మేం గేట్లు ఓపెన్​ చేస్తే బీఆర్​ఎస్​ ఖాళీ : సీఎం రేవంత్​రెడ్డి

మేం గేట్లు ఓపెన్​ చేస్తే బీఆర్​ఎస్​ ఖాళీ : సీఎం రేవంత్​రెడ్డి
  • కేసీఆర్​ అండ్​ ఫ్యామిలీ తప్ప ఆ పార్టీలో ఎవరూ మిగలరు
  • ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీఆర్​ఎస్​, బీజేపీ కుట్ర
  • లక్ష్మణ్​..! 8 సీట్లతో ప్రభుత్వాన్ని ఎట్ల ఏర్పాటు చేస్తవో చెప్పు?
  • మోదీ, కేసీఆర్​ కుట్రలు సాగనివ్వం.. మాతో గోక్కున్నోడెవడూ బాగుపడలే
  • కాంగ్రెస్​ సర్కార్​ను కాపాడుకుంటమని 
  • బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలే వచ్చి చెప్పిపోతున్నరు
  • హామీలను అమలు చేస్తుంటే కేటీఆర్, హరీశ్, కవిత ఓర్వలేకపోతున్నరు
  • ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లను గెలుస్తం
  • మణుగూరులో ప్రజా దీవెన సభలో సీఎం వ్యాఖ్యలు

భద్రాద్రి కొత్తగూడెం/ మణుగూరు, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీఆర్​ఎస్, బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయని.. ఇందుకు బీజేపీ నేత లక్ష్మణ్​ మాటలే నిదర్శనమని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. ‘‘ఎనిమిది సీట్లున్న బీజేపీ నేత లక్ష్మణ్​ ఎంపీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం ఉండదని అంటున్నడు. అయ్యా.. లక్ష్మణ్! ఎనిమిది సీట్లతోటి నువ్వు ఎట్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తవో చెప్పు. అంటే.. బీజేపీ, బీఆర్ఎస్​ ఒక్కటై ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేస్తున్నట్టే కదా?!  మోదీ, కేసీఆర్​ కలిసి మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే ఊరుకోం.

మాతో గోక్కున్నోడెవడూ బాగుపడలే” అని హెచ్చరించారు. ఒకవేళ తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్​లో కేసీఆర్, ఆయన ఫ్యామిలీ తప్ప ఎవరూ మిగలరని, అందరూ కాంగ్రెస్​ కండువా కప్పుకుంటారని రేవంత్​ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో సోమవారం నిర్వహించిన ప్రజా దీవెన సభలో సీఎం మాట్లాడారు. అభయహస్తం హామీలను ప్రభుత్వం అమలు చేస్తుంటే ఓర్వలేక కేటీఆర్, హరీశ్​రావు, కవిత శాపనార్థాలు పెడ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు మాత్రం ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. 

‘‘బీఆర్​ఎస్​, బీజేపీ  కుమ్మక్కై ఈ ప్రభుత్వాన్ని పడగట్టాలనే కుట్ర చేస్తున్నయ్. అందుకే బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు చాలా మంది ఇందిరమ్మ రాజ్యం ఉండాలని అంటున్నరు. ఇన్నిరోజులు తాము బీఆర్​ఎస్​లో ఉన్నా ఒక్కరోజు కూడా తమను కేసీఆర్​ కలువలేదని వాళ్లు చెప్తున్నరు. మీ(కాంగ్రెస్​) ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు, మీ మంత్రులు అందరినీ కలుస్తున్నారని, సమీక్షలు చేస్తున్నారని, అభివృద్ధి పనులు చేస్తున్నారని, అందుకే ఐదేండ్లు మీ ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత మాది అని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు వచ్చి చెప్పిపోతున్నరు. కేసీఆర్​..! ఒకవేళ నేను అనుకుంటే, గేట్లు తెరిస్తే.. నువ్వు, నీ అల్లుడు, నీ ఇంటోళ్లు తప్ప మీ పార్టీలోని అందరూ కాంగ్రెస్​ పార్టీ కండువా కప్పుకొని ఇందిరమ్మ రాజ్యానికి, కాంగ్రెస్​ పార్టీకి అండగా నిలబడ్తరు. ఎమ్మెల్యే వెంకట్రావ్​ కూడా ఇవాళ ఈ సభకు వచ్చి మద్దతుగా నిలబడ్డరు’’ అని సీఎం పేర్కొన్నారు. 

14 సీట్లు కాంగ్రెస్​ గెలుస్తదని తెలిసి కుట్ర చేస్తున్నరు

లోక్​సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ 14 సీట్లు గెలుస్తదని తెలిసి మోదీ, కేసీఆర్​ కుట్ర చేస్తున్నారని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. అందుకే బీజేపీ అభ్యర్థులను ప్రకటించిన చోట బీఆర్​ఎస్​ ప్రకటించడం లేదని, బీఆర్​ఎస్​ అభ్యర్థులను ప్రకటించిన చోట బీజేపీ ప్రకటించడం లేదని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్​ కార్యకర్తలు తిప్పికొడ్తారని, 14 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్​ జెండాను ఎగురవేస్తారని అన్నారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్​ ఏడున్నదన్నవాళ్లు ఇవాళ మణుగూరు సభకు వచ్చి చూస్తే తెలుస్తది.

