మేడమ్.. తెలంగాణ నుంచి పోటీ చేయండి

మేడమ్.. తెలంగాణ నుంచి పోటీ చేయండి
  •     సోనియా గాంధీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి
  •     రెండు గ్యారంటీలు అమలు చేస్తున్నట్టు వెల్లడి
  •     పోటీపై సరైన టైమ్​లో నిర్ణయం తీసుకుంటానన్న సోనియా గాంధీ

న్యూఢిల్లీ, వెలుగు: లోక్‌‌‌‌స‌‌‌‌భ ఎన్నిక‌‌‌‌ల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాల‌‌‌‌ని కాంగ్రెస్ పార్లమెంట‌‌‌‌రీ పార్టీ చైర్​పర్సన్ (సీపీపీ) సోనియా గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నుంచి పోటీ చేయాల‌‌‌‌ని కోరుతూ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) తీర్మానం చేసిన విష‌‌‌‌యాన్ని సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ఇచ్చిన త‌‌‌‌ల్లిగా రాష్ట్ర ప్రజ‌‌‌‌లు గుర్తిస్తున్నందున రాష్ట్రం నుంచి పోటీ చేయాల‌‌‌‌ని కోరుతున్నట్లు చెప్పారు. దీనిపై స్పందించిన సోనియా గాంధీ ‘‘స‌‌‌‌రైన స‌‌‌‌మ‌‌‌‌యంలో నిర్ణయం తీసుకుంటాను’’అని చెప్పారు. జార్ఖండ్ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. తర్వాత ఢిల్లీలోని జన్ పథ్ 10లో సోనియా గాంధీని ఆమె నివాసంలో క‌‌‌‌లిశారు. ఈ సంద‌‌‌‌ర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమ‌‌‌‌లు చేస్తున్న హామీల‌‌‌‌ను సోనియాగాంధీకి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఎన్నిక‌‌‌‌లకు ముందు ఇచ్చిన ఆరు హామీల్లో మ‌‌‌‌హిళ‌‌‌‌ల‌‌‌‌కు ఫ్రీ బస్ జర్నీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ ప‌‌‌‌రిమితిని రూ.5 ల‌‌‌‌క్షల నుంచి రూ.15 ల‌‌‌‌క్షలకు పెంచ‌‌‌‌డాన్ని అమ‌‌‌‌లు చేస్తున్నామ‌‌‌‌ని చెప్పారు. మహాలక్ష్మి స్కీమ్ అమల్లోకొచ్చిన తర్వాత బ‌‌‌‌స్సుల్లో 14 కోట్ల మంది మ‌‌‌‌హిళ‌‌‌‌లు ఫ్రీగా జర్నీ చేశారని వివరించారు. 

మరో రెండు గ్యారంటీలపై రిపోర్ట్

స్టేట్ కేబినెట్ తాజా భేటీలో 200 యూనిట్ల దాకా ఫ్రీ కరెంట్, రూ.500కే గృహ అవసరాలకు సిలిండర్ అమలు చేయనున్నామని సోనియా దృష్టికి రేవంత్ తీసుకెళ్లారు. బీసీ కుల గ‌‌‌‌ణ‌‌‌‌న చేప‌‌‌‌ట్టాల‌‌‌‌ని నిర్ణయించామ‌‌‌‌ని, ఇందుకు సంబంధించి స‌‌‌‌న్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. రానున్న లోక్‌‌‌‌స‌‌‌‌భ ఎన్నిక‌‌‌‌ల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలిచేందుకు ప్రయ‌‌‌‌త్నిస్తున్నామ‌‌‌‌ని, ఇందుకు సంబంధించి ప్రణాళికలు రూపొందించుకున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ప్రతి లోక్‌‌‌‌స‌‌‌‌భ నియోజ‌‌‌‌క‌‌‌‌వ‌‌‌‌ర్గం వారీగా టికెట్ ఆశిస్తున్న వారి నుంచి ద‌‌‌‌ర‌‌‌‌ఖాస్తులు స్వీక‌‌‌‌రించామ‌‌‌‌ని, వాటిపై పూర్తిస్థాయిలో క‌‌‌‌స‌‌‌‌ర‌‌‌‌త్తు చేసి బ‌‌‌‌ల‌‌‌‌మైన అభ్యర్థుల‌‌‌‌ను ఎంపిక చేస్తామ‌‌‌‌ని సోనియాకు రేవంత్ వివ‌‌‌‌రించారు. కాగా, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. జార్ఖండ్ పర్యటన ముగించుకొని ఢిల్లీ మీదుగా హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల సోమవారం రాత్రి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి ఢిల్లీలో బస చేశారు. మంగళవారం పలువురు పార్టీ ముఖ్య నేతల్ని కలిసి తిరిగి హైదరాబాద్ బయలుదేరే అవకాశం ఉంది.

