బీసీ కమిషన్ ద్వారా జనాభా లెక్కలు తీయండి

బీసీ కమిషన్ ద్వారా జనాభా లెక్కలు తీయండి
  •     ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న జాజుల 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీసీ కులగణన నిర్వహిస్తామని బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

శనివారం సచివాలయంలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. బీసీ కుల గణనను వెంటనే ప్రారంభించేందుకు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. కేబినెట్ లో నిర్ణయం తీసుకొని అవసరమైతే మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి బీసీ కమిషన్ ద్వారా బీసీ కులగణను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించాలని  రేవంత్ రెడ్డికి  విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే బీహార్ లో కులగణనను పూర్తి చేశారని, ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రస్తుతం బీసీ కులగణన కొనసాగుతుందని తెలిపారు.

తెలంగాణలోనూ వెంటనే బీసీ కులగణనను చేపట్టాలని సూచించారు. బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఈ సమావేశంలో బీసీ సంఘాల నేతలు తాటికొండ విక్రమ్, జాజుల లింగం, సింగం నగేష్, వారాల శ్రీనివాస్, రాకేష్ చారి, అంజయ్య, భగవంతు, మధు యాదవ్, తిరుపతి, శ్రీశైలం కురుమ తదితరులు పాల్గొన్నారు.