ఇక్కడికి వచ్చినవాళ్ల చప్పట్లతో ఢిల్లీలో మోదీ చెవులు, ఇక్కడ కేసీఆర్​ గుండెలు పగులుతయ్​” అని పేర్కొన్నారు. కేసీఆర్​ సొంత జిల్లా మెదక్​లో బీఆర్​ఎస్​కు అభ్యర్థి కూడా దొరకడంలేదని, కేసీఆర్​ బిడ్డ కవిత ఓడిపోతుందన్న భయంతోనే ఆమెను నిజామాబాద్​లో పోటీకి పెట్టడం లేదని సీఎం రేవంత్​రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ను వంద మీటర్ల లోతులో బొంద పెట్టిన ఘనత ఖమ్మం జిల్లా ప్రజలదేనని, ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తున్నదని ఆయన అన్నారు.

కార్యకర్తలు రక్తాన్ని చెమటగా మార్చి ఇక్కడ పది ఎమ్మెల్యే సీట్లలో తొమ్మిందింటిని గెలిపించారని.. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, నాయకులు భయపడి ఇండ్లలో దాక్కున్నప్పుడు పార్టీ జెండా పట్టి అధికారంలోకి తీసుకొచ్చింది కార్యకర్తలేనని కొనియాడారు. కాంగ్రెస్​ కార్యకర్తలపై ఇష్టమున్నట్టుగా కేసులు పెట్టిన ఒంటి కన్ను శివరాసన్​ ఎక్కడున్నాడో తెల్వదంటూ మాజీ మంత్రి పువ్వాడ అజయ్​ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

సీతారామ ప్రాజెక్ట్​ ఖర్చును రీ డిజైన్​ పేరిట ఇష్టమొచ్చినట్టు పెంచి ఖమ్మం జిల్లాకు నీళ్లు లేకుండా చేసిన పాపం కేసీఆర్​దేనని అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మినిస్టర్​ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఆధ్వర్యంలో మహబూబాబాద్​ నుంచి పార్లమెంట్​కు పోటీ చేస్తున్న బలరాం నాయక్​ను లక్షా యాభై వేల మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. 

బీఆర్​ఎస్​ నేతలకు చెంప పెట్టు : భట్టి 

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బీఆర్​ఎస్​ హయాంలో సంపదంతా దోపిడీకి గురైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘‘ఆరు గ్యారంటీలు ఇస్తారా లేదా అని చూసిన బీఆర్​ఎస్​ నేతలకు చెంప పెట్టులా అభయ హస్తంలోని ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నం” అని తెలిపారు. రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల్లో 12 నుంచి 14 సీట్లను గెలుచుకోబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​  దీపాదాస్​ మున్షి, ఏఐసీసీ సెక్రటరీ రోహిత్​ చౌదరి, మంత్రులు శ్రీధర్​బాబు, ఉత్తమ్​ కుమార్​రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు,  సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్​, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, మహబూబాబాద్​ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్​ పాల్గొన్నారు. 

వేదికపై బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే

మణుగూరు ప్రజాదీవెన సభకు బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్​ హాజరయ్యారు. ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమయ్యారు

కేటీఆర్, హరీశ్​ బిల్లా రంగల్లా రాష్ట్రాన్ని కొల్లగొట్టారని,  కేసీఆర్​ చార్లెస్​ శోభరాజ్​లా రాష్ట్రాన్ని పదేండ్లు దోచుకున్నారని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. ‘‘సన్నాసి .. కేటీఆర్! ఒక్కసారి మీ అయ్యను అడుగు. బీఆర్ఎస్​ ఇచ్చిన ఎన్ని హామీలు అమలు చేశారో’’ అంటూ ఫైరయ్యారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్​ బెడ్రూం ఇండ్లు , గిరిజనులు, ముస్లింలకు రిజర్వేషన్​ అంటూ ప్రజలను కేసీఆర్​ మోసం చేశారని ఆయన అన్నారు. రూపాయి, రూపాయి కూడబెట్టి పేదలు తమ పిల్లలను కోచింగ్​ల కోసం పట్నానికి పంపిస్తే పేపర్​ లీకేజీలతో నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమయ్యారని, చనిపోయిన వాళ్ల కుటుంబాలను కనీసం పరామర్శించలేదని బీఆర్​ఎస్ ​నేతలపై సీఎం మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన 90రోజుల్లోనే 30వేల ఉద్యోగాలిచ్చామని తెలిపారు.