12 ఏళ్లలో మోడీ.. 10 ఏళ్లలో కేసీఆర్.. 2 ఏళ్లలో నేనే ఏం చేశానో చర్చకు సిద్ధం: సీఎం రేవంత్ సవాల్

12 ఏళ్లలో మోడీ.. 10 ఏళ్లలో కేసీఆర్.. 2 ఏళ్లలో నేనే ఏం చేశానో చర్చకు సిద్ధం: సీఎం రేవంత్ సవాల్

హైదరాబాద్: పన్నెండేళ్లలో మోడీ.. పదేళ్లలో కేసీఆర్, రెండేళ్లలో తాను ఏం చేశానో అసెంబ్లీలో చర్చిద్దామని బీజేపీ, బీఆర్ఎస్‎లకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తేనే మోడీ ప్రధాని అయ్యారని.. అలాంటప్పుడు తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసం బీజేపీ ఎంపీలు మోడీని అడగరా అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు తేకుండా బీజేపీ ఎంపీలు పొంకనాలు కొడుతున్నారని విమర్శించారు. తుమ్మిడి హట్టి ప్రాజెక్ట్ గురించి మహారాష్ట్ర సీఎం తెలంగాణతో చర్చలకు రాకుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డేనని.. నేనే ఏం చేసిన ఆయన అడ్డుపడుతున్నారని అన్నారు. కిషన్ రెడ్డి ఎంత లడాయికోతి అనేది అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. 

సబర్మతి నదిని సూపర్ అంటున్న బీజేపీ ఎంపీలకు మన మూసీ బాగుపడాలని లేదా.. మూసీ పునర్జీవనాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. తెలంగాణను అభివృద్ధి చేసుకునే బాధ్యత బీజేపీ ఎంపీలకు లేదా అని నిలదీశారు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ నలుగురు ఎంపీలు ఉన్నారని.. వీళ్లు మెట్రో, మూసీ ప్రక్షాళనకు కేంద్రం నుంచి ఎందుకు అనుమతులు తీసుకురావడం లేదన్నారు. ఎన్నాళ్లు గుజరాత్‎కి గులాములుగా ఉంటారని హాట్ కామెంట్ చేశారు. ఇక, పదేళ్లుగా సీఎంగా ఉన్నాయని అధికారం పోగానే ఫాంహౌస్‎లో పండుకుండని కేసీఆర్‎ను విమర్శించారు. ఎన్నికలకు ఆర్నెళ్ల ముందే రాజకీయాలను.. అప్పటి వరకు మనమంతా తెలంగాణ అభివృద్ధికి పాటుపడాలని కోరారు.   

►ALSO READ | హైదరాబాద్‎లో కొత్త ఫ్లైఓవర్, రోడ్లకు CM రేవంత్ శంకుస్థాపన.. ఎక్కడెక్కడ వస్తున్నాయంటే..?

సోమవారం (జూన్ 8) సైబరాబాద్‎ కార్పొరేషన్‎లో సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘దేశంలో ఆరు పెద్ద నగరాలు ఉన్నాయి.. ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, కోల్ కతా, చెన్నై, బెంగళూర్ నగరాలే దేశ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నాయి. కానీ దేశంలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్, కాలుష్యమే ప్రధాన సమస్య.  వర్షమొస్తే ముంబై నీట మునుగుతుంది.. ఎక్కడికక్కడే ట్రాఫిక్‌ జామ్‌ అవుతుంది. స్లమ్స్‌లో సదుపాయాలు లేక ముంబైలో నివసించే పరిస్థితి లేదు. ఇక, కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టకుండా దేశ రాజధాని ఢిల్లీని పడావ్‌ పెట్టారు. బెంగళూరులో ట్రాఫిక్‌ సమస్య వల్ల ఎప్పుడు ఆఫీస్ వెళ్తామో, ఎప్పుడు ఎయిర్ పోర్టుకు చేరుకుంటామో తెలియని పరిస్థితి. 

గత ఏడాది వారం రోజుల పాటు తమిళనాడు రాజధాని చెన్నై వరదల్లోనే ఉంది. ఇక, కలకత్తాలో శాంతి భద్రతల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. వేగంగా విస్తరిస్తోన్న హైదరాబాద్ ఈ ఐదు మహా నగరాల నుంచి  గుణపాఠం నేర్చుకోవాలి. ఒక్కటే నగరంగా ఉంటే అనేక సమస్యలు ఉన్నాయి. అందుకే పరిపాలనలో  సమస్యలు తలెత్తకుండా హైదరాబాద్ మహా నగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించాం. 

పెద్ద నగరాల్లో ఉన్న సమస్యలు ఇక్కడ లేకుండా చేసేందుకు నిపుణులతో కమిటీ వేసి ఈ నిర్ణయం తీసుకున్నాం. సైబరాబాద్ కార్పొరేషన్లో ఐటీ కంపెనీలు ఉన్నాయి. అమెరికా సిలికాన్ వ్యాలీతో మన సైబరాబాద్ పోటీ పడుతోంది. ఇక, 76 డివిజన్లతో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. అన్ని శాఖలతో సమన్వయం ఉండేలా సరిహద్దులతో కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం’’ అని తెలిపారు.