పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి: సీఎం రేవంత్

పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి: సీఎం రేవంత్
  • ప్రధాని మోదీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విజ్ఞప్తి 
  • ఢిల్లీలో ప్రధానితో 40 నిమిషాల పాటు భేటీ
  • విభజన హామీలు, పెండింగ్ నిధులపై చర్చ
  • శాఖలవారీగా రిప్రజెంటేషన్లు ఇచ్చాం: రేవంత్ రెడ్డి
  • నిధులు ఇవ్వాలని కోరాం: భట్టి

న్యూఢిల్లీ, వెలుగు: పాల‌మూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధాని న‌రేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ‘‘ఏపీ విభ‌జ‌న చ‌ట్టం ప్రకారం.. రెండు రాష్ట్రాల్లో ఒక్కో ప్రాజెక్టుకు జాతీయ హోదా క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే ఏపీలోని పోల‌వ‌రం ప్రాజెక్టుకు జాతీయ హోదా క‌ల్పించారు. అదే మాదిరి తెలంగాణ‌లోనూ పాల‌మూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి” అని కోరారు. ఢిల్లీలో మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని మోదీతో రేవంత్, భట్టి భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశం దాదాపు 40 నిమిషాల పాటు కొనసాగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ప్రధానికి రిప్రజెంటేషన్లు ఇచ్చారు. విభజన హామీలు, పెండింగ్ నిధులు, ఇతర ఆర్థిక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన దాదాపు రూ.6,283 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్​లో ఉన్న అన్ని అంశాలపై ప్రధాని మోదీతో చర్చించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అనుమతులపై శాఖల వారీగా రిప్రజెంటేషన్లు ఇచ్చామని చెప్పారు. 

ప్రధానితో భేటీ అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో రేవంత్, భట్టి మీడియాతో మాట్లాడారు. పదేండ్ల పాలనలో గత బీఆర్ఎస్ సర్కార్ ఆర్థిక అరాచకం సృష్టించిందని భట్టి మండిపడ్డారు. బీఆర్ఎస్ అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిందని, అప్పులు చేసి రాష్ట్రంపై పెనుభారం మోపిందని ఫైర్ అయ్యారు. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు పెండింగ్ నిధులు విడుదల చేయడంతో పాటు అదనపు నిధులు ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశామని చెప్పారు. అయితే రూల్స్ సడలించాలని గానీ, ఇతర మినహాయింపుల గురించి గానీ అడగలేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రధానికి వివరించామని, తమ ప్రభుత్వం రిలీజ్ చేసిన శ్వేతపత్రం గురించి కూడా చెప్పామని పేర్కొన్నారు. 

ప్రధాని సానుకూలంగా స్పందించారు..

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశామని భట్టి తెలిపారు. విభజన చట్టంలోని హామీలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం తదితర అంశాలపై చర్చించామని పేర్కొన్నారు. ‘‘నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ప్రజలు పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నారు. ఏ నీళ్ల కోసమైతే తెలంగాణ ప్రజలు పోరాడారో.. ఆ నీళ్ల కోసం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానిని కోరాం. గత పదేండ్లలో బీఆర్ఎస్ సర్కార్ చాలా అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లలేకపోయింది. ఇప్పుడు అన్ని పెండింగ్ అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాం. బయ్యారంలో స్టీల్ ప్లాంట్, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రాజెక్ట్, హైదరాబాద్‌లో ఐఐఎం, ఒక సైనిక్ స్కూలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాం. విద్య, వైద్యం, నీటి పారుదల సహా అన్ని రంగాల్లో సహకారం అందించాలని కోరాం” అని చెప్పారు. తమ విజ్ఞప్తులపై ప్రధాని సానుకూలంగా స్పందించారని, ఒక రాష్ట్రానికి కేంద్రం నుంచి అందించే అన్ని సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. ‘‘పెండింగ్‌లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.2,233.54 కోట్లు వెంటనే విడుదల చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశాం. ప్రతిఏటా రూ. 450 కోట్ల చొప్పున వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు రూ.1,800 కోట్లు పెండింగ్​లో ఉన్నాయి. వాటిని విడుదల చేసేలా ఆర్థిక శాఖకు ఆదేశాలివ్వాలని కోరాం” అని వెల్లడించారు. కాగా రేవంత్, భట్టి వెంట సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఆర్థిక శాఖ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు కూడా ఢిల్లీకి వచ్చారు. వీళ్లంతా బుధవారం ఉదయం హైదరాబాద్ కు తిరిగి వెళ్లనున్నారు.

సీఎంగా తొలిసారి తెలంగాణ భవన్​కు.. 

సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి ఢిల్లీలోని తెలంగాణ భవన్​కు వచ్చారు. ప్రధానితో భేటీ అనంతరం భట్టితో కలిసి తెలంగాణ భవన్​లోని శబరీ బ్లాక్​కు వెళ్లారు. అక్కడ కాసేపు భట్టి, ఉన్నతాధికారులతో చర్చించారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరుతున్న టైమ్​లో రేవంత్ రెడ్డిని మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కలిశారు. కాగా, పదేండ్ల పాలనలో సీఎంగా కేసీఆర్ కేవలం రెండుసార్లు మాత్రమే తెలంగాణ భవన్ ను సందర్శించారు. సీఎంగా తొలినాళ్లలో శబరీ బ్లాక్ కు వచ్చారు. అనంతరం ఢిల్లీ కేంద్రంగా బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన రైతు ధర్నా కోసం మరోసారి వచ్చారు. మరోవైపు ఢిల్లీ పర్యటనలోనూ సీఎం రేవంత్ రెడ్డి సొంతకారునే ఉపయోగిస్తున్నారు. ఎంపీగా ఆయన గతంలో వాడిన బెంజ్ కారు, సొంత డ్రైవర్​నే కొనసాగిస్తున్నారు. 

సోనియా గాంధీ, ఖర్గేలతో వేర్వేరుగా సమావేశం

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పలువురు అగ్ర నేతలతో భేటీ అయ్యారు. తొలుత ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో 10 జన్ పథ్ లో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపు15 నిమిషాలకు పైగా సాగిన ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా అంశాలను వివరించారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు, రాబోయే ఎన్నికలకు సన్నద్ధం అవుతోన్న తీరును వివరించినట్లు తెలిసింది. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి రాజాజీ మార్గ్ లోని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాల కు పైగా ఈ భేటీ సాగింది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, గ్యారెంటీ పథకాల అమలు, నామినేటెడ్ పదవుల భర్తీ, కేబినేట్ విస్తరణ, లోక్ సభ ఎన్నికల వ్యూహాలపై చర్చలు జరిపారు. ఈ సందర్బంగా ఎంపీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని నేతలకు ఖర్గే దిశా నిర్దేశం చేశారు. కర్నాటకతో పాటు తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఈ రెండు రాష్ట్రాల నుంచి ఎక్కువ సీట్లు గెలిచేలా కార్యకర్తలను ముందుకు నడిపించాలని సూచించారు.

ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన అంశాలు..

  •  రాష్ట్రంలోని 14 రోడ్లను నేషనల్ హైవేలుగా అప్‌గ్రేడ్ చేయాలి. వీటిలో కేవ‌లం రెండింటికే ఆమోదం లభించింది. మిగ‌తా 12 ర‌హ‌దారుల అప్‌గ్రేడ్‌ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. 
  • ములుగు కేంద్రంగా ఏర్పాటవుతున్న సమ్మక్క–సారక్క ట్రైబల్ యూనివర్సిటీలో 2023–24 విద్యా సంవ‌త్సరంలో ప్రవేశాల‌కు అనుమ‌తి ఇవ్వాలి.
  • ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో ఇచ్చిన హామీ మేరకు బ‌య్యారంలో స్టీల్ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలి. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సి ఉండ‌గా, పీరియాడిక‌ల్ ఓవ‌ర్‌హాలింగ్ వ‌ర్క్‌షాప్ ఏర్పాటు చేస్తామ‌ని రైల్వే శాఖ ప్రక‌టించింది. దానికి అద‌నంగా విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం 
  • కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలి.
  • 2010లో అప్పటి కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ కు ప్రకటించిన ఐటీఐఆర్ ప్రాజెక్టును వెంట‌నే పున‌రుద్ధరించాలి. 
  • వ‌రంగ‌ల్‌లోని కాక‌తీయ మెగా జౌళి పార్కును బ్రౌన్ ఫీల్డ్ పార్కుగా ప్రక‌టించారు. కానీ దానికి రావాల్సిన‌న్ని నిధులు రాలేదు. అందుకే దాన్ని గ్రీన్‌ఫీల్డ్‌లోకి మార్చాలి.
  • హైద‌రాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలి. ఇందుకు కావాల్సిన స్థలం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 
  • ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రెండు సైనిక్ స్కూల్స్ కూడా రాష్ట్ర విభ‌జ‌న‌తో ఏపీకి వెళ్లిపోయాయి. తెలంగాణ లో కొత్తగా సికింద్రాబాద్–కంటోన్మెంట్‌లో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి. 
  •  ఆర్మీ హెడ్ ఆఫీసులు దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్నా.. ద‌క్షిణాదిలో మాత్రం లేవు. పుణెలో ఉన్న హెడ్ ఆఫీసును సికింద్రాబాద్–కంటోన్మెంట్‌కు త‌ర‌లించాలి.
  • ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం 9వ షెడ్యూల్‌లోని ప్రభుత్వ సంస్థల విభ‌జ‌న‌, 10 షెడ్యూల్‌లోని సంస్థల అంశాల‌ను ప‌రిష్కరించాలి. ఢిల్లీలోని ఉమ్మడి ఏపీ/తెలంగాణ భ‌వ‌న్ విభ‌జ‌న‌కు స‌హ‌క‌రించాలి.