త్వరలో 40 వేల ఉద్యోగాల భర్తీ..మొదటి ఏడాదిలోనే 60 వేల జాబ్‌‌లు ఇచ్చినం: సీఎం రేవంత్‌‌

త్వరలో 40 వేల ఉద్యోగాల భర్తీ..మొదటి ఏడాదిలోనే 60 వేల జాబ్‌‌లు ఇచ్చినం: సీఎం రేవంత్‌‌
  • రెండున్నరేండ్ల పాలన పూర్తయ్యేసరికి లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తం
  • రైతులను రుణ విముక్తులను చేసినం..
  • అన్నదాతల కోసమే  లక్ష కోట్లు ఖర్చు చేసినం 
  • ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సులకు యజమానులను చేసినం
  • కొత్త రేషన్‌‌కార్డులిచ్చి.. పేదలకు సన్నబియ్యం ఇస్తున్నం..
  • రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు కట్టిస్తం
  • బీఆర్ఎస్​ కట్టిన కాళేశ్వరం కూలింది.. 
  • కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు చెక్కు చెదరలే
  • సర్పంచ్ ఎన్నికల్లో కిరికిరిగాళ్లకు అవకాశం ఇవ్వొద్దని సూచన
  • హుస్నాబాద్‌‌లో ప్రజా పాలన విజయోత్సవ సభ 

సిద్దిపేట/హుస్నాబాద్, వెలుగు:  రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక యువత ఆకాంక్షలను గుర్తించి 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలన పూర్తయ్యేసరికి లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్‎పై కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టిందని తెలిపారు.

  బీఆర్ఎస్​పదేండ్ల  దుర్మార్గపు పాలనను అంతమొందించి.. ప్రజా పాలనను తీసుకొచ్చామని అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌‌లో ప్రజా పాలన  విజయోత్సవాల సందర్భంగా పలు అభివృద్ది పనులను సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..డిసెంబర్ 3.. తెలంగాణ కోసం శ్రీకాంతాచారి అమరుడైన రోజని, ఆయన ఆశయ సాధనలో భాగంగా  ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్టు తెలిపారు.   

అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రైతులను రుణ విముక్తులను చేశామని, రూ. రెండు లక్షల రుణమాఫీ అమలు చేశామని చెప్పారు.  అన్నదాతల సంక్షేమం కోసం 1.0 4 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణాలకు రూ. 8 వేల కోట్లు ఖర్చు చేశామని, ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశామని తెలిపారు.

 కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతోపాటు పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, 50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం పదేండ్లు అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. 

అదానీ, అంబానీతో పోటీపడేలా మహిళలు సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు సహకారం అందిస్తున్నామని తెలిపారు. 2004లో కరీంనగర్‌‌‌‌లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ కలను సోనియాగాంధీ నిజం చేశారని చెప్పారు. హుస్నాబాద్‌‌కు ప్రత్యేక చరిత్ర ఉందని, దొరల గడీలను బద్దలు కొట్టి ప్రజా పాలనకు మార్గం వేసిన సర్వాయి పాపన్న ఈ ప్రాంతం వాడేనని తెలిపారు. 

కాళేశ్వరం కూలేశ్వరమైంది..

బీఆరెస్ పాలనలో రూ. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలేశ్వరమైందని, కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కు చెదరలేదని సీఎం రేవంత్‌‌రెడ్డి అన్నారు. నెహ్రూ కాలంలో కట్టిన ఎస్సారెస్పీతో కరీంనగర్, వరంగల్ జిల్లాలకు సాగు నీరు అందుతున్నదని చెప్పారు. 

వాటి ద్వారానే రికార్డు స్థాయిలో పంటలు పండుతున్నాయని, వరి ఉత్పత్తిలో మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. పదేండ్లు అధికారంలో ఉన్నవాళ్లు హుస్నాబాద్‌‌కు సాగునీరు అందించే గండిపెల్లి, గౌరెల్లి ప్రాజక్టులను పూర్తి చేయలేదని మండిపడ్డారు. హుస్నాబాద్​ నుంచి ప్రచారం ప్రారంభించేందుకు గత పాలకులు సెంటిమెంట్‌‌గా హుస్నాబాద్‌‌ను వాడుకున్నారేకానీ.. నియోజకవర్గాన్ని అభివృద్ది చేయలేదన్నారు. 

గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నిధులను వరదలా ఖర్చు పెట్టిన గత పాలకులు.. హుస్నాబాద్‌‌ను నిర్లక్ష్యం చేశారన్నారు. కానీ, తాము అన్ని నియోజకవర్గాలను సమానంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులకు ఎన్ని నిధులు అవసరమైనా ఇచ్చి, పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. నిర్లక్ష్య పాలన వల్ల అంబాసిడర్ కారు ఫామ్‌‌హౌస్‌‌కు చేరిందని ఎద్దేవా చేశారు.

గ్రామాల్లో వెలుగులు నింపే ఎన్నికలు

రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో వెలుగులు నింపుతాయని, కిరికిరిగాళ్లను కాకుండా మంచోళ్లను సర్పంచ్‌‌లుగా గెలిపించాలని ప్రజలకు సీఎం రేవంత్‌‌రెడ్డి సూచించారు. గ్రామాల అభివృద్ధి కోసం మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయగలిగినవారిని ఎంచుకోవాలన్నారు. మంచివాళ్లను ఎన్నుకుంటే గ్రామాలతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ప్రభుత్వంతో కలిసి పనిచేసే వారిని, ఆలోచనాపరుల్ని ఎన్నుకోవడానికి అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు.  

నియోజకవర్గ అభివృద్ధికి నిధులివ్వాలి: మంత్రి పొన్నం

హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలని సీఎం రేవంత్‌‌రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. నియోజకవర్గంలో విద్యావ్యాప్తికి మౌలిక వసతులు కల్పించాలని, పశు సంపద అధికంగా ఉన్నందున పాడి రైతులకు చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. హుస్నాబాద్ పట్టణం నాలుగు జిల్లాలకు మధ్యలో ఉందని,  దీని చుట్టూ రింగ్ రోడ్డు మంజూరు చేయాలన్నారు. 

గౌరవెల్లి ప్రాజెక్ట్ ఈ ప్రాంతానికి వర ప్రదాయని అని, వచ్చే సీజన్‌‌లో ఈ  ప్రాజెక్ట్ ద్వారా నీరందించేందుకు కృషి చేస్తున్నందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. పలు అభివృద్ధి పనులకు సంబంధించి మంత్రి ప్రతిపాదనలు అందించగా.. సీఎం సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌‌‌‌రావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు.

ఆర్థిక ఇబ్బందులను తట్టుకొని సంక్షేమం: మంత్రి వివేక్‌‌

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రభుత్వం కొనసాగిస్తున్నదని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. గత ప్రభుత్వం పదేండ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, సీఎం రేవంత్‌‌రెడ్డి హయాంలో అర్హులందరికీ రేషన్ కార్డులిచ్చి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500కే గ్యాస్, ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామన్నారు. 

ఇందిరమ్మ ఇండ్లు రాని వాళ్లు నిరాశ పడొద్దని, దశలవారీగా అందరికీ  వస్తాయని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో 115 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను (ఏటీసీ) ఏర్పాటు చేసి.. ఏటా 2 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని, సరైన శిక్షణ ఉన్నప్పుడే మంచి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు.

262.78 కోట్ల అభివృద్ధి  పనులకు శంకుస్థాపన 

హుస్నాబాద్ మున్సిపాలిటీలో రూ. 262.78 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌‌రెడ్డి శంకుస్థాపన చేశారు. 44.12 కోట్లతో హుస్నాబాద్‌‌లో ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణానికి, 45.15 కోట్లతో హుస్నాబాద్‌‌లో ఏటీసీ ఏర్పాటుకు , 8.60 కోట్లతో ఆర్టీఏ యూనిట్ ఆఫీస్ , 86 కోట్లతో హుస్నాబాద్ అర్బన్- కొత్తపల్లి ప్యాకేజీ-1 లో భాగంగా 4  లేన్‌‌ రహదారి నిర్మాణానికి, 58.91 కోట్లతో హుస్నాబాద్- అక్కన్నపేట 4 లేన్‌‌ రహదారి నిర్మాణ పనులను ప్రారంభించారు. 20 కోట్లతో హుస్నాబాద్ మునిసిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.