- ప్రేమతోనే ప్రజల మనసులు గెలిచారు
- తెలంగాణలోనూ బాబా శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: సత్యసాయిబాబా సేవలు గొప్పవని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. సత్యసాయిబాబా ట్రస్ట్ సేవలను తెలంగాణలో విస్తృతం చేయడానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందని, సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతుందని తెలిపారు. ఏపీలోని పుట్టపర్తిలో నిర్వహిస్తున్న సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం పాల్గొని మాట్లాడారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాలను తెలంగాణలోనూ అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చినట్టు ఆయన వెల్లడించారు. ‘‘సత్యసాయిబాబా మనుషుల్లో దేవుడిని చూశారు. ప్రేమతో సేవలు అందించారు. మనుషులను ప్రేమించాలని, ప్రేమే గొప్పదని, ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. సత్యసాయి మన మధ్య లేకపోయినా.. ఆయన ఆలోచనలు, స్ఫూర్తి ఈ శత జయంతి ఉత్సవాల్లో ప్రతి భక్తుడిలో కనిపిస్తున్నది” అని అన్నారు.
140 దేశాల్లో ట్రస్ట్ సేవలు..
సత్యసాయి ట్రస్ట్ 140 దేశాల్లో విస్తరించి, మానవాళికి సేవలు అందిస్తున్నదని సీఎం రేవంత్ తెలిపారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు కూడా చేయలేని పనులను బాబా తన ట్రస్ట్ ద్వారా ప్రజలకు అందించారని, అందుకే ఆయన సేవలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘బాబా విద్య, వైద్యం, తాగునీటి సమస్యల పరిష్కారంలో గొప్ప కృషి చేశారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యను అందించి లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపారు. ప్రభుత్వాలతో పోటీ పడి విద్యను అందించారు. పేదలకు వైద్యం అందించి, ప్రాణం నిలిపే దేవుడిగా ప్రజల్లో కీర్తి పొందారు. పాలమూరు లాంటి వలస జిల్లాలు, కరువు కాటకాలతో అల్లాడుతున్న అనంతపురం లాంటి ప్రాంతాలకు ప్రభుత్వాలు కూడా తాగునీటి వసతులు ఏర్పాటు చేయలేని సందర్భంలో బాబా తన ట్రస్ట్ ద్వారా ప్రజల దాహార్తిని తీర్చారు. తమిళనాడులోనూ తాగునీటి సమస్యలు పరిష్కరించారు. అందుకే అందరి మనసుల్లో బాబా శాశ్వత స్థానం సంపాదించుకున్నారు” అని కొనియాడారు. బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తదితరులు పాల్గొన్నారు.
