అసెంబ్లీ రూపురేఖలు మారిపోవాలి : సీఎం రేవంత్‌‌ రెడ్డి

అసెంబ్లీ రూపురేఖలు మారిపోవాలి : సీఎం రేవంత్‌‌ రెడ్డి
  • అసెంబ్లీ రూపురేఖలు మారిపోవాలి
  • శాసనసభ, మండలి ఒకే యూనిట్​గా కనిపించాలి : సీఎం రేవంత్‌‌ రెడ్డి

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర అసెంబ్లీ రూపురేఖలు మారిపోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బుధవారం అసెంబ్లీ స్పీకర్‌‌‌‌గా గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులతో కలిసి ఆయన అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలతో పాటు గాంధీ విగ్రహం సహా ప్రాంగణంలోని అన్ని ప్రాంతాలను పరిశీలించారు. అసెంబ్లీ నుంచి కాలినడకన కౌన్సిల్ హాల్‌‌కు వెళ్లారు. అక్కడి నుంచి గాంధీ విగ్రహం వద్దకు వచ్చారు. వచ్చే సెషన్ వరకు అసెంబ్లీ ప్రాంగణం మొత్తం మారిపోవాలని సెక్రటరీ నర్సింహాచార్యులును రేవంత్‌‌ ఆదేశించారు.

పార్లమెంట్‌‌లాగా అసెంబ్లీ మారిపోవాలన్నారు. అసెంబ్లీ, కౌన్సిల్ ఒకే యూనిట్‌‌గా కనిపించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అసెంబ్లీ ఆవరణలో పార్కింగ్, ల్యాండ్ స్కేపింగ్ పనులు చేపట్టాలన్నారు. పార్లమెంట్‌‌ వద్ద విజయ్ చౌక్‌‌లా కనిపించే విధంగా అన్ని మార్పులు చేయాలని చెప్పారు. వచ్చే సెషన్‌‌లో కౌన్సిల్‌‌ను జూబ్లీ హాల్‌‌లో కాకుండా అసెంబ్లీ భవనంలోనే నిర్వహించేందుకు అవసరమైన పనులు పూర్తి చేయాలన్నారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. సీఎం హోదాలో మొదటిసారి కౌన్సిల్‌‌కు వచ్చిన రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు శ్రీధర్​బాబు, సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మండలి చైర్మన్​గుత్తా సుఖేందర్​రెడ్డి సత్కరించారు.