శాయంపేట, వెలుగు : హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని గట్లకానిపర్తి శివారులో ఉన్న లక్ష్మీనర్సింహ ఇండస్ట్రీస్, శ్రీ వినాయక ఆగ్రో ఇండస్ట్రీస్ మిల్లుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 2025--26 ఏడాదికి సంబంధించిన ఖరీఫ్, రబీ సీజన్ల సీఎంఆర్ కోసం కేటాయించిన వడ్లు, మిల్లర్లు ప్రభుత్వానికి సరఫరా చేసిన బియ్యం, మిల్లుల్లో ఉండాల్సిన నిల్వల వివరాలను పరిశీలించి, ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సుమారు రూ.10 కోట్ల విలువైన సీఎంఆర్ ను మిల్లర్లు పక్కదారి పట్టించినట్లు గుర్తించారు.
రబీ సీజన్ కు సంబంధించి లక్ష్మీనర్సింహ రైస్ మిల్లులో రూ.4, 42,54,886 విలువైన 1531.840 టన్నులు, వినాయక అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించిన రూ.4,61,29,753 విలువైన 1596.987 టన్నుల వడ్లు తక్కువగా ఉన్నట్లు తేలింది. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్ల రిపోర్ట్ ఆధారంగా మిల్లర్లు సీహెచ్.లక్ష్మణ్ రావు, పి.కిరణ్ పై సివిల్ సప్లై ఆఫీసర్లు గురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ పోర్స్ మెంట్ సీఐలు అనిల్, రాకేశ్, సవిల్ సప్లై ఆఫీసర్లు భద్రునాయక్, భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
