- అభివృద్ధికి అడ్డుపడేటోళ్లను ఎన్నుకుంటే ఊరు బాగుపడదు
- మూడు, నాలుగు రోజుల్లో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్
- కొడంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి
- ఇరిగేషన్, ఎడ్యుకేషన్‌కు ప్రాధాన్యం ఇస్తున్నం
- కొడంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతం
- 3 నెలల్లో కొడంగల్ లిఫ్ట్ పనులు మొదలుపెడ్తం.. మూడేండ్లలో పూర్తి చేస్తామని వెల్లడి
- నియోజకవర్గంలో రూ.103 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
- అక్షయపాత్ర కిచెన్ బిల్డింగ్ నిర్మాణానికి భూమి పూజ
మహబూబ్‌నగర్ / కొడంగల్, వెలుగు: మూడు, నాలుగు రోజుల్లో సర్పంచ్ఎన్నికల షెడ్యూల్ రాబోతున్నదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం చేస్తున్నదని చెప్పారు. పనులు చేసేటోళ్లనే సర్పంచులుగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ‘‘సర్పంచ్ఎన్నికలు రాబోతున్నాయి. ప్రతి గ్రామంలో మంచోళ్లనే సర్పంచులుగా ఎన్నుకోండి. అభివృద్ధికి అడ్డుపడేటోళ్లను సర్పంచ్ చేయకండి. సర్పంచ్ ఎన్నికలు ముఖ్యమైనవి.. గ్రామ అభివృద్ధికి సర్పంచులే కీలకం. నా వద్ద కూర్చొని.. ఏం కావాలో అడిగే వారినే గెలిపించండి” అని కోరారు.
వికారాబాద్ జిల్లాలోని తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా రూ.103 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కొడంగల్‌లో అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధర్యంలో ప్రారంభించనున్న మధ్యాహ్న భోజన పథకం కోసం కిచెన్ బిల్డింగ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల రోజు ఆడబిడ్డలందరూ ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ‘‘సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు వేయడానికి ఇందిరమ్మ చీరలు కట్టుకొని రండి.
‘ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదిస్తాం.. ఇందిరమ్మ రాజ్యమే కావాలి’ అని ఆ చీరలు కట్టుకోవడం ద్వారా మీ అభిమానాన్ని ప్రదర్శించి, మీ సోదరుడిని ఆశీర్వదించండి. పది రకాల డిజైన్లలో ఇందిరమ్మ చీరలను తయారు చేయించాం. గత ప్రభుత్వంలో ఇచ్చిన చీరలు కంది చేను కాడా పిట్టలను బెదిరించడానికి అడ్డం కట్టేటోళ్లు. లేదంటే బర్రెలు, గొర్రెలకు దాపు కట్టేది. కానీ మా ప్రభుత్వం వచ్చాక నాణ్యమైన చీరలు అందిస్తున్నాం” అని తెలిపారు. 2034లోపు కొడంగల్‌ను మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేసుకుందామని, రాజకీయాలు పక్కనపెట్టి అందరూ ముందుకు రావాలని సూచించారు.
ఆడబిడ్డలు చదువుకోవాలి
ఆడబిడ్డలు చదువుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచిం చారు. మహిళలు ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. ‘‘మహిళల కోసం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలతో వాళ్లు ఆర్థికంగా ఎదుగుతున్నారు. మహిళా సంఘాల సభ్యులను ఆర్థికంగా నిలబెట్టాలని వెయ్యి బస్సులకు వాళ్లను యజమానులుగా చేశాం. అదానీ, అంబానీలతో పోటీ పడే విధంగా సోలార్ పవర్ ప్లాంట్లను, పెట్రోల్‌బంక్‌లను అప్పగిస్తున్నాం. మన ఆడబిడ్డలు తయారు చేసే వస్తువులను ఉత్పత్తి చేసి ప్రపంచ మార్కెట్లో అమ్మడానికి హైదరాబాద్హైటెక్ సిటీలో మూడున్నర ఎకరాలు ఇచ్చాం. ఆడబిడ్డలు తయారు చేస్తున్న వస్తువులు 150 షాపుల్లో అమ్ముడవుతున్నాయి. ప్రపంచ పర్యాటకులు వచ్చి వస్తువులు కొంటున్నారు. అమెజాన్ ద్వారా అమెరికాలో ఉండే వారు కూడా మన వస్తువులు కొనడానికి ఏర్పాట్లు చేస్తున్నాం” అని వెల్లడించారు.
మీ పిల్లల ఆకలి తీరుస్తాం..
