నువ్వు కట్టిన అద్భుతమేందో..కాళేశ్వరం దగ్గర్నే చర్చిద్దాం రా : సీఎం రేవంత్​రెడ్డి

నువ్వు కట్టిన అద్భుతమేందో..కాళేశ్వరం దగ్గర్నే చర్చిద్దాం రా : సీఎం రేవంత్​రెడ్డి
  • మెదడును కరిగించి, రక్తాన్ని ధారబోసి కడ్తే మూడేండ్లకే ఎట్ల కూలింది?
  • పెగ్గేసి కాళేశ్వరం డిజైన్‍ గీసినవా?బయట ప్రగల్భాలు పలుకుడేంది?
  • అసెంబ్లీకి రమ్మంటే ఎందుకు పారిపోయినవ్​?
  • హరీశ్​రావు..! రాజీనామా లేఖ జేబులో పెట్టుకో.. పంద్రాగస్టు రోజు నీతో మాట్లాడ్త
  • సమ్మక్క సారలమ్మ సాక్షిగా ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి చూపిస్తం
  • కేసీఆర్​, మోదీ బొమ్మాబొరుసులాంటోళ్లని విమర్శ.. వరంగల్​ సభలో ప్రసంగం

వరంగల్‍ / హనుమకొండ, వెలుగు : మెదడును కరిగించి, రక్తాన్ని ధారబోసి కాళేశ్వరాన్ని కట్టినట్లు కేసీఆర్​ చెప్తున్నారని.. అట్ల మెదడును కరిగించి కడితే మూడేండ్లకే ఎందుకు కూలిపోయిందని సీఎం రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. ‘‘కేసీఆర్​కు సూటిగా సవాల్‍ విసురుతున్న. నువ్వు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతమేందో.. నీ అద్భుతం తెలంగాణ ప్రజలకు ఏ రకంగా ఉపయోగమో.. కాళేశ్వరం దగ్గర్నే కూసొని చర్చిద్దాం రా! మేం అందరం వస్తం. ఆడ్నే కూసుందాం. నిపుణులను పిలిపిద్దాం. మేధావులను పిలిపిద్దాం.. తెలంగాణ సమాజాన్ని ఆహ్వానిద్దాం.. అన్నీ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తది. నీకు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే రా..” అని కేసీఆర్​కు సవాల్​ విసిరారు. 

 ‘‘లక్ష కోట్లు ఖర్చుపెట్టి కట్టిన కాళేశ్వరం కూలింది.. మేడిగడ్డ మేడి పండైంది.. సుందిల్ల సున్నమైంది.. అన్నారం ఆకాశంలో కలిసిపోయింది. గిదీ నీ గొప్పతనం” అని విమర్శించారు. పదేండ్లు చేసిన దోపిడీని ఎక్కడ ప్రశ్నిస్తారోనని అసెంబ్లీకి రాకుండా కేసీఆర్​ పారిపోయారని మండిపడ్డారు. ‘‘అసెంబ్లీకి రాని దద్దమ్మలు.. బడికి రాని బడిదొంగల్లాంటోళ్లు. అట్లాంటి బడిదొంగ టీవీల నాలుగు గంటలు కూసొని ప్రగల్భాలు పలికిండు.

 పదేండ్లు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు అసెంబ్లీకి ఎందుకు రాలే. పదేండ్లలో జరిగిన దోపిడీని ఎక్కడ ప్రశ్నిస్తరోనని, ఎక్కడ అంగీలాగీ ఊడదీస్తరోనని పారిపోయిండు. అసెంబ్లీలో మా కండ్లలోకి చూసే ధైర్యం లేక తప్పించుకున్నడు” అని ఆయన విమర్శించారు. వరంగల్‍ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా బుధవారం గ్రేటర్‍ వరంగల్‍ మడికొండలో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్‍రెడ్డి మాట్లాడారు. 

ఇంతకంటే దివానా ఎవరైనా ఉంటరా?

