- నెట్‌ఫ్లిక్స్ రాకతో మన సంస్కృతి, సంప్రదాయాలు విశ్వవ్యాప్తం: సీఎం
- రాబోయే పదేండ్లలో ఫార్చ్యూన్-500 కంపెనీలను రాష్ట్రానికి తెచ్చే యోచన
- క్రీడారంగంలోనూ రాష్ట్రంతో నెట్ ఫ్లిక్స్ భాగస్వామ్యం
- హైటెక్ సిటీలో నెట్‌ఫ్లిక్స్ ‘ఐలైన్ స్టూడియోస్’ ప్రారంభం
- నెట్‌ఫ్లిక్స్ హెడ్‌క్వార్టర్స్‌ను ఏఐ సిటీకి తరలించాలని సీఈఓకు సూచన
హైదరాబాద్, వెలుగు: వరల్డ్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా తెలంగాణను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతీయతను, ఇక్కడి ప్రతిభను గౌరవిస్తూనే వినోద రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.
నెట్‌ఫ్లిక్స్ లాంటి అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ రావడంతో ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చూపించే అద్భుత అవకాశం దొరుకుతుందన్నారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా నెట్ ఫ్లిక్స్‌ను, హైదరాబాద్‌ను అందరూ ప్రేమిస్తారు. ఎందుకంటే ఈ రెండూ ఎంతోమందికి ఫుడ్, ట్రావెల్, హిస్టరీ, హెరిటేజ్, సంస్కృతి, సంప్రదాయాలను అందిస్తుంటాయి’’ అని సీఎం అభి ప్రాయపడ్డారు.
హైటెక్ సిటీలో గురువారం నెట్ ఫ్లిక్స్ ఐ లైన్ స్టూడియోస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. అమెరికాలో ఉన్న నెట్‌ఫ్లిక్స్ కార్పొరేట్ ప్రధాన కార్యాలయాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయబోయే ఏఐ సిటీకి మార్చాలని సీఈఓ జెఫ్ షాపిరోను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రాబోయే పదేండ్లలో ఫార్చ్యూన్ 500 జాబితాలోని ప్రతి కంపెనీని రాష్ట్రానికి రప్పించాలన్నదే తన లక్ష్యమని, ఇదే విషయాన్ని ప్రధాని మోదీకి కూడా చెప్పానన్నారు. దేశ జనాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ, రాబోయే 22 ఏండ్లలో దేశ ఆర్థిక వ్యవస్థకు 10 శాతం వాటా అందించేలా అడుగులు వేస్తోందని సీఎం తెలిపారు. నెట్‌ఫ్లిక్స్ అనుబంధ 'ఐలైన్ స్టూడియోస్' రాకతో టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాకుండా నేరుగా హాలీవుడ్ సంస్థలే రాష్ట్రానికి వచ్చినట్లయిందన్నారు.
బహుళజాతి సంస్థల పెట్టుబడులు రాష్ట్రానికి ఎంతో అవసరం
అరుంధతి, బాహుబలి లాంటి అద్భుతమైన చిత్రాలు మన సాంకేతిక నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయని సీఎం గుర్తుచేశారు. ఎవరొచ్చినా ఆదరించే స్వభావం ఉన్న నగరం, నెట్‌ఫ్లిక్స్ లాంటి గ్లోబల్ సంస్థలకు సహజసిద్ధమైన ఇల్లుగా మారిందన్నారు. ఇలాంటి రెండు గొప్ప విలువల గల సంస్థలు ఒక్కటైతే కచ్చితంగా గొప్ప విజయాలు సొంతమవుతాయని పేర్కొన్నారు. నెట్‌ఫ్లిక్స్ లాంటి బహుళజాతి సంస్థల పెట్టుబడులు రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు.
రాష్ట్రంలో పెట్టే ప్రతి పెట్టుబడి అత్యంత సురక్షితంగా ఉంటుందని, కచ్చితంగా మంచి లాభాలు వస్తాయని తెలిపారు. ఈ ప్రయాణంలో నెట్‌ఫ్లిక్స్‌కు తమ ప్రభు త్వం తరఫున పూర్తి స్థాయి మద్దతు, సహకారం అందిస్తామన్నారు. క్రీడా ప్రసారాలపై నెట్‌ఫ్లిక్స్ దృష్టి పెట్టిన తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక స్పోర్ట్స్ యూనివర్సిటీని, మౌలిక సదుపాయాలను కల్పిస్తోందని, ఈ విషయంలో నెట్‌ఫ్లిక్స్ సహకారం తీసుకుంటామని సీఎం తెలిపారు. భవిష్యత్ విస్తరణకు కేవలం ఆఫీసు పరిమాణాన్ని కాకుండా నాణ్యత, యువతలోని నైపుణ్యాన్నే కొలమానంగా తీసుకుని భూకేటాయింపులు చేసేలా ఐటీ మంత్రికి ఆదేశాలు ఇచ్చానని సీఎం చెప్పారు.
యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ కేంద్రంగా హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్ కేంద్రంగా యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) రంగాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ రంగంలో నైపుణ్యాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూనే, రీ-స్కిల్లింగ్, అప్-స్కిల్లింగ్ కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. నెట్‌ఫ్లిక్స్ రాకతో సినిమా స్టోరీ టెల్లింగ్ లో ‘తెలంగాణ’ బ్రాండ్ మరింత పటిష్టంగా విశ్వవ్యాప్తం అవుతుందన్నారు.
ప్రపంచ స్థాయి ప్రొడక్షన్ స్టాండర్డ్స్, అడ్వాన్స్డ్ టూల్స్, ఇన్నోవేషన్ ఆధారిత వర్క్ ఫ్లో ఇక్కడి ఎకో సిస్టంలో భాగమవుతాయని ఆయన స్పష్టం చేశారు. నెట్‌ఫ్లిక్స్ సంస్థ భాగస్వామ్యంతో ఇక్కడి యువతకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ మరింత సులభంగా అందుబాటులోకి వస్తుందని మంత్రి వివరించారు. వినోద రంగంలో భవిష్యత్తుకు అవసరమైన ఫ్యూచర్ రెడీ స్కిల్స్ కు హైదరాబాద్ చిరునామాగా మారుతుందని ఆయన అన్నారు.
పరిమాణం కాదు.. నాణ్యతే ముఖ్యం..
పెట్టుబడుల కోసం వచ్చే కార్పొరేట్ కార్యాల యాల భౌతిక పరిమాణాన్ని తాము ఏమాత్రం లెక్కచేయమని, వారు అందించే నాణ్యతే చూస్తామని సీఎం పేర్కొన్నారు. ఒకప్పుడు
డీవీడీల రెంటల్ కంపెనీగా మొదలైన నెట్‌ఫ్లిక్స్ ఇయ్యాల గ్లోబల్ ఓటీటీ లీడర్‌గా ఎదగడం ఒక గొప్ప సక్సెస్ స్టోరీ అని చెప్పారు. నిజాం కాలం నాటి పాత నగరం నుంచి నేటి గ్లోబల్ సిటీగా హైదరాబాద్ మారిన తీరుతో పోలిక ఉందన్నా రు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకుల కోసం అత్యుత్తమ టాలెంట్‌ను, కంటెంట్‌ను నెట్ ఫ్లిక్స్ ఒక చోట చేరుస్తోందని సీఎం చెప్పారు. అదే స్ఫూర్తితో గ్లోబల్ అవకాశాలను, అత్యుత్తమ నైపుణ్యాన్ని హైదరాబాద్ కూడా ప్రపంచానికి అనుసంధానం చేస్తోందని తెలిపారు.
