- 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుదాం
- కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ అగ్రికల్చర్ రీజియన్లుగా డెవలప్‌మెంట్
- బ్లూ అండ్ గ్రీన్ హైదరాబాద్ లక్ష్యంగా నీటి వనరులు, అటవీ ప్రాంతాల పునరుద్ధరణ
- తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్‌పై అధికారులకు సీఎం సూచన
హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ అభివృద్ధి ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పొరుగు రాష్ట్రాలతో కాకుండా చైనా, జపాన్ లాంటి దేశాలతో పోటీ పడేలా ‘తెలంగాణ రైజింగ్- 2047’ పాలసీ డాక్యుమెంట్ ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
గురువారం హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ -2025’ ఏర్పాట్లు, పాలసీ డాక్యుమెంట్ రూపకల్పనపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2047 నాటికి రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
‘‘వాస్తవిక దృక్పథంతో పాలసీ డాక్యుమెంట్ ఉండాలి. తెలంగాణను 2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ తయారు చేయాలి. ఇందుకోసం రాష్ట్రాన్ని కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ అగ్రికల్చర్ అనే మూడు రీజియన్లుగా విభజించాలి. ఈ మూడు జోన్ల ద్వారా హైదరాబాద్, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల మధ్య సమతుల్య అభివృద్ధిని సాధించాలి” అని సూచించారు.
ఈ రంగాలే కీలకం..
ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్టార్టప్స్, టూరిజం వంటి రంగాలు వచ్చే 20 ఏండ్లలో రాష్ట్ర ఆర్థిక వృద్ధికి కీలకం కానున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘సులభతర వాణిజ్యం, అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాల ద్వారా రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మారుద్దాం. ఔటర్ రింగ్ రోడ్డు తరహాలో రీజనల్ రింగ్ రోడ్డును అభివృద్ధి చేయాలి.
హై-స్పీడ్ రవాణా కారిడార్లు, రీజనల్ రింగ్ రైల్, నాలుగు పారిశ్రామిక కారిడార్లు, 11 రేడియల్ రోడ్లను నిర్మిస్తాం. వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, కొత్తగూడెంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం. అలాగే, హైదరాబాద్ నుంచి బందరు పోర్టు వరకు రహదారిని నిర్మించి నౌకాశ్రయంతో అనుసంధానం చేయనున్నాం” అని తెలిపారు.
చెరువులను, పార్కులను కాపాడుతాం..
బ్లూ అండ్ గ్రీన్ హైదరాబాద్ లక్ష్యంగా నీటి వనరులు, అటవీ ప్రాంతాల పునరుద్ధరణ చేపట్టనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా మూసీ పునరుజ్జీవం, 2,959 చెరువులు, పార్కులను అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. గ్రామాల్లో స్వచ్ఛమైన తాగునీరు, సౌర విద్యుత్ వెలుగులు అందించాలనే లక్ష్యంతో ‘విలేజ్ 2.0’తో ముందుకెళ్తున్నట్టు పేర్కొన్నారు.
ప్రతి ఏటా 2 లక్షల మంది యువతకు స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి విదేశాలకు పంపడం, క్రీడల అభివృద్ధికి స్పోర్ట్స్ విలేజీలు, సంపూర్ణ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు, బతుకమ్మ, బోనాల వంటి పండుగలతో రాష్ట్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడం ఈ విజన్ డాక్యుమెంట్‌లో కీలక అంశాలుగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
