తెలంగాణ ప్రగతికి త్రిముఖ వ్యూహం.. క్యూర్‌‌‌‌, ప్యూర్‌‌‌‌, రేర్‌‌‌‌.. అభివృద్ధి ఫార్ములా ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ప్రగతికి త్రిముఖ వ్యూహం.. క్యూర్‌‌‌‌, ప్యూర్‌‌‌‌, రేర్‌‌‌‌.. అభివృద్ధి ఫార్ములా ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి
  • ఓఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ లోపలంతా ‘క్యూర్​’
  • ఓఆర్​ఆర్​, ట్రిపుల్​ ఆర్‌‌‌‌ మధ్య ‘ప్యూర్​’
  • అవతల రాష్ట్ర సరిహద్దు వరకు ‘రేర్​’
  • పొరుగు రాష్ట్రాలతో కాదు.. చైనా, జపాన్, జర్మనీలే మనకు పోటీ
  • రాష్ట్రాభివృద్ధి కోసం పకడ్బందీ ప్రణాళికలు
  • 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధనే లక్ష్యం
  • త్వరలో కొత్తగూడెం, రామగుండం, వరంగల్, ఆదిలాబాద్‌‌‌‌లో ఎయిర్‌‌‌‌పోర్టులు
  • డిసెంబర్​ 1 నుంచి 13 వరకు రెండేండ్ల ప్రజాపాలన ఉత్సవాలు
  • ఫ్యూచర్ సిటీ వేదికగా డిసెంబర్​ 8, 9 తేదీల్లో ‘తెలంగాణ రైజింగ్’​ గ్లోబల్​ సమిట్​
  • దేశ విదేశాల్లోని ప్రతినిధులకు ఆహ్వానం అందిస్తున్నట్లు వెల్లడి
  • గ్లోబల్ సమిట్ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

హైదరాబాద్​, వెలుగు:  క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు రకాల వ్యవస్థలను, ప్రణాళికలను క్రోడీకరించి విజన్ డాక్యుమెంట్‌‌‌‌ను  తీసుకొస్తున్నామని సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించారు. రాష్ట్రాన్ని మూడు ఆర్థిక జోన్లుగా విభజించి, అభివృద్ధిని వికేంద్రీకరించేందుకు ‘తెలంగాణ రైజింగ్- 2047’ పేరుతో విజన్ డాక్యుమెంట్‌‌‌‌ను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఓఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ లోపలి ప్రాంతాన్ని ‘క్యూర్‌‌‌‌ (కోర్ అర్బన్)’గా, ఓఆర్‌‌‌‌ఆర్‌‌‌‌–-ట్రిపుల్​ఆర్‌‌‌‌ మధ్య ప్రాంతాన్ని ‘ప్యూర్‌‌‌‌ (పెరీ అర్బన్)’గా,  ట్రిపుల్​ఆర్‌‌‌‌ అవతలి  నుంచి తెలంగాణ సరిహద్దు వరకు ప్రాంతాన్ని ‘రేర్‌‌‌‌ (రూరల్ అగ్రికల్చరల్)’గా వర్గీకరిస్తున్నామని వివరించారు. మహిళలు, రైతులు, యువత, వివిధ సామాజిక వర్గాల ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ విజన్ డాక్యుమెంట్​ రెడీ చేస్తున్నామని తెలిపారు. 

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆదాయాన్ని పెంచి, పేదలకు పంచాలనే విధానంతో ముందుకు వెళ్తున్నామని సీఎం పేర్కొన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల భారీ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని.. ఇందుకోసం ప్రపంచ దిగ్గజ దేశాలైన చైనా, జపాన్, జర్మనీని ఆదర్శంగా తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.   తమ పోటీ పక్క రాష్ట్రాలతో కాదని, అభివృద్ధి చెందిన దేశాలతోనేనని సీఎం రేవంత్​ పేర్కొన్నారు. 

ఆయా దేశాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించదలుచుకున్నామని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టకపోతే భవిష్యత్తులో ఏదో కోల్పోతామనే విధంగా ఆ దేశాల్లోని బడా పారిశ్రామికవేత్తలను ఆకర్షించి రాష్ట్రానికి తీసుకురాబోతున్నామని తెలిపారు.  ‘తెలంగాణ రైజింగ్- 2047’ పాలసీ డాక్యుమెంట్ , తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్​పై ఆదివారం సెక్రటేరియెట్​లో మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. సమావేశంలో ఐఎస్​బీ ప్రొఫెసర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికను వివరించారు. 

పాలసీల్లో స్తబ్ధత రాకుండా..!

డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ సమిట్​’ను నిర్వహించనున్నామని సీఎం రేవంత్​రెడ్డి వెల్లడించారు. గత అనుభవాలను పాఠంగా మార్చుకొని, 4 కోట్ల ప్రజల కోసం అద్భుతమైన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ‘తెలంగాణ రైజింగ్-2047’ పాలసీ డాక్యుమెంట్‌‌‌‌ను రూపొందించామని చెప్పారు. దార్శనికత (విజన్), వ్యూహం (స్ట్రాటజీ) అనే రెండు ప్రధానాంశాలతో ఈ డాక్యుమెంట్ ఉంటుందని, పాలసీల్లో స్తబ్ధత (పెరాలసిస్) రాకుండా ఉండేందుకు ఈ విజన్ డాక్యుమెంట్‌‌‌‌ను లక్షలాది మంది భాగస్వాములను చేసి, ప్రపంచ స్థాయిలో పేరెన్నికగన్న ప్రముఖులను, నీతి ఆయోగ్, ఐఎస్‌‌‌‌బీ లాంటి సంస్థల సహకారం తీసుకున్నామని.. అందరి సలహాలు, సూచనలను క్రోడీకరించి సిద్ధం చేసుకున్నామని వెల్లడించారు. 

ఇందులో భాగంగా భవిష్యత్తు ప్రణాళికలను నిశితంగా, లోతుగా విశ్లేషించి, పరిశీలించి సిద్ధం చేశామన్నారు.  ప్రపంచ దిగ్గజ కంపెనీలను భాగస్వామ్యం చేసి, రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. 
 

ఓఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ లోపల ‘క్యూర్’.. నెట్ జీరో సిటీ

తెలంగాణ రైజింగ్- 2047లో భాగంగా రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా విభజించి అభివృద్ధి చేయనున్నట్లు సీఎం రేవంత్​రెడ్డి వివరించారు.  ‘‘మొదటిది 'క్యూర్‌‌‌‌' (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ). ఇది ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌‌‌‌ఆర్‌‌‌‌) లోపల ఉన్న 2,170 చదరపు కిలోమీటర్ల ప్రాంతం. గతంలో ఇక్కడ గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల మధ్య సమన్వయ లోపం వల్ల ట్రాఫిక్ జామ్‌‌‌‌లు, వరదలు, కాలుష్యం వంటి సమస్యలు తలెత్తాయి.  పారిశ్రామిక కాలుష్యం, మూసీ నది కాలుష్యం, వాహనాల కాలుష్యం వంటి ఎన్నో సమస్యలను తగ్గించి, దీనిని నెట్ జీరో సిటీ లాగా, కాలుష్య రహిత నగరంగా మార్చడానికి ‘క్యూర్’ చేయాల్సిందే. 

ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలలో ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తులో అలాంటి సంక్షోభాన్ని నివారించడానికి, ఈ 2,170 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని సర్వీస్ సెక్టార్‌‌‌‌గా మారుస్తున్నాం.  కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను బయటికి తరలించడం.. చెరువులు, కుంటలు, నాలాల ప్రక్షాళన, మెట్రో రైలు విస్తరణ, మూసీ రివర్ డెవలప్‌‌‌‌మెంట్, ఫ్లై ఓవర్లు, రోడ్ల విస్తరణ వంటి అన్ని అంశాలు ‘క్యూర్’ అభివృద్ధిలో భాగం. కాలుష్య పరిశ్రమలను బయటకు తరలించడంతో ఇది పూర్తిగా సర్వీస్ సెక్టార్  హబ్‌‌‌‌గా మారుతుంది. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, నాలాల అభివృద్ధి ఇందులో ప్రధాన భాగాలు” అని ఆయన పేర్కొన్నారు. 

ఓఆర్​ఆర్​, ఆర్​ఆర్​ఆర్​ మధ్య‘ప్యూర్’.. పోర్టు కనెక్టివిటీ

రెండో ‘ప్యూర్‌‌‌‌ (పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ)’ అని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు.  ‘‘ఇది ఓఆర్‌‌‌‌ఆర్‌‌‌‌,  రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌) మధ్య ఉన్న ప్రాంతం. ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ దాదాపు 360 కిలోమీటర్లతో తెలంగాణకు రెండో మణిహారంగా మారనుంది. ఈ జోన్‌‌‌‌ను ‘మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌‌‌‌’గా అభివృద్ధి చేస్తాం. ఇందులో భారత్ ఫ్యూచర్ సిటీ, చందన్వెల్లి, సీతారాంపూర్ ఫార్మా కంపెనీలు, ఐటీ సెజ్‌‌‌‌లు ఉంటాయి. రవాణా సౌకర్యాల కోసం బుల్లెట్ రైళ్లు, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌‌‌‌ప్రెస్ హైవేలు రానున్నాయి.

