
- భూసేకరణకు తలెత్తే ఇబ్బందులను తొలగిస్తం
- మీరు కూడా ట్రిపుల్ఆర్కు సహకరించండి
- ఎన్‌హెచ్ఏఐ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో నేషనల్ హైవేస్ నిర్మాణానికి తమ పూర్తి సహకారం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సీఎంను జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ( ఎన్‌హెచ్ఏఐ) ప్రాజెక్టు మెంబర్ అనిల్ చౌదరి, తెలంగాణ రీజనల్ ఆఫీసర్ రజాక్, ప్రాజెక్టు మేనేజర్ భీమ్ సేన్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కలిశారు. రాష్ట్రంలో ఎన్‌హెచ్ఏఐ హైవేస్ నిర్మాణాల్లో భూసేకరణతో పాటు ఇబ్బందులను సీఎంకి వివరించారు. వాటిపై సీఎం స్పందిస్తూ..
హైవేస్ పై బుధవారం రివ్యూ చేస్తామన్నారు. కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులు పాల్గొంటారని, ఆయా సమస్యలపై చర్చించి అక్కడే సమస్యలను పరిష్కరించుకుందామని వారికి సూచించారు. మన్నెగూడ హైవే పనులను వెంటనే ప్రారంభించాలని తెలిపారు. కాంట్రాక్టు సంస్థతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలన్నారు. హైదరాబాద్–-విజయవాడ హైవే విస్తరణ పనులు వెంటనే మొదలు పెట్టాలని, ఈ విషయంలో ఏపీతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలన్నారు. హైదరాబాద్, -విజయవాడ మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే మంజూరు కోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అధికారుల దృష్టికి సీఎం తీసుకెళ్లారు.
ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి సహకరించండి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి సహకరించాలని ఎన్‌హెచ్ఏఐ అధికారులను సీఎం రేవంత్ కోరారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భారత్ మాల పథకంలో ఆర్ఆర్ఆర్ను చేర్చాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో 12 రేడియ ల్ రోడ్లు వస్తాయని తెలిపారు. వాటి మధ్య పలు క్లస్టర్లు, శాటిలైట్ టౌన్ షిప్‌లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. తెలంగాణకు తీర ప్రాంతం లేనందున డ్రైపోర్ట్ ఏర్పాటు చేయనున్నామని
ఇందుకోసం బందర్ పోర్టును అనుసంధానించేలా హై స్పీడ్ ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం చేపట్టాలని ఆఫీసర్లకు సీఎం సూచించారు. హైదరాబాద్, -కల్వకుర్తి హైవే పనులు పూర్తయితే తిరుపతికి 70 కి.మీ దూరం తగ్గుతుందన్నారు. రహదారుల నిర్మాణంపై ప్రతి వారం తనకు నివేదిక ఇవ్వాలని సీఎంవో కార్యదర్శిని సీఎం ఆదేశించారు.
ఎన్‌హెచ్ఏఐ లేవనెత్తిన అంశాలు
1. మంచిర్యాల, -వరంగల్, ఖమ్మం, -విజయవాడ (ఎన్ హెచ్ 163జీ) కారిడార్ నిర్మాణానికి భూముల అప్పగింత
2. ఆర్మూర్-, జగిత్యాల,- మంచిర్యాల (ఎన్ హెచ్ 63 ) భూ సేకరణకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం
3. వరంగల్-, కరీంనగర్ (ఎన్ హెచ్ 563 ) రహదారి నిర్మాణానికి చెరువు మట్టి ,ప్లై యాష్ సేకరణ
4. ఎన్‌హెచ్ 44తో కాళ్లకల్-, గుండ్లపోచంపల్లి రహదారి ఆరు వరుసల విస్తరణకు భూ సేకరణ
5. జాతీయ రహదారుల నిర్మాణంలో విద్యుత్ సంస్థలతో తలెత్తే సమస్యల పరిష్కారం
6. ఖమ్మం- దేవరపల్లి, ఖమ్మం- కోదాడ రహదారుల నిర్మాణంలో పోలీస్ భద్రత ఏర్పాటు