సిటీ​ ట్రాఫిక్ కంట్రోల్​కు ప్లాన్ రెడీ చేయండి : సీఎం రేవంత్​ రెడ్డి

సిటీ​ ట్రాఫిక్ కంట్రోల్​కు ప్లాన్ రెడీ చేయండి : సీఎం రేవంత్​ రెడ్డి
  • హైదరాబాద్​ ట్రాఫిక్​పై సమీక్షలో సీఎం రేవంత్​ రెడ్డి
  • మల్టీ లెవెల్ పార్కింగ్ సెంటర్ల నిర్మాణంపై ఫోకస్​ పెట్టండి
  • ప్రత్యేక పార్కింగ్ పాలసీని రూపొందించాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ హైదరాబాద్ లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వాహనాల రద్దీకి అనుగుణంగా ప్రధాన రహదారులు, జంక్షన్ల విస్తరణపై దృష్టి పెట్టాలని అన్నారు. ఎల్బీనగర్ జంక్షన్ తరహాలో సబ్ వే, అండర్ పాస్, సర్ఫేస్ వేల నిర్మాణం సాధ్యాసాధ్యాలను గుర్తించాలని సీఎం సూచించారు. ట్రాఫిక్ నియంత్రణను పోలీస్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ, పోలీసు విభాగాలు సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. హైదరాబాద్ లో ట్రాఫిక్​నిర్వహణ, నియంత్రణపై బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి అధికారులతో సమీక్ష జరిపారు. 

గ్రేటర్ సిటీలో ట్రాఫిక్ నియంత్రణ, నిర్వహణపై సమగ్ర ప్రణాళికను రూపొందించాలని .. అందులో నిపుణులైన కన్సల్టెన్సీలకు బాధ్యతలు అప్పగించి ప్రత్యేకంగా అధ్యయనం చేయించాలన్నారు. వాహనాల రద్దీకి సరిపోను ట్రాఫిక్ సిబ్బంది అందుబాటులో లేరని సమావేశంలో చర్చకు వచ్చింది. దీనిపై స్పందించిన సీఎం వెంటనే తగినంత మంది హోంగార్డులను నియమించాలని సూచించారు. వివిధ విభాగాల్లో పని చేస్తున్న హోం గార్డులను ట్రాఫిక్ విభాగానికి తిరిగి రప్పించాలని, తక్షణమే వారి సేవలను వినియోగించుకోవాలని చెప్పారు.

 ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో లా అండ్ ఆర్డర్ పోలీసులను  గ్రేటర్ సిటీ ట్రాఫిక్ కంట్రోల్ విధులకు వినియోగించుకోవాలని అన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల స్థాయిని అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వాటికి సరిపడే సంఖ్యలో సిబ్బంది నియామకాలు చేపడుతామని సీఎం చెప్పారు. 

మల్టీ లెవెల్​ పార్కింగ్​ సెంటర్ల నిర్మాణం

సిటీలోని అన్ని ప్రధాన జంక్షన్ల వద్ద ఆటోమేటిక్  సిగ్నల్ వ్యవస్థ మీద ఆధారపడకుండా  టూ వీలర్ ట్రాఫిక్ ఇంటర్​సెప్టర్స్ పై ఎస్ఐలు, కానిస్టేబుళ్లను పంపించి ట్రాఫిక్ జామ్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పార్కింగ్ సమస్యను అధిగమిస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తొలిగిపోతాయనే చర్చ జరిగింది. వీలైనన్ని చోట్ల మల్టీ లెవల్ కార్ పార్కింగ్ సెంటర్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నారు.

 ప్రైవేటు, ప్రభుత్వ స్థలాలు గుర్తించాలని, పార్కింగ్ సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి ప్రభుత్వ పరంగా రాయితీలు ఇవ్వాలని సీఎం అన్నారు. అన్ని విధివిధానాలతో ప్రత్యేక పార్కింగ్ పాలసీని రూపొందించాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ లో బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులు ఇచ్చేటప్పుడు ఆ ఏరియాలో ఉండే ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకోవాలని సీఎం ఆదేశించారు. 

వేములవాడ టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీతో  సీఎం భేటీ

వేములవాడ టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీతో  సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సచివాలయంలో సమావేశమయ్యారు. వేములవాడ ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఈ సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సీఎస్​ శాంతి కుమారి హాజరయ్యారు.