ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టుల పనుల్లో వేగం పెరగాలి ఇంజినీర్లకు..సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి ఆదేశం

ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టుల పనుల్లో వేగం పెరగాలి ఇంజినీర్లకు..సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి ఆదేశం
  • రెండో రోజు కొనసాగిన సీఎం ప్రాజెక్ట్​ విజిట్
  • పాలమూరు, కల్వకుర్తి ప్రాజెక్టుల పరిశీలన

నాగర్​కర్నూల్, వెలుగు: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని ఇంజినీర్లను సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి  ఆదేశించారు.  ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా ఆయన శుక్రవారం  రెండో రోజు  నాగర్ కర్నూల్ జిల్లాలోని  పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం హెడ్ రెగ్యులటరీ  వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌‌‌‌ను వీక్షించారు.  పాలమూరు–- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ప్యాకేజీలవారీగా పూర్తిచేసిన, కొనసాగుతున్న   పనులను గురించి ప్రాజెక్ట్ ఇంజినీర్లు వివరించారు.

నార్లాపూర్ రిజర్వాయర్ (అంజనగిరి రిజర్వాయర్ ) డెలివరీ సిస్టర్న్​ను  పరిశీలించిన సీఎం.. ఇంజనీర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్​ కెపాసిటీ 6.4 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ఏర్పాటు చేసిన 4 పంపుల ద్వారా నీటిని ఎత్తి పోసేందుకు పనులు చేపడుతున్నట్టు అధికారులు వివరించారు.  శ్రీశైలం బ్యాక్​ వాటర్​ నుంచి నార్లాపూర్ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌కు డెలివరీ సిస్టర్న్​ ద్వారా నీరు నింపి  ఏదుల పంప్​హౌస్‌‌‌‌ ద్వారా రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌కు తరలిస్తామని తెలిపారు. డెలివరీ సిస్టర్న్‌‌‌‌లో ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసేందుకు 4 పంపులు సిద్ధంగా ఉండగా, మరో 4 పంపులను ఏర్పాటు  చేస్తున్నట్టు చెప్పారు.  

నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి  ప్యాకేజీ 2 ,3, 4  ద్వారా ఏదుల పంప్ హౌస్‌‌‌‌కు నీటిని తరలించడంలో ఎదురవుతున్న ఇబ్బందులను సీఎం ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం ఎంజీకేఎల్ఐ  స్కీమ్‌‌‌‌లోని ఎల్లూరు పంప్‌‌‌‌హౌస్‌‌‌‌ను పరిశీలించారు. కుమ్మెర గ్రామం వద్ద  వట్టెం పంపుహౌజ్‌‌‌‌​ మూడో లిఫ్టును సందర్శించారు.  2023  నాటికి ఈ ప్యాకేజీకి కింద రూ.3.300 కోట్లు ఖర్చు చేయగా, 2023 నుంచి ఇప్పటి వరకు రూ.800 కోట్లు ఖర్చు చేసినట్టు సీఎంకు అధికారులు వివరించారు. పెండింగ్‌‌‌‌లో ఉన్న సివిల్ పనులను రూ.90 కోట్లతో  3 నెలల్లో పూర్తి చేస్తామని  తెలిపారు.

వట్టెం పంప్‌‌‌‌హౌస్‌‌‌‌లో 10 పంపులకుగానూ 5 పంపులు ఫిట్ చేసి ట్రయల్ రన్ నిర్వహించామన్నారు. వర్షాకాలంలో వెంకటాద్రి (వట్టెం) రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌కు నీటిని తరలిస్తామని చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా 12.30 లక్షల ఎకరాలకు  సాగునీటితోపాటు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల ప్రజలు తాగేందుకు,   పరిశ్రమలకు నీటి సరఫరా చేయనున్నట్టు తెలిపారు. కొల్లాపూర్ పట్టణంలోని మంత్రి జూపల్లి కృష్ణారావు నివాసంలో బ్రేక్​ ఫాస్ట్​ అనంతరం  సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి  స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్​ నాయకులు, అభిమానులను కలిశారు.  మంత్రులు ఉత్తమ్​  కుమార్ రెడ్డి,  జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్  యెన్నం శ్రీనివాస్ రెడ్డి , ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్‌‌‌‌రెడ్డి, వీర్లపల్లి శంకర్​,  కార్పొరేషన్​ చైర్మన్లు పాల్గొన్నారు.