నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ ప్రారంభమైంది.సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రలు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. నుమాయిష్ లో దాదాపు 2వేల 400 స్టాళ్లను ఏర్పాటు చేశారు.
మధ్యాహ్నం మూడున్నర నుంచి రాత్రి పదిన్నర వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. పోలీస్ సెక్యూరిటీతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీని పెంచింది ఎగ్జిబిషన్ సొసైటీ. మహిళలకు ఫ్రీ RTC ఫ్రీజర్నీ కావడంతో గతం కంటే ఎక్కువ మంది నుమాయిస్ ను సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
ఈసారి ఎగ్జిబిషన్ టికెట్ ధర రూ. 40 గా నిర్ణయించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎగ్జిబిషన్ లోపల వాహనాలతో సందర్శించే ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఇందుకు ప్రత్యేక రుసుము చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఇందు కోసం రూ.600 వసూలు చేశారు. కాగా.. సాధారణంగా అయితే ప్రతి రోజూ సాయంత్రం 3.30 నుంచి రాత్రి 10.30 వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోకి సందర్శకులను అనుమతిస్తారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ అంటేనే చార్మినార్, ట్యాంక్‌బండ్, నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తొస్తాయన్నారు. నుమాయిష్‌లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపారవేత్తలందరూ పాల్గొంటారని చెప్పారు. ఎన్నో కళలకు సంబంధించిన వస్తువులు సైతం ఇక్కడ ప్రదర్శించడం ఎంతో అభినందనీయమన్నారు. నుమాయిష్ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలకు ప్రభుత్వం నుంచి పూర్తి తోడ్పాటు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. నుమాయిష్‌కు వచ్చే వ్యాపారులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గతంలో తాను కూడా వచ్చి ఫుడ్ కోర్ట్ లను విజిట్ చేసేవాడినని గుర్తు చేసుకునన్నారు. ఈ ఏడాది కూడా రావడానికి ప్రయత్నం చేస్తానని సీఎం చెప్పారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి నుమాయిష్ ప్రదర్శన గర్వకారణంగా నిలుస్తోందని చెప్పారు. స్వాతంత్య్రం రాక ముందు నుంచి ఎంతో మంది పారిశ్రామిక వేత్తలు, డాక్టర్లు, ఇంజినీర్లు, పలు సంస్థలు నుమాయిష్‌ను ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్నాయన్నారు. 30వేల మంది విద్యార్థులు ఎగ్జిబిషన్ సొసైటీకి చెందిన విద్యా సంస్థల్లో చదువుకుంటున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో మార్పు తీసుకొస్తామని తెలిపారు.
