వచ్చిన ఆదాయమంతా మిత్తీలకే..

వచ్చిన ఆదాయమంతా మిత్తీలకే..
  • గత ప్రభుత్వం చేసిన అప్పులకు అధిక వడ్డీలతో రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతున్నది: సీఎం రేవంత్​
  • రుణాలపైన వడ్డీ తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నం
  • ట్రిపుల్ ​ఆర్​, పట్టణ మౌలిక సదుపాయాలపై దృష్టి సారించినట్లు వెల్లడి
  • రేవంత్‌‌‌‌తో పీఎం ఆర్థిక సలహా మండలి చైర్మన్ మహేంద్రదేవ్ భేటీ

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్​ ప్రభుత్వం తీసుకున్న అధిక వడ్డీ రుణాలపై సీఎం రేవంత్​ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అధిక శాతం వడ్డీల కారణంగా రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతున్నదని, తిరిగి చెల్లింపులు కష్టమవుతున్నాయని తెలిపారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్‌‌‌‌లోని ఆయన నివాసంలో ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ డాక్టర్ ఎస్. మహేంద్ర దేవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే అంశంపై విస్తృతంగా చర్చించారు. 

ఈ సందర్భంగా సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడుతూ.. వడ్డీలు చెల్లించడం కోసమే రాష్ట్ర ఆదాయం ఎక్కువ భాగం ఖర్చు చేయాల్సి వస్తున్నదని అన్నారు. అధిక వడ్డీ రేట్లకు తీసుకున్న రుణాలపై వడ్డీ తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నామని  మహేంద్రదేవ్‌‌‌‌కు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్లకు దాదాపు రూ.5,500 కోట్లు చెల్లిస్తున్నదని వివరించారు.

 అలాగే, గత ప్రభుత్వం పెండింగ్​ బిల్లులు కలిపి  దాదాపు రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసిందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్​ భగీరథతోపాటు వివిధ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఎక్కువ వడ్డీలకు అప్పులు చేసిందని పేర్కొన్నారు. ఈ  అప్పుల చెల్లింపులు మొదలు కావడంతో  కిస్తీలు, వడ్డీలకు కలిపి ప్రతినెలా దాదాపు రూ.6 వేల కోట్లు కడుతున్నట్లు వివరించారు. ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై ఎక్కువగా ఆధారపడుతున్నదని పేర్కొన్నారు.   

దేశాభివృద్ధిలో రాష్ట్రాలు కీలకం

సమాఖ్య విధానంలో కేంద్ర, రాష్ట్రాలు పరస్పరం గౌరవించుకోవాలని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం డెవలప్​అవుతుందని వెల్లడించారు. ఇది దేశ ప్రగతికి అత్యంత కీలకమని పేర్కొన్నారు. హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్​ఆర్​), దీనికి అనుసంధానంగా రేడియల్ రోడ్లు కూడా నిర్మిస్తున్నామని వివరించారు. ఈ ప్రాజెక్టులు హైదరాబాద్ అభివృద్ధికి, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.

 హైదరాబాద్‌‌‌‌తో పాటు రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగంతోపాటు సేవల రంగం అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఉద్యోగులకు సముచితమైన అవకాశాలు కల్పిస్తేనే రాష్ట్రానికి కొత్త కంపెనీలు వస్తాయని ఆయన అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌‌‌‌కుమార్ సుల్తానియా పాల్గొన్నారు.