భారత్ జోడో న్యాయ్ యాత్రలో సీఎం

రాహుల్ గాంధీ చేపట్టిన భార‌‌‌‌త్ న్యాయ్ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి సోమ‌‌‌‌వారం పాల్గొన్నారు. జార్ఖండ్ రాజ‌‌‌‌ధాని రాంచీలో కొన‌‌‌‌సాగుతున్న న్యాయ్ యాత్రలో రాహుల్ ను రేవంత్ క‌‌‌‌లిశారు. ఈ సంద‌‌‌‌ర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమ‌‌‌‌లు చేస్తున్న రెండు గ్యారంటీల వివరాలు తెలియజేశారు. పార్లమెంట్ ఎన్నిక‌‌‌‌ల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేసేలా చూడాల‌‌‌‌ని విజ్ఞప్తి చేశారు. న్యాయ్ యాత్రలో సీఎం వెంట డిప్యూటీ సీఎం భ‌‌‌‌ట్టి, మంత్రి పొంగులేటి శ్రీ‌‌‌‌నివాస్‌‌‌‌ రెడ్డి ఉన్నారు.

రాష్ట్ర ఆడబిడ్డల రూపురేఖలతో తెలంగాణ తల్లి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్ర ఆడ బిడ్డ రూపురేఖలే తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిరూపంగా ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు, వాహనాల రిజిస్ట్రేషన్‌‌‌‌ కోడ్‌‌‌‌ను టీజీగా ప్రకటించడంపై సీఎం సోమవారం ‘ఎక్స్‌‌‌‌’లో స్పందించారు. ‘‘ఒక జాతి అస్థిత్వానికి చిరునామా.. భాష, సాంస్కృతిక వారసత్వమే. దానిని నిలబెట్టాలనే ఉద్దేశంతో ‘జయ జయహే తెలంగాణ’ పాటను అధికారిక గీతంగా, రాచరిక పోకడలు లేని చిహ్నమే రాష్ట్ర అధికారిక చిహ్నంగా, వాహన రిజిస్ట్రేషన్లలో టీఎస్‌‌‌‌ బదులు ఉద్యమ సమయంలో ప్రజలు నినదించిన టీజీ అక్షరాలు ఉండాలన్నది 4 కోట్ల ప్రజల ఆకాంక్ష. దాన్ని నెరవేరుస్తూ రాష్ట్ర కేబినెట్‌‌‌‌లో నిర్ణయం తీసుకున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు.

గ్రాంట్ రిలీజ్​కు స‌‌‌‌హ‌‌‌‌క‌‌‌‌రించండి

కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ‌కు రావ‌ల్సిన రూ.1,800 కోట్ల గ్రాంట్​ను వెంటనే రిలీజ్ అయ్యేందుకు సహకరించాలని నీతి ఆయోగ్ వైస్​చైర్మన్ సుమన్ భేరికి సీఎం రేవంత్ రిక్వెస్ట్ చేశారు. హైద‌రాబాద్‌లో మూసీ న‌ది రివ‌ర్ ఫ్రంట్ అభివృద్ధికి అవ‌స‌ర‌మైన నిధులు ఇప్పించాల‌ని కోరారు. ఇందుకు అవ‌స‌ర‌మైన వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ విడుద‌ల‌కు మ‌ద్దతు ఇవ్వాల‌ని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తాగునీటి స‌ర‌ఫ‌రాకు అవ‌స‌ర‌మైన నిధులతో పాటు త‌మ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య, విద్యా రంగాల్లో తీసుకురానున్న సంస్కర‌ణ‌ల‌కు సహకారం అందించాలని కోరారు.