సముద్ర తీరం లేని తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ కల్పించేందుకు హైదరాబాద్ నుంచి నేరుగా మచిలీపట్నం పోర్టుకు ‘డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌‌‌‌ప్రెస్ హైవే’ నిర్మించే విషయమై ఏసీ సీఎం, ప్రధానమంత్రితో చర్చించి ప్రాథమిక ఒప్పందానికి వచ్చాం” అని వివరించారు. భవిష్యత్తులో వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, రామగుండంలో నాలుగు కొత్త ఎయిర్​పోర్టులు నిర్మించనున్నట్లు ఆయన ప్రకటించారు. పోర్ట్ కనెక్టివిటీ, ఎయిర్‌‌‌‌పోర్ట్స్ కనెక్టివిటీ ద్వారా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్‌‌‌‌లో పెట్టుబడులను ఆకర్షించి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి  ‘ప్యూర్’ను ప్రణాళికాబద్ధంగా చేసుకున్నామని  తెలిపారు. 

స్టేక్ హోల్డర్స్​గా రైతులు.. ‘రేర్’ ఎకానమీ

మూడోది ‘రేర్​(రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ)’  అని .. ఇది రీజినల్ రింగ్‌‌‌‌రోడ్ బయట తెలంగాణ సరిహద్దు వరకు ఉన్న ప్రాంతమని సీఎం రేవంత్​రెడ్డి వెల్లడించారు. ‘‘గతంలో ఏ విజన్, ఏ పాలసీ డాక్యుమెంట్ చేసినా అర్బన్ బేస్డ్ పాలసీ తీసుకొచ్చేవారు. కానీ మా ప్రభుత్వం వ్యవసాయాన్ని, గ్రామీణ ప్రాంతాలను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయదలుచుకోలేదు. ఈ స్టేట్ ఎకానమీలో వాళ్లను స్టేక్‌‌‌‌హోల్డర్స్‌‌‌‌గా మార్చదలుచుకున్నాం. 

రైతులను, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా ఆర్గానిక్ ఫుడ్, అగ్రికల్చర్ పార్కులు, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్‌‌‌‌కు సంబంధించిన పరిశ్రమలను ఏర్పాటు చేస్తాం. విత్తనాలను ఉత్పత్తి చేయడానికి తెలంగాణ భూములు అనుకూలమైనవి. సేంద్రియ వ్యవసాయానికి ఉపయోగపడే భూములు ఇక్కడ ఉన్నాయి.   అందుకే దీనిని ‘రేర్’ పాలసీ కిందికి తీసుకువస్తున్నాం” అని ఆయన స్పష్టం చేశారు. 

పోషకాహారమే ముఖ్యం

ఫుడ్  సమస్య లేదని, న్యూట్రిషన్ సమస్య ఉన్నదని, న్యూట్రిషన్ ఎలా ఇంప్రూవ్ చేయాలనేది తమ ప్రణాళిక అని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు.  ‘‘భారతదేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో సర్​ప్లస్ దేశంగా ఉన్నా.. ఆరోగ్యవంతమైన ఫుడ్ ఇవ్వలేకపోతున్నాం. అందుకే తెలంగాణ మొదటి రాష్ట్రంగా ప్రజలకు న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చే ప్రణాళికలు చేస్తున్నది. విద్య అన్ని గ్రామాలకు చేరినా.. నాణ్యమైన విద్య, సాంకేతికపరమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం. 

సింగిల్ టీచర్ స్కూల్స్ నుంచి మొదలుపెట్టి మహానగరమైన హైదరాబాద్ వరకు విద్యా వ్యవస్థలో ప్రక్షాళన తీసుకురావడమే కాకుండా, అంతర్జాతీయ విద్యా సంస్థలను రాష్ట్రానికి రప్పించి నాలెడ్జ్ హబ్‌‌‌‌గా క్రియేట్ చేయదలుచుకున్నాం” అని పేర్కొన్నారు. నాలెడ్జ్ హబ్ క్రియేట్ అయితే ఆటోమేటిక్‌‌‌‌గా పెట్టుబడులు వస్తాయని, దానితో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. 

3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా..

తెలంగాణ రాష్ట్రాన్ని 2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా తీర్చిదిద్దాలని ముందుకు వెళ్తున్నట్లు సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. ‘‘ప్రస్తుతం భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 5 శాతాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి అందిస్తున్నాం. భవిష్యత్తులో దానిని 10 శాతానికి పెంచడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. అందులో భాగంగానే గ్లోబల్​ సమిట్​ను  ఏర్పాటు చేస్తున్నాం.  

అందరి సూచనలు తీసుకొని ముందుకు వెళ్తాం” అని చెప్పారు.  డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 13 వరకు ఉత్సవాలు ఉంటాయని.. 8, 9 తేదీల్లో గ్లోబల్​ సమిట్​ ఉంటుందని చెప్పారు. కాగా,  తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఆహ్వాన పత్రికను సీఎం రేవంత్​రెడ్డి ఆవిష్కరించారు. సమిట్ డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరుగనుందని.. ప్రపంచవ్యాప్త ప్రతినిధులకు వ్యక్తిగత లేఖ రూపంలో ఆహ్వానం అందిస్తున్నామని ఆయన వెల్లడించారు.