సీఎం రేవంత్ రెడ్డి కొత్త కాన్వాయ్.. నల్ల రంగు కార్లు

సీఎం రేవంత్ రెడ్డి కొత్త కాన్వాయ్.. నల్ల రంగు కార్లు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కొత్త కాన్వాయ్ వచ్చింది. నిన్నటి వరకు తెల్ల రంగులో ఉన్న వాహనాలు.. జనవరి 24వ తేదీన మాత్రం నల్ల రంగులో కనిపించాయి. కొత్త కాన్వాయ్ తోపాటు.. కొత్త కార్లు రావటం విశేషం. అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి భద్రత విషయంలోనూ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకున్నది. కొత్త సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. గతంలో కేసీఆర్ దగ్గర పని చేసిన సెక్యూరిటీ టీం మొత్తాన్ని తొలగించి.. కొత్త వారికి ఆ బాధ్యతలు అప్పటించింది. నెల రోజులుగా తెల్ల రంగు కార్లలోనే తిరిగిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు సడెన్ గా నల్ల రంగు కార్ల కాన్వాయ్ కు మారటం ఆసక్తిగా మారింది.

అదే విధంగా ఇంటెలిజెన్స్ విభాగంలోనూ భారీ మార్పులు చేసింది ప్రభుత్వం. కేసీఆర్ హయాంలో ఆయన దగ్గర పని చేసిన వారి స్థానంలో.. కొత్త వారిని నియమించింది ప్రభుత్వం. ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు లీక్ అవుతున్నాయనే అనుమానంతో.. ఈ ప్రక్షాళన చేసింది సర్కార్. ప్రభుత్వం మారినప్పుడల్లా ఇలాంటి చేర్పులు, మార్పులు సహజమే. కొత్త ప్రభుత్వంలో కొత్త బృందాలు.. అధికారుల మార్పు అనేది మామూలే అంటున్నారు ఉన్నతాధికారులు. కీలకమైన శాఖలు, భద్రతా వ్యవహారాలకు సంబంధించిన శాఖల్లో చేర్పులు మార్పులు జరగటం మామూలే అనేది అధికారులు చెబుతున్న మాట. పాలనపై దృష్టి పెట్టాలని భావించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. 

కాన్వాయ్ మార్పుతోపాటు సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విభాగాలను మరింత పటిష్ఠం చేసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మిగతా అన్ని శాఖల్లో చేర్పులు మార్పులను వేగవంతం చేయాలని భావిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం.