ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన రెండో రోజూ ఫుల్ బిజీగా సాగుతోంది. రాష్ట్రానికి నిధులు రాబట్టడమే లక్ష్యంగా ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్ బాబుతో కలిసి కేంద్ర మంత్రులను భేటీ అవుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఈ మీటింగ్ కు రాష్ట్రానికి చెందిన అధికారులను సైతం ఆహ్వానించారు. 

ప్రధానంగా భారత్ మాలా పథకం కింద రాష్ట్రానికి మంజూరైన రీజినల్ రింగ్ రోడ్ గురించి వీరి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన ఆరు హైవేలను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని కోరినట్టు సమాచారం. ఫ్లై ఓవర్ల నిర్మాణంపైనా చర్చ జరిగినట్టు తెలిసింది.  గతంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇదే విషయంలో నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. 

ఈ సారి సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్చల్లో పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. రాష్ట్రానికి రావాల్సిన రైల్వే  ప్రాజెక్టులకు నిధులు, కొత్త ప్రాజెక్టుల గురించి చర్చించేందుకు  రైల్వేశాఖ మంత్రి అశ్విన్ శ్రీ వైష్ణవ్ తోనూ సీఎం భేటీ కానున్నారు. అనంతరం కేంద్రం గ్రాంటు తదితర అంశాలపై చర్చించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోనూ ముఖ్యమంత్రి, మంత్రుల బృందం భేటీ అవుతుంది. ఈ మేరకు అపాయింట్ మెంట్ కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది.