
- సంక్షేమ బోర్డు. ప్రమాద, ఆరోగ్య బీమా వారి పూర్తి డేటా ఆన్లైన్లో అందుబాటులో ఉండాలి
- అధికారులకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశం
- తెలంగాణ రైజింగ్ – 2047 విజన్‌కు తగ్గట్టు ఏటీసీలు
- ఇప్పటికే 49 అందుబాటులోకి..మిగతా ఏటీసీల పనులను
- ఆకస్మికంగా తనిఖీ చేస్త జీనోమ్ వ్యాలీలో మోడల్ ఏటీసీ ఏర్పాటు చేయండి
- అందులో ఫార్మా, బయో టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్‌పై శిక్షణ
- ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి సూచనలు
- సమీక్షలో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, వెలుగు: గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు ఆ బోర్డుకు ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించేలా తుది ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. గిగ్ కార్మికులకు సంబంధించిన పూర్తి డేటా ఆన్లైన్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో గిగ్ వర్కర్ల సంక్షేమానికి సంబంధించి ప్రతిపాదిత పాలసీ, ఏటీసీల అభివృద్ధి, పనుల్లో పురోగతిపై సోమవారం సెక్రటేరియెట్‌లో కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామితో కలిసి సీఎం రేవంత్ సమీక్షించారు.
ఈ సందర్భంగా గిగ్ వర్కర్ల సంక్షేమానికి సంబంధించిన ముసాయిదాలోని ప్రతిపాదిత అంశాలను అధికారులు వివరించారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గిగ్ వర్కర్లకు ప్రత్యేకంగా ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని.. వారికి ప్రమాద బీమా, ఆరోగ్య బీమా సౌకర్యాలను కల్పించే విధంగా పాలసీ ఉండాలని అధికారులకు చెప్పారు. పాలసీ గురించి ఆఫీసర్లు వివరించగా ఆయన పలు సూచనలు చేశారు.
111 ఏటీసీలు
తెలంగాణ రైజింగ్-–2047 విజన్‌కు తగ్గట్టు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్ (ఏటీసీ) రూపుదిద్దుకోవాలని అధికారులకు సీఎం రేవంత్రెడ్డి సూచించారు. నిర్దేశిత సమయానికి అనుగుణంగా వీలైనంత త్వరగా ఏటీసీల అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నారు. మారుతున్న పరిస్థితులు, పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు కోర్సులు, శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
రాష్ట్రంలోని ఐటీఐలను ఏటీసీలుగా మార్చడంలో జరుగుతున్న అభివృద్ధి, పనుల్లో పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు దశల్లో 111 ఏటీసీల అభివృద్ధి చేపట్టినట్టు ఆఫీసర్లు వివరించారు. అందులో మొదటి దశలో 25, రెండో దశలో 40, మూడో దశలో 46 ఏటీసీలను అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. మొదటి రెండు దశలకు సంబంధించి ఇప్పటికే 49 ఏటీసీలు అందుబాటులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. ఏటీసీలను వీలైనంత తొందరగా పూర్తి చేసేందుకు అవసరమైతే నైపుణ్యం కలిగిన నిర్మాణ సంస్థల సహకారం తీసుకోవాలని సీఎం రేవంత్ సూచించారు.
జరుగుతున్న పనులను పరిశీలించడానికి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానన్నారు. అలాగే, జినోమ్ వ్యాలీలో ఒక మోడల్ ఏటీసీని ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ముఖ్యంగా ఫార్మా, బయో టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ పరిశ్రమల అవసరాలకు తగినట్టు శిక్షణ అందించే కోర్సులను అక్కడ నిర్వహించాలని చెప్పారు. అవసరమైన స్థలాన్ని కేటాయించడంతో పాటు అధునాతన సెంటర్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలను తయారు చేయాలన్నారు. ఈ సందర్భంగా ‘ఏటీసీలు.. తెలంగాణ యువతకు అత్యాధునిక శిక్షణా సంస్థలు’ అనే పేరుతో రూపొందించిన పోస్టర్‌ను సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరించారు.