలపై తమ సమీక్ష సమావేశాల్లో ఒక ప్రణాళిక తయారు చేసుకొని కలెక్టర్లకు సూచనలు ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఆ కలెక్టర్లు కింది ఉద్యోగులకు (జాయింట్ కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు) సూచనలు ఇవ్వాలని చెప్పారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరిని బాధ్యులను చేయాలన్నారు. సీఎస్ కు కూడా ఆదేశాలు ఇస్తున్నానని, 119 నియోజకవర్గాలకు సంబంధించి 119 మంది ఆర్‌డీఓలు లేదా అంతకంటే పై స్థాయి అధికారులు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్కరికి బాధ్యత అప్పగించాలని చెప్పారు. వారి బాధ్యత ఆ నియోజకవర్గంలో ఉండే అన్ని మండలాల కార్యక్రమాలను చేపట్టడం, అందరికీ రేషన్ కార్డులు చేరేలా చూడటం, అక్కడ ఉండే సమస్యలను పరిష్కరించడం అని ఆయన తెలిపారు. అధికారులు ఒక వాట్సాప్ గ్రూపు పెట్టుకొని ఇష్యూస్‌ను అందులో పెట్టడం ద్వారా సూచనలు, స్పష్టత పొందవచ్చన్నారు.
సమన్వయంతో పని చేయండి
గ్రామీణ ప్రాంతాల్లో వర్షాల వల్ల పిడుగుపాటుకు గురై మనుషులు, పశువులు మరణిస్తున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పిడుగుపాట్లు కూడా పెరిగాయని, ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. పిడుగుపాటుకు ఎవరైనా మరణిస్తే కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని, పశువులు చనిపోయినా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయించి, స్థానిక ఎంఆర్‌ఓలు, ఇతర అధికారులను అప్రమత్తం చేసి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. హైదరాబాద్ నగరంలో అనూహ్యంగా అధిక వర్షపాతం నమోదవడంతో ట్రాఫిక్ జామ్‌లు, నాలాల పొంగిపొర్లడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని సీఎం రేవంత్ తెలిపారు.
జిల్లాల్లో కూడా ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయని, ఈ నేపథ్యంలో ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, మున్సిపల్, పంచాయతీరాజ్, వైద్యారోగ్య, రెవెన్యూ శాఖల అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ అన్నారు. నగరంలో వర్షం వస్తే గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోందని, రోడ్లపై నీరు నిలవడమే దీనికి ప్రధాన కారణమని తెలిపారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్, మున్సిపల్, పోలీసు అధికారులు నీటిని నియంత్రించడంలో, చెట్లు కూలితే తొలగించడంలో, విద్యుత్ అంతరాయాలు ఏర్పడితే పునరుద్ధరించడంలో సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.
రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు, పోలీసులు వర్షం వస్తుందంటే ఆయా ప్రాంతాల్లో గ్రౌండ్‌లో ఉండాలన్నారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తే మిగతా అధికారులు కూడా పనిలో నిమగ్నమవుతారని చెప్పారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.