కోడ్ తర్వాత పాలన స్పీడప్ .. పూర్తి స్థాయిలో గ్యారంటీల అమలు

కోడ్ తర్వాత పాలన స్పీడప్ .. పూర్తి స్థాయిలో గ్యారంటీల అమలు
  • ఇప్పటికే రుణమాఫీ, గల్ఫ్ సంక్షేమంపై గడువు  ప్రకటించిన సీఎం
  • వడ్ల బోనస్​పై క్లారిటీ
  • మూసీ రివర్ ఫ్రంట్ పైనా అదే ఫోకస్

హైదరాబాద్, వెలుగు:  లోక్ సభ​ఎన్నికల వేళ ప్రతిపక్షాలకు చెక్​ పెట్టేలా సీఎం రేవంత్​ రెడ్డి స్కీములకు డెడ్​లైన్లు ప్రకటిస్తున్నారు. అదే స్పీడ్​తో పనిచేయాలని ఉన్నతాధికారులకు కూడా ఆదేశాలు వెళ్తున్నాయి. ఎన్నికల కోడ్​ ముగిసిన వెంటనే పాలనను, సంక్షేమాన్ని పూర్తిగా గాడిలో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు గ్యారంటీలపై ఫోకస్  పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఒక్కో హామీని అమలు చేస్తూ ముందుకు వెళ్తోంది. లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్​ రిలీజ్​ కావడంతో కోడ్​ వల్ల హామీల అమలు ఆగిపోయింది. ఇదే అదునుగా సర్కారుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ప్రచార సభల్లోనే రూలింగ్  పార్టీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుందనే దానిపై క్లారిటీ ఇస్తున్నారు. మొదటి నుంచే రూ.2 లక్షల పంట రుణమాఫీపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు  నాలుగు నెలల్లోనే పూర్తి చేసేలా ప్లాన్​ చేసింది. గల్ఫ్​ సంక్షేమం విషయంలోనూ సీఎం రేవంత్​ క్లారిటీ ఇచ్చారు. సెప్టెంబర్​ 17 లోగా గల్ఫ్​ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక వడ్లకు సంబంధించి బోనస్ ను వచ్చే ఖరీఫ్  నుంచి ఇస్తామని హామీ ఇచ్చారు. 

రైతులు ఫస్ట్​

రాష్ట్రంలో గత ఆరేడు నెలలుగా వర్షాభావ పరిస్థితులు ఉండడంతో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. ఇదే అదునుగా కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు బీఆర్ఎస్​, బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారంలో కామెంట్లు చేస్తున్నారు. దీన్ని తిప్పికొట్టేలా సీఎం రేవంత్..​ ఆగస్టు 15 లోగా ఏకకాలంలో మాఫీకి ప్రణాళికలు సిద్ధం చేశామని ప్రకటించారు. అంతకు మూడు నెలల ముందే ఆర్బీఐ మాజీ గవర్నర్​ రఘురాం రాజన్​తో సీఎం ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు పంట రుణమాఫీపై సలహాలు, సూచనలు తీసుకున్నారు. మరోవైపు ఎస్ఎల్​బీసీలో బ్యాంకులతో మాట్లాడి ఎంత మొత్తంలో క్రాప్​ లోన్లు ఉన్నాయి, ఏరకంగా మాఫీ చేస్తే రైతులకు, బ్యాంకులకు, ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ఉంటుందో అధికార పార్టీ నేతలు చర్చిస్తున్నారు. అలాగే అటు రుణమాఫీ చేసి ఇటు రైతుభరోసాను ఎకరాకు రూ.15 వేలకు పెంచేలా ప్లాన్​ చేస్తున్నారు. అదే పెట్టుబడి సాయాన్ని సాగవుతున్న భూములకు మాత్రమే ఇచ్చేలా, ఐటీ కడుతున్న వాళ్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వకూడదని భావిస్తున్నారు. వడ్లకు సంబంధించి క్వింటాకు రూ.500 బోనస్​ కూడా వచ్చే ఖరీఫ్​ నుంచి అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. దీంతో  జూన్​లో రైతు భరోసా, ఆగస్టులో రుణమాఫీ, అక్టోబర్, నవంబర్​లో బోనస్ రైతులకు అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

గల్ఫ్​ కార్మికులకు భరోసా

గల్ఫ్​ కార్మికుల విషయంలోనూ ప్రభుత్వం స్పీడ్  పెంచింది. ఈ ఏడాది సెప్టెంబర్​ 17 లోగా వారి సమస్యలు పరిష్కరించేందుకు రెడీ అయింది. గల్ఫ్​ కార్మికులకు బీమా సౌకర్యం కల్పించడంతో పాటు వెల్ఫేర్​ బోర్డును ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్  రెడ్డి నిర్ణయించారు. ఈ అంశంపై అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. కేరళ వంటి రాష్ట్రాల్లో గల్ఫ్​ కార్మికుల కోసం ఎలాంటి స్కీమ్స్​ అమలు చేస్తున్నారో వారు స్టడీ చేస్తున్నారు. ప్రజా భవన్​లోనూ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

ఈ సంవత్సరంలోనే యువ వికాసం

ఆరు గ్యారంటీల్లో ఒకటైన యువ వికాసంను ఈ విద్యా సంవత్సరంలోనే ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు నివేదికను సిద్ధం చేస్తున్నారు. జూన్ లోనే పాఠశాలలు, కాలేజీలు ప్రారంభం కానున్నాయి. మొత్తం ఎంత మంది విద్యార్థులు ఉన్నారు,  ఎక్కడెక్కడ ఏయే కోర్సులు చదువుతున్నారు వంటి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. అలాగే ప్రతి మండలంలో ఇంటర్నేషనల్​ స్కూల్స్​కు సంబంధించి స్థల సేకరణ ప్రక్రియ కూడా మొదలైంది. విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డును ఎలా అందించాలో అధికారులు అధ్యయనం చేస్తున్నారు.