సీపీఐ శతవసంతాల సభకు రండి.. సీఎం రేవంత్ కు పల్లా వెంకట్ రెడ్డి, నెల్లికంటి సత్యం ఆహ్వానం

సీపీఐ శతవసంతాల సభకు రండి.. సీఎం రేవంత్ కు  పల్లా వెంకట్ రెడ్డి, నెల్లికంటి సత్యం ఆహ్వానం

హైదరాబాద్, వెలుగు: ఖమ్మంలో ఈ నెల 18న జరగనున్న సీపీఐ శత వసంతాల ముగింపు సభకు రావాలని సీఎం రేవంత్ రెడ్డిని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్​రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఆహ్వానించారు. ఈ మేరకు వారు సోమవారం సెక్రటేరియెట్​లో సీఎంను కలిసి ఆహ్వానపత్రికను అందజేశారు. 

అనంతరం వారు మాట్లాడుతూ, సభకు హాజరయ్యేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేశారని వారు పేర్కొన్నారు. కాగా, భారత కమ్యూనిస్టు పార్టీ వందేండ్ల వేడుకలను పురస్కరించుకొని ఖమ్మం పట్టణంలో ఈ నెల 20న ‘ఇండియా టుడే అండ్ చాలెంజెస్ బిఫోర్ ద లెఫ్ట్’(వర్తమాన భారతదేశం,- వామపక్షం ముందున్న సవాళ్లు) అనే అంశంపై  సెమినార్​ను నిర్వహిస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. 

పార్టీ శత వసంతాలు పూర్తి చేసుకున్నందున 18న ఖమ్మం పట్టణంలో సీపీఐ లక్షలాది మందితో బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నదన్నారు. 20న ఉదయం 10 గంటలకు ఖమ్మం పట్టణం, ఎస్​ఆర్ గార్డెన్స్​లో ఈ సెమినార్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.