సబ్ కుచ్ అయేగా.. మక్తల్లో ప్రజా పాలన విజయోత్సవం’ ప్రారంభించడం సంతోషంగా ఉంది

 సబ్ కుచ్ అయేగా.. మక్తల్లో ప్రజా పాలన విజయోత్సవం’ ప్రారంభించడం సంతోషంగా ఉంది
  • సీఎం ఎనుముల రేవంత్​ రెడ్డి
  • వనపర్తి, నారాయణపేట జిల్లాలో రూ.5 వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు

మక్తల్/వనపర్తి, వెలుగు: ఒకప్పుడు ‘కౌన్​ పూచేగా మక్తల్’​ అనే వారని, కానీ, ఇప్పుడు ‘మక్తల్​కో సబ్​ కుచ్​ అయేగా.. సబ్​ కుచ్​ పూచేగా’ అనే స్థాయిలో ఎదుగుతోందన్నారు. అలాంటి ఈ నియోజకవర్గం నుంచి ‘ప్రజా పాలన విజయోత్సవం’ ప్రారంభించడం సంతోషంగా ఉందని సీఎం ఎనుమల రేవంత్​రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని ఆత్మకూరు, మక్తల్ మున్సిపాల్టీల్లో పర్యటించారు. 

హైదరాబాద్​ నుంచి హెలికాప్టర్​ ద్వారా బయల్దేరిన ఆయన ముందుగా ఆత్మకూరు చేరుకున్నారు. అక్కడి పీజేపీ క్యాంప్​ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూ.15 కోట్లతో ఆత్మకూరు పట్టణ అభివృద్ధి పనులకు, రూ.15 కోట్లతో అమరచింత పట్టణ అభివృద్ధి పనులకు, ఆత్మకూరులో రూ.22 కోట్లతో నూతనంగా నిర్మించనున్న 50 పడకల కమ్యూనిటీ హెల్త్  సెంటర్​ బిల్డింగ్​కు, ఆత్మకూరు–-గద్వాల మధ్య  రూ.122 కోట్లతో నిర్మించనున్న హై లెవల్​ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 

అనంతరం హెలీకాప్టర్​లో మక్తల్​కు చేరుకున్నారు. అక్కడ సీఎం రూ. 4,500 ‌‌‌‌‌‌‌‌కోట్లతో చేపట్టనున్న మక్తల్–-కొడంగల్,- నారాయణపేట స్కీమ్​ పైప్​లైన్​ పనులకు, మక్తల్​ క్రీడమైదానంలో రూ.25 కోట్లతో కాంప్లెక్స్  నిర్మాణం, రూ.210 కోట్లతో మక్తల్–​-నారాయణపేట నాలుగు లేన్ల రోడ్డుకు, రూ.200 కోట్లతో మక్తల్  మండలం గొల్లపల్లి వద్ద 25 ఎకరాల్లో చేపట్టనున్న యంగ్​ ఇండియా ఇంటిగ్రేటెడ్  స్కూల్​ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మక్తల్​లోని పడమటి ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. జాతర సందర్భంగా సుందరీకరణ చేసిన కోనేరును సందర్శించారు. అక్కడి నుంచి ఆయన కాన్వాయ్​గా​ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సాయంత్రం ఐదు గంటలకు తిరిగి హైదరాబాద్​ బయల్దేరివెళ్లారు.