మరిన్ని పెట్టుబడులు పెట్టండి.. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి

మరిన్ని పెట్టుబడులు పెట్టండి.. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి
  • ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ
  • జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ బృందం కూడా సీఎంతో భేటీ
  • హైదరాబాద్‌లో జీసీసీని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడి

హైదరాబాద్, వెలుగు: 
రాష్ట్రంలో అమెజాన్ వెబ్​సర్వీసెస్​ ప్రాజెక్టులను విస్తరించాలని ఆ కంపెనీ ప్రతినిధులను సీఎం రేవంత్‌‌ రెడ్డి కోరారు. అమెజాన్ వెబ్​సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) ప్రతినిధులు మంగళవారం జూబ్లీహిల్స్‌‌లోని సీఎం​ నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఏడబ్ల్యూఎస్ ప్రాజెక్టు పనులు, విస్తరణ ప్రణాళికలపై చర్చించారు. 

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఏడబ్ల్యూఎస్ ప్రతినిధులను కోరారు. ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు, సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఏడబ్ల్యూఎస్​డేటా సెంటర్ గ్లోబల్ హెడ్ కెర్రీ పర్సన్, ఇన్ఫ్రా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ విక్రమ్ శ్రీధరన్, అనురాగ్ కిల్నాని తదితరులు పాల్గొన్నారు.  

జర్మనీ టీచర్లను నియమించండి..  

హైదరాబాద్‌‌ను ఇన్నోవేషన్ హబ్‌‌గా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలని జర్మనీ ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. జర్మనీ కాన్సుల్‌‌ జనరల్‌‌ మైకేల్‌‌ హాస్పర్‌‌ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మంగళవారం సీఎం రేవంత్​రెడ్డితో సమావేశమైంది. హైదరాబాద్‌‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. డ్యుయిష్‌‌ బోర్స్‌‌ కంపెనీ విస్తరణలో భాగంగా జీసీసీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పింది. జీసీసీతో వచ్చే రెండేండ్లలో ఐటీ రంగంలో వెయ్యి మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని పేర్కొంది. 

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జీసీసీ ఏర్పాటు కోసం హైదరాబాద్‌‌ను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రధానంగా ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. 

తెలంగాణ విద్యార్థులు జర్మనీ భాష  నేర్చుకునేందుకు వీలుగా హైదరాబాద్‌‌లో జర్మనీ టీచర్లను నియమించాలని కోరారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌‌పవర్ కంపెనీ (టామ్​కామ్) ద్వారా విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడం, ఒకేషనల్ ఎడ్యుకేషన్, స్కిల్ వర్క్ విషయంలో శిక్షణ అందించడం వంటి అంశాల్లో  సహకరించాలన్నారు.