‘‘కేసీఆర్‍ తన మెదడును రంగరించి, రక్తాన్ని ధారబోసి కాళేశ్వరం కట్టిండట. దద్దమ్మ! నువ్వు అట్ల కట్టినవో లేదో ఇట్ల కూలిపోయింది. ఇంతకంటే ప్రపంచంలో దివానా ఎవరైనా ఉంటరా? కాళేశ్వరం డిజైన్‍ పెగ్గు వేసినప్పుడు గీసి, దిగినప్పుడు దించినవా?” అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‍ ఓ టీవీ చానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూను సీఎం రేవంత్​ ప్రస్తావిస్తూ.. ‘‘అడిగెటోడు నీవోడే. సూపిచ్చెటోడు నీవోడే. నీ సొల్లు పురాణమంతా నాలుగు గంటలు చెప్తున్నవ్‍ కదా. నువ్వు కట్టింది అద్భుతమైతే కాళేశ్వరం వద్దనే తేల్చుకుందాం. మంథని నియోజకవర్గంలోని కాళేశ్వరం వద్దకు కలిసిపోదాం” అని అన్నారు. గతంలో కాంగ్రెస్​ ప్రభుత్వం కట్టిన నాగార్జున సాగర్‍, శ్రీశైలం, శ్రీరాంసాగర్‍, కల్వకుర్తి, నెట్టెంపాడు, జూరాల, కడెం, దేవాదుల ప్రాజెక్టులు ఎట్లున్నయో.. కేసీఆర్​ కట్టిన కాళేశ్వరం ఎట్లుందో అందరికీ తెలుసని పేర్కొన్నారు. 

అగ్గిపెట్టె నుంచి అగర్‍బత్తి దాకా మోదీ జీఎస్టీ వేసిండు

దేశ ప్రధానిగా నరేంద్రమోదీ వచ్చాక పెట్రోల్‍, డీజిల్, గ్యాస్‍ అన్ని రేట్లు పెంచారని.. అగ్గిపెట్టె, సబ్బుబిల్లతో మొదలు చివరికి అగర్‍బత్తిపై కూడా జీఎస్టీ వేశారని సీఎం రేవంత్‍రెడ్డి అన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోదీ చెప్పారని, అట్లయితే పదేండ్లలో  20 కోట్ల ఉద్యోగాలివ్వాలని, అవి ఎటుపోయాయని ప్రశ్నించారు. ‘‘మోదీ ఇచ్చిన హామీలు ఏవైనా అమలయ్యాయా?  బీజేపీ నేతలు చెప్పాలి. దేశంలో ప్రజల ఆదాయం పెరగలేదు కానీ.. అదానీ, అంబానీ ఆస్తులు పెరిగినయ్​. స్విస్‍ బ్యాంక్‍ నుంచి లక్షలాది కోట్లు తీసుకొచ్చి అందరి ఖాతాలో 15 లక్షలు వేస్తానని మోదీ చెప్పిండు. 

అవి వేయకుండా ఏ ముఖంతో ఓట్లు అడుగుతరు?” అని ఆయన నిలదీశారు. కాజీపేటకు సోనియమ్మ కోచ్‍ ఫ్యాక్టరీ ఇస్తే దాన్ని మోదీ మహారాష్ట్రకు తరలించారని ఫైర్​ అయ్యారు. ‘‘బీజేపోళ్లు శ్రీరామనవమి వస్తే రాజకీయం.. హనుమాన్‍ జయంతి వస్తే ఇంకో రాజకీయం చేస్తున్నరు. దేవుడు గుడిలో, భక్తి గుండెల్లో ఉండాలి.. దేవుడి పేరుతో ఓట్లు పొందాలని చూసేవారికి పోలింగ్‍ బూత్‍లో గుణపాఠం చెప్పాలి” అని అన్నారు. గడిచిన పదేండ్లలో రాష్ట్రాన్ని ఢిల్లీకి కేసీఆర్‍  తాకట్టు పెట్టారని.. బొమ్మ బొరుసులా కేసీఆర్​, మోదీ తెలంగాణకు అన్యాయం చేశారని ఆయన మండిపడ్డారు. 

కడియంను నేనే పార్టీలోకి పిలిచిన

కడియం శ్రీహరి కాంగ్రెస్‍ పార్టీలోకి వస్తానని తమను సంప్రదించలేదని.. తానే పార్టీ నేతలను ఆయన వద్దకు పంపినట్లు సీఎం రేవంత్‍రెడ్డి స్పష్టం చేశారు. ‘‘కడియం శ్రీహరి వంటి నీతినిజాయితీ కలిగిన సీనియర్లు మా వెంట ఉండాలని నేనే పార్టీలోకి రావాలని ఆహ్వానం పంపిన” అని తెలిపారు.  ‘‘ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేసి, రాజ్యాంగాన్ని మార్చేసి, దళితులు గిరిజనుల మీద దాడి చేయాలని బీజేపీ చూస్తున్నది.

 అలాంటి పార్టీపై కొట్లాడేందుకే కాంగ్రెస్​ పార్టీలోకి కడియం శ్రీహరి వచ్చారు” అని ఆయన చెప్పారు. ‘‘భూములు మింగిన ఆరూరి రమేష్​ అంగి, జెండా మార్చి.. వరంగల్‍ బీజేపీ అభ్యర్థిగా ముందుకు వచ్చిండు. ఆయనను ఓటర్లు బండకేసి కొట్టాలి. ఆనాడు కొండా సురేఖ, సీతక్క లెక్కనే.. జిల్లానుంచి  మరో ఆడబిడ్డ కడియం కావ్యను నాయకురాలిగా ఎదిగేలా దీవించాలి” అని అన్నారు. సభలో మంత్రులు శ్రీధర్‍బాబు, సీతక్క, కొండా సురేఖ, వరంగల్​ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‍రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హరీశ్​.. రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకో 

రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకోవాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ ​రావుకు సీఎం రేవంత్​రెడ్డి తేల్చి చెప్పారు. మామ, అల్లుడు తోక తెగిన బల్లుల్లా ఎగురుతున్నారని కేసీఆర్​, హరీశ్​రావుపై ఆయన ఫైర్​ అయ్యారు. ‘‘రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అంటూ నిన్నగాక మొన్న హరీశ్​రావు అన్నడు. నేను వరంగల్‍ వేదికగా మాట ఇస్తున్న. రామప్ప దేవాలయం శివుడు సాక్షిగా.. సమ్మక్కసారక్క సాక్షిగా.. వేయిస్తంభాల గుడి సాక్షిగా.. చెప్తున్న. పంద్రాగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుత. 

హరీశ్​రావు..! నువ్వు సిద్దిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానన్నవ్‍ కదా. రాజీనామా పత్రం జేబులో పెట్టుకో. పంద్రాగస్టు నాడు నీతో మాట్లాడ్త బిడ్డా. నువ్వు మాటమీద ఉండాలె” అని ఆయన సవాల్​ చేశారు. ‘‘నీ మామలెక్క తలకాయ లేని మాటలు మాట్లాడుదాం అనుకుంటున్నవేమో. పంద్రాగస్టు నాడు నీతో మాట్లాడ్త. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినరోజు మాత్రమే కాదు.. రైతులకు కూడా ఆర్థిక స్వాతంత్ర్యం తీసుకొచ్చేరోజు పంద్రాగస్టు. రెండు లక్షల రుణమాఫీచేసి నీతో మాట్లాడ్త. రాజీనామా రెడీ పెట్టుకో’’ అని హరీశ్​రావుకు తేల్చిచెప్పారు. ‘‘తెలంగాణ ఉద్యమం  టైంలో హరీశ్​రావు వంద రూపాయలు పెట్రోల్‍ తెచ్చుకున్నడు తప్పితే ఆయనకు పది పైసల అగ్గిపెట్టె దొరకలేదు. ఇప్పుడు అట్లనే చేస్తే కాంగ్రె స్‍ కార్యకర్తలంతా తలొక అగ్గిపెట్టెతో సిద్ధంగా ఉంటరు” అని సీఎం రేవంత్​రెడ్డి హెచ్చరించారు.