టీఎస్​పీఎస్సీ ప్రక్షాళన..పేపర్ల లీకేజీపై సీఎం రేవంత్ సీరియస్​

టీఎస్​పీఎస్సీ  ప్రక్షాళన..పేపర్ల లీకేజీపై సీఎం రేవంత్ సీరియస్​
  • కొత్త కమిషన్ ఏర్పాటుకు గైడ్​లైన్స్ రూపొందించండి 
  • యూపీఎస్సీ, ఇతర రాష్ట్రాల బోర్డుల పనితీరుపై అధ్యయనం చేసి రిపోర్టు ఇవ్వండి 
  • నోటిఫికేషన్లు ఇచ్చిన ఎగ్జామ్స్​కు కొత్త డేట్స్ ప్రకటించండి
  • అవసరమైన వాటికి అనుబంధ నోటిఫికేషన్లు ఇవ్వండి
  • పూర్తయిన పరీక్షలకు రిజల్ట్స్ రిలీజ్​ చేయాలని ఆదేశాలు 
  • పేపర్ల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించేందుకూ వెనుకాడబోమని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్​ పబ్లిక్​ సర్వీస్ ​కమిషన్​ (టీఎస్ పీఎస్సీ)ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్​రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం సెక్రటేరియెట్​లో టీఎస్ పీఎస్సీపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. టీఎస్ పీఎస్సీ ద్వారా చేపట్టిన నియామకాలు, నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలు అధికారులను అడిగి రేవంత్ తెలుసుకున్నారు.

ఇప్పటికే నోటిఫై చేసిన ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోదని, వాటిని పారదర్శకంగా నింపేందుకు కృషి చేస్తుందని స్పష్టం చేశారు. టీఎస్​పీఎస్సీ ద్వారా ఇప్పటికే నిర్వహించిన పరీక్షల ఫలితాలను విడుదల చేయాలని, కోర్టు కేసులు ఏమైనా ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఇక నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహించాల్సిన వాటికి కొత్త జాబ్ క్యాలెండర్​ రెడీ చేయాలని ఆదేశించారు. 

దానికి అనుగుణంగా ఎగ్జామ్స్ తేదీలను నిర్ణయించాలని, అవసరమైన వాటికి అనుబంధ నోటిఫికేషన్లు ఇవ్వాలని సూచించారు. కాగా, గత ప్రభుత్వం దాదాపు 80 వేల ఉద్యోగ ఖాళీలను నోటిఫై చేసింది.  గ్రూప్​1, గ్రూప్​2, గ్రూప్​3, డీఏఓ, ఏఈ వంటి పరీక్షలను టీఎస్ పీఎస్సీ నిర్వహించాల్సి ఉంది. సీఎం ఆదేశాల నేపథ్యంలో ఈ ఎగ్జామ్స్ ను రీషెడ్యూల్ చేయనున్నారు. 

పేపర్ల లీకేజీపై ఫైర్.. 

టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీపై రేవంత్ సీరియస్ అయ్యారు. లక్షలాది మంది నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగాల కల్పనపై ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా? అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ల లీకేజీ, సిట్ దర్యాప్తుపై సుదీర్ఘంగా చర్చించారు. కేసు పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పేపర్ల లీకేజీలో ఎవరిని దోషులుగా తేల్చారు? కేవలం అందులో పని చేస్తున్న ఉద్యోగులు, వారు సంప్రదించిన బయటి వ్యక్తులకే లింక్​ఉందా? లేదా దీని వెనుక పొలిటికల్ అజెండా ఏమైనా నడిచిందా? అనే కోణంలో ప్రశ్నలు అడిగారు.

పేపర్ లీక్ అయిదంటే, అది కచ్చితంగా బోర్టు బాధ్యత తీసుకోవాల్సిన అంశమని అధికారులతో రేవంత్ అన్నట్టు తెలిసింది. పేపర్ లీక్ అయిన తర్వాత క్యాన్సిల్ చేసి మళ్లీ పెట్టిన గ్రూప్1 పరీక్షలోనూ తప్పులు చేసి.. అది కూడా రద్దు అయ్యేలా చేశారని, ఇంత నిర్లక్ష్యంగా బోర్డు వ్యవహరించడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. పేపర్ల లీకేజీ కేసులో ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్​చేశారో అడిగి తెలుసుకున్నారు. ఈ కేసులో ఇంకా విస్తృతంగా విచారణ చేయాల్సిన అవసరం ఉన్నా, ఏదైనా ఒత్తిడి ఉందని పోలీసులు అధికారులు భావించినా...  కేసును సీబీఐకి అప్పగించేందుకూ రాష్ట్ర ప్రభుత్వం వెనుకాడబోదని రేవంత్ స్పష్టం చేసినట్టు తెలిసింది.

ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారి, సీఎం కార్యదర్శి శేషాద్రి, డీజీపీ రవిగుప్తా, అడిషనల్ డీజీ సీవీ ఆనంద్, టీఎస్ పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, ఆర్థిక శాఖ కార్యదర్శి టి.కె. శ్రీదేవి, సిట్ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

జాబ్ క్యాలెండర్ రూపొందించండి.. 

టీఎస్​పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఇప్పటికే రాజీనామా చేయడం, సభ్యులు కూడా అదే బాట పట్టడంతో కొత్త కమిషన్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అర్హతలు ఉన్నోళ్లను బోర్డులోకి తీసుకోవాలనే దానిపై అధికారులతో రేవంత్ చర్చించారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు అనుగుణంగా టీఎస్ పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకాలకు మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు.

పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తూ ఉద్యోగ నియామకాలు చేపడుతున్న యూపీఎస్సీతో పాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరుపై అధ్యయనం చేసి, సమగ్ర రిపోర్టు ఇవ్వాలన్నారు. ఉద్యోగ నియామకాలను పూర్తి పారదర్శకతతో చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని,  కమిషన్ కు అవసరమైన సౌలతులను కల్పించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు ఉద్యోగ ఖాళీలను నింపేందుకు జాబ్​ క్యాలెండర్​ రూపొందించాలన్నారు.