కూరగాయల సాగును ప్రోత్సహించండి..సెంట్రలైజ్డ్ కిచెన్స్ పరిసర ప్రాంతాల్లో దృష్టి పెట్టండి : సీఎం  రేవంత్‌‌‌‌ రెడ్డి

కూరగాయల సాగును ప్రోత్సహించండి..సెంట్రలైజ్డ్ కిచెన్స్ పరిసర ప్రాంతాల్లో దృష్టి పెట్టండి : సీఎం  రేవంత్‌‌‌‌ రెడ్డి
  • ఆర్గానిక్ సాగు దిశగా రైతులకు అవగాహన కల్పించండి
  • నిపుణుల కమిటీకి సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి సూచన
  • ఎల్‌‌‌‌నినో పరిస్థితుల ప్రభావంపై కమిటీ నివేదిక 
  • 399 మండలాల్లో వరి నాట్లు వేయొద్దు
  • ఇంటికి ఇంకుడు గుంత, పొలానికి పంట కుంట తప్పనిసరి
  • రూ.802 కోట్ల నిధులతో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరమని సిఫార్సు

హైదరాబాద్​, వెలుగు:  రాష్ట్రంలో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖతో కలిసి అవసరమైన చర్యలు తీసుకోవాలని నిపుణుల కమిటీకి సీఎం  రేవంత్‌‌‌‌రెడ్డి సూచించారు. ఇందుకు అవసరమైన విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు కొత్తగా నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్  కిచెన్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు, ఇతర పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. రైతులు పండించిన పంటలను నేరుగా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ శాఖ నుంచి ఎక్స్‌‌‌‌టెన్షన్‌‌‌‌ అధికారులను నియమించి, సంబంధిత విభాగాల్లో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

ప్లానింగ్​ కమిషన్​ వైస్​ చైర్మన్ చిన్నారెడ్డి  అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీతో గురువారం ఎంసీఆర్‌‌‌‌‌‌‌‌హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్‌‌‌‌లో  సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి సమావేశమయ్యారు. ఎల్ నినో పరిస్థితుల ప్రభావంపై కమిటీ నివేదికను సమర్పించింది. ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలో ప్రస్తుత ఎల్‌‌‌‌నినో పరిస్థితుల ప్రభావం, అత్యవసర కార్యాచరణ ప్రణాళికపై  ప్రస్తావించింది. గ్రామాలవారీగా అత్యవసర ప్రణాళికలు రూపొందించి పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరు ధాన్యాలు, కూరగాయల పంటలను ప్రోత్సహించాలని తెలిపింది.  కార్యాచరణ ప్రణాళిక అమలుకు సుమారు రూ.802.92 కోట్ల నిధులు అవసరమవుతాయని నివేదికలో అంచనా వేశారు.

 ఆగస్టు 10 వరకే వరి..

ఎల్‌‌‌‌నినో ప్రభావంతో తలెత్తిన తీవ్ర వర్షాభావ పరిస్థితులను తట్టుకోవడానికి - విత్తనాల సబ్సిడీకి రూ. 329.18 కోట్లు తక్షణమే విడుదల చేయాలని, బిందు, తుంపర సేద్యానికి రూ. 452.80 కోట్లు, వర్మి కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటుకు రూ. 5.12 కోట్లు మంజూరు చేయాలని  ప్రభుత్వానికి  నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. తీవ్ర నీటి కొరత ఉన్న 399 మండలాల్లో బోర్ల కింద కొత్తగా వరి నాట్లు వేయకుండా నిషేధించాలని స్పష్టం చేసింది.  ప్రాజెక్టుల్లోని నీటిని కేవలం తాగునీటి అవసరాలకే పరిమితం చేయాలని  తెలిపింది. వర్షాభావం వల్ల ఆలస్యంగా వరి నాట్లు వేస్తే తెగుళ్ల ఉధృతి పెరిగి దిగుబడులు దెబ్బతింటాయని, జులై 31 (ఉత్తర తెలంగాణ), ఆగస్టు 5 (మధ్య తెలంగాణ), ఆగస్టు 10 (దక్షిణ తెలంగాణ)ని సాగుకు చివరి గడువుగా నిర్ణయించి, ఆ తర్వాత ప్రత్యామ్నాయ పంటలకు మారాలని నిపుణులు సూచించారు.

పొడి వాతావరణంలో పంటలు ఎండిపోకుండా ఉండేందుకు ఆకులపై 1% పొటాషియం నైట్రేట్ లేదా 2% యూరియాను పిచికారీ (ఫోలియార్ స్ప్రే) చేయాలని తెలిపారు. మరోవైపు, సూక్ష్మ సేద్యానికి రూ. 452.80 కోట్లు కేటాయించాలని కోరారు. హైదరాబాద్ పరిసర గ్రామాల్లో కూరగాయల సాగును ప్రోత్సహిస్తూ రైతు బజార్లకు రవాణా సౌకర్యం కల్పించాలని నివేదికలో కమిటీ పేర్కొన్నది. గ్రామీణ ప్రాంతాల్లో డైరీ యూనిట్లను స్థాపించేందుకు ఆర్థిక సహాయం అందించాలని, అత్యవసర చర్యల అమలును పర్యవేక్షించేందుకు గ్రామస్థాయి బృందాలను ఏర్పాటు చేయాలని తెలిపింది.

‘‘రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 28 లక్షల వ్యవసాయ బోర్ల ద్వారా నీటిని తోడటంతో భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయి. నీటి నిల్వల పెంపునకు ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, పొలానికి పంట కుంట, ఊరికి ఊట కుంట  అనే నినాదంతో వర్షపు నీటి నిల్వ కార్యక్రమాన్ని చేపట్టాలి” అని సిఫార్సు చేసింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే చాన్స్​ ఉంది అని పేర్కొన్నది. 

 ఉదయం పూట 3 వేల మెగావాట్ల విద్యుత్​ లోటు 

 గృహ, పారిశ్రామిక విద్యుత్ డిమాండ్‌‌‌‌తోపాటు రైతులు ఏకకాలంలో పంపుసెట్లు వాడటం వల్ల ఉదయం వేళల్లో ఏకంగా 3 వేల మెగావాట్ల విద్యుత్ లోటు ఏర్పడుతోందని విద్యుత్ శాఖ తెలిపింది. జలవిద్యుదుత్పత్తి నిలిచిపోవడంతో జాతీయ పవర్ ఎక్స్చేంజీలనుంచి అధిక ధర చెల్లించి విద్యుత్‌‌‌‌ కొనుగోలు చేయాల్సి వస్తోందని పేర్కొన్నది. ఈ గ్రిడ్ ఒత్తిడిని తగ్గించడానికి వ్యవసాయ ఫీడర్ల సరఫరాను పగటిపూట సోలార్ వెలుగులున్న సమయానికే మార్చాలని కమిటీ సూచించింది.  

నిపుణుల కమిటీ కీలక నిర్ణయాలు

  •    రాబోయే యాసంగి సీజన్‌‌‌‌లో  శనగ, ఆవాలు, జొన్న పంటల విస్తీర్ణాన్ని పెంచాలి. 
  •    రైతులకు నిరంతర ఆదాయం వచ్చేలా ‘పావు ఎకరా సమీకృత నమూనా’ను ప్రోత్సహించాలి.
  •    అంతర్జాతీయ సంస్థలు అభివృద్ధి చేసిన ఏఐ ఆధారిత సమాచార వ్యవస్థ ద్వారా రైతుల మొబైళ్లకు నేరుగా వాతావరణ హెచ్చరికలు, ప్రత్యామ్నాయ వ్యవసాయ సలహాలు పంపాలి.