తాగునీటికి ఇబ్బంది రావొద్దు..ఇంకో వంద కోట్లు అయినా ఇస్తం: సీఎం రేవంత్ రెడ్డి

తాగునీటికి ఇబ్బంది రావొద్దు..ఇంకో వంద కోట్లు అయినా ఇస్తం: సీఎం రేవంత్ రెడ్డి
  • కంప్లయింట్లు వస్తే వెంటనే పరిష్కరించాలి
  •  కొన్ని చోట్ల సాధారణం కంటే 10% తక్కువ సప్లై 
  • ఆ కొరత తీర్చేందుకు ప్రత్యామ్నాయాలపై ఫోకస్ 
  • 10 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లలోనే ఎక్కువ సమస్య 
  • అధికారులు యాక్షన్ ప్లాన్​తో ముందుకెళ్లాలని సీఎం ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో తాగునీటికి ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవసరమైతే తాగునీటి సరఫరా కోసం ఇంకో రూ.100 కోట్లు అయినా సరే ఇవ్వడానికి ప్రభుత్వం రెడీగా ఉందని చెప్పారు. నీటి కొరత ఉన్నచోట్ల ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని.. కంప్లయింట్లు వస్తే వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఈ మేరకు సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే జిల్లా స్థాయిలో అత్యవసరంగా చేపట్టాల్సిన పనుల కోసం కలెక్టర్లకు మంజూరు చేసిన రూ. 100 కోట్లను వాడుకోవాలని తెలిపారు. 

ఒక్కో నియోజకవర్గానికి రూ.కోటి చొప్పున15వ ఆర్థిక సంఘం నిధులను కూడా ఖర్చు చేసే వెసులుబాటు కల్పించారు. జూన్ వరకు ఎండల తీవ్రత పెరిగినా, అన్ని గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఏ రోజుకారోజు ప్రభుత్వ యంత్రాంగం తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించాలని.. ఎక్కడన్నా తాగునీటి ఇబ్బంది ఉన్నట్లు ఫిర్యాదులు, వార్తలు వస్తే.. వెంటనే సమస్యను తెలుసుకొని చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. 

కొన్నిచోట్ల ఇబ్బంది లేకున్నా.. కావాలనే కొందరు రాజకీయ  లబ్ధి కోసం తాగునీటి సమస్యను తెరపైకి తెస్తున్నారని.. ఈ విషయంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం చెప్పినట్లు తెలిసింది. వేసవిలో ప్రత్యేక కార్యాచరణను పర్యవేక్షించేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలకు పది మంది సీనియర్ ఐఏఎస్లను ప్రత్యేక అధికారులుగా నియమించిందని, అందరూ కలిసి యాక్షన్ ప్లాన్​తో ముందుకు వెళ్లాలని సీఎం స్పష్టం చేశారు. 
 
సాధారణం కంటే10 శాతమే తక్కువ.. 

రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ ను మినహాయిస్తే మొత్తం142 పట్టణాలున్నాయి. వీటిలో130 మున్సిపాలిటీలు,12 కార్పొరేషన్లున్నాయి. వీటిలో పది మున్సిపాలిటీలు, కరీంనగర్, ఖమ్మం కార్పొరేషన్ల పరిధిలోనే తాగునీటి కొరత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. సాధారణ రోజులతో పోలిస్తే పది శాతంలోపు తాగునీటి సరఫరా తగ్గిందని.. అయినప్పటికీ ప్రజల అవసరాలకు సరిపడేలా నీటిని అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో సగటున రోజుకు1,398.05 ఎంఎల్ డీ(మిలియన్స్ ఆఫ్ లీటర్ ఫర్ డే)ల తాగునీటి సరఫరా జరుగుతుండగా.. ప్రస్తుతం 1,371 ఎంఎల్ డీల నీటి సరఫరా జరుగుతోంది. కేవలం 26.31 ఎంఎల్ డీల నీటి కొరత మాత్రమే నెలకొంది.   

ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి 

ఎండలు పెరిగిన కొద్దీ ఖమ్మం, కరీంనగర్ పట్టణాల్లో నీటి ఎద్దడి పెరుగుతుందనే అంచనాలతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోంది. తలసరి నీటి అవసరాన్ని పరిశీలిస్తే 27 పట్టణాల్లో ప్రస్తుతం 135 ఎల్పీసీడీ (లీటర్ ఫర్ పర్సన్ ఫర్ డే) కంటే ఎక్కువ నీటి సప్లై ఉంది. 48 పట్టణాల్లో 100 నుంచి 135 ఎల్పీసీడీ ల మధ్య తాగునీటి సరఫరా జరుగుతోంది. 

100 ఎల్పీసీడీల కంటే తక్కువగా సరఫరా అవుతున్న 67 పట్టణాలను సమస్యాత్మకమైనవిగా ప్రభుత్వం గుర్తించింది. అక్కడ ప్రత్యామ్నాయ నీటి వనరులను గుర్తించి సరఫరా చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 23,839 ఆవాసాలకు మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. ఇప్పటికైతే ఎక్కడా తాగునీటి ఎద్దడి లేదని మిషన్ భగీరథ అధికారులు చెబుతున్నారు. అన్ని గ్రామాల్లో 100 ఎల్పీసీడీల నీటి సరఫరా చేస్తున్నారు. ఎక్కడైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నారు. గ్రిడ్ పంపులతో పాటు స్టాండ్ బైగా పంపులు అందుబాటులో ఉంచారు. పట్టణాలు, గ్రామాలన్నింటా సమీప నీటి వనరులను ఉపయోగించుకోవాలని ఇప్పటికే అన్ని మున్సిపల్, కార్పొరేషన్ల అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  

సమస్య వచ్చిందిలా.. పరిష్కారం ఇలా 

గత అక్టోబర్ నుంచి వర్షాలు లేకపోవడంతోపాటు అటు గోదావరి, ఇటు కృష్ణా పరిధిలోని రిజర్వాయర్లలో నీటి మట్టం తగ్గిపోవటంతో ప్రస్తుతం తాగునీటి సమస్య ఉత్పన్నమైంది. నాగార్జునసాగర్ నుంచి పాలేరు, ఉదయ సముద్రం రిజర్వాయర్ల ద్వారా నల్గొండ, ఖమ్మం పట్టణాలకు నీటిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మిడ్ మానేరు, ఎల్ఎండీ నుంచి కరీంనగర్ పట్టణానికి నీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అవసరమైతే కర్నాటకలోని నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి కొంత నీటిని విడుదల చేయాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరాలని కూడా ఇప్పటికే ఇరిగేషన్ విభాగం ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంది. 

నారాయణపూర్ నుంచి జూరాల రిజర్వాయర్ కు వచ్చే నీటితో గద్వాల  మిషన్ భగీరథకు తాగునీటి సరఫరా చేసుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు131 పట్టణాల్లో  294 ప్రభుత్వ ట్యాంకర్లు అందుబాటులో ఉండగా, అదనంగా మరో 97 ట్యాంకర్లను అద్దెకు తీసుకుంది. అత్యవసరమైతే ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.