హస్తినలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీ..

 హస్తినలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీ..
  • మంత్రులు కోమటిరెడ్డి, సీతక్క అక్కడే
  •  బయల్దేరిన మహేశ్ కుమార్ గౌడ్
  •  ఏఐసీసీ పెద్దలతో హర్కర వేణుగోపాల్ భేటీ
  •  పీసీసీ చీఫ్  పదవిపైనే కీలక చర్చ
  •  కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులపై కూడా..
  •  27తో పీసీసీ చీఫ్​గా ముగియనున్న రేవంత్ టెన్యూర్

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డితోపాటు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు హస్తినబాట పట్టారు. ఈ నెల 27తో రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించి మూడేండ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో కొత్త పీసీసీ సారథిని నియమించాల్సి ఉంది. ఎవరికి వారుగా పీసీసీ చీఫ్ పోస్టు కోసం ప్రయత్నాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ పెద్దలను కలువనున్నారని తెలుస్తోంది. కొద్ది సేపటి క్రితం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీ పయనమయ్యారు.

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ హస్తినలోనే ఉండి ఏఐసీసీ పెద్దలతో భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్ గా ఎవరిని నియమించాలనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్యనేతలు ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యాన్ని  సంతరించుకుంది. పీసీసీ చీఫ్ పదవి రేసులో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, సీనియర్ నేతలు మధుయాష్కీ గౌడ్, జగ్గారెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్ ఉన్నట్టు గత కొంత కాలంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయడంపై కాంగ్రెస్ అధినాయకత్వం ప్రధానంగా దృష్టి సారించింది.

ఈ నెలాఖరు నాటికి పీసీసీ చీఫ్ ను నియమించే అవకాశాలున్నాయి. అదే విధంగా నామినేటెడ్  పదవులకు సంబంధించిన జాబితా ఇప్పటికే ఏఐసీసీ దగ్గర ఉంది. దీనిపై ఆమోదముద్ర పడాల్సి ఉంది. దీంతోపాటు వచ్చే నెల 2న రాష్ట్ర కేబినెట్ విస్తరణ ఉంటుందని, వాకిటి శ్రీహరికి మంత్రిపదవి వస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇటీవలే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. క్యాబినెట్ లో ఆరు మంత్రిపదవులకు స్పేస్ ఉంది. ఎవరెవరిని కేబినెట్ లోకి తీసుకోవాలి.. ఏయే పోర్ట్ ఫోలియోలు కేటాయించాలి.. తదితర అంశాలను చర్చించే అవకాశం ఉంది.

ఇప్పటికే నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఎవరూ మంత్రులుగా లేరు. ఈ జిల్లాల్లో ఇటీవలే కొన్ని చేరికలు కూడా జరిగాయి. కొత్త వాళ్లకు పదవులిస్తారా..? పార్టీలోనే కొనసాగుతున్న వారికే అవకాశం ఇస్తారా..? అనేది చర్చనీయాంశంగా మారింది. దీనిపైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.