ఎన్ని చేసినా కుటుంబ కష్టాలు తీరవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అవి తీరాంటే పిల్లలు చదువుకోవాలన్నారు. అందుకు కొడంగల్‌ను ప్రయోగశాలగా మారుస్తున్నామన్నారు. ‘‘మీ పిల్లలు చదువుకొని వెలుగులోకి రావాలి. అందుకు వాళ్లు బడులకు రావాలి. అక్షయ పాత్రతో మాట్లాడి ఈ విద్యా సంవత్సరం మొదటి నుంచే కొడంగల్నియోజకవర్గంలోని 312 బడుల్లో చదువుకుంటున్న 28 వేల మంది పిల్లలకు టిఫిన్ పెట్టిస్తున్నాం. దీంతో బడుల్లో 5 వేల మంది పిల్లలు పెరిగారు. ఇప్పుడు మధ్యాహ్న భోజనం కూడా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ మేరకు కిచెన్బిల్డింగ్నిర్మాణానికి భూమి పూజ చేశాం. త్వరలో ఈ పథకాన్ని ప్రారంభించి మీ పిల్లల ఆకలి తీర్చి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం చేస్తాం” అని తెలిపారు.
కరువు ప్రాంతంలో కృష్ణా జలాలు పారిస్తాం..
ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌కు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగా రూ.5 వేల కోట్లతో కొడంగల్, నారాయణపేట, మక్తల్లిఫ్ట్ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కరువు ప్రాంతంలో కృష్ణా జలాలను పారిస్తామన్నారు. ‘‘ఇప్పటికే 95 శాతం భూసేకరణ పూర్తయింది. ఈ ప్రాజెక్టు కోసం భూములు ఇవ్వడానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. మూడు నెలల్లో ఈ స్కీం పనులు ప్రారంభించి, మూడేండ్లలో పూర్తి చేస్తాం” అని వెల్లడించారు. ‘‘కొడంగల్‌లో ఎడ్యుకేషన్ క్యాంపస్ నిర్మిస్తున్నాం.
ఈ క్యాంపస్‌లో మెడికల్, వెటర్నరీ, అగ్రికల్చర్, పారామెడికల్, నర్సింగ్, ఫిజియోథెరపీ, ఇంజనీరింగ్, ఐటీఐ, ఏటీసీ, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు ఉంటాయి. ఇప్పటికే వీటిని మంజూరు చేయించాను. రాష్ట్రంలో ఎక్కడాలేని సైనిక్ స్కూల్‌ను కొడంగల్‌లో ప్రారంభిస్తున్నాం. రాష్ట్రం నలుమూలల విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేలా కొడంగల్‌ను డెవలప్ చేస్తాం. రానున్న 16 నెలల్లో కొడంగల్‌ను అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషన్‌హబ్‌గా తీర్చిదిద్దుతాం” అని అన్నారు.
70 ఏండ్ల కల నెరవేరనుంది..
త్వరలో ఈ ప్రాంతవాసులు రైలు కూతను వింటారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 70 ఏండ్లుగా ఎదురు చూస్తున్న విరాకాబాద్–కృష్ణా రైల్వే లైన్‌కు ఆమోదం లభించిందని చెప్పారు. రాష్ర్ట వాటా నిధులు కూడా ఇచ్చామన్నారు. ‘‘ఈ ప్రాంతంలో ఎక్కువగా సున్నపురాయి గనులు ఉన్నాయి. త్వరలో ఈ ప్రాంతంలో సిమెంట్పరిశ్రమను స్థాపిస్తాం. దీంతో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. కొడంగల్ నియోజక వర్గానికి అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు వస్తాయి. లగచర్ల, హకీంపేట, పోలేపల్లి ప్రాంతాల్లో రైతులు నాలుగు వేల ఎకరాల భూములను ఇచ్చారు.
గతంలో కొందరు కుట్రలు చేసి రైతులకు రెచ్చగొట్టారు. ఇప్పుడు రైతులు అడిగినంత పరిహారం ఇచ్చాం. ఇండ్లు కూడా ఇస్తున్నాం. ఢిల్లీ పక్కనే ఉన్న నోయిడా తరహాలో.. తెలంగాణ నోయిడాగా కొడంగల్నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం” అని చెప్పారు. కాగా, సభ అనంతరం నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు రూ.300 కోట్ల వడ్డీ లేని రుణాలను సీఎం అందజేశారు. మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. అలాగే పెట్రోల్‌బంక్ ప్రొసీడింగ్స్అందజేశారు.
రేవంత్.. అపర భగీరథుడు: దామోదర, వాకిటి
కొడంగల్, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో బీడు భూములను సాగులోకి తేవాలనే ఉద్దేశంతో లిఫ్ట్ఇరిగేషన్ద్వారా కృష్ణా జలాలను తరలిస్తున్న అపర భగీరథుడు సీఎం రేవంత్‌రెడ్డి అని మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి కొనియాడారు. నీటిని తరలించడం ఆనాడు రాజశేఖర్‌రెడ్డికి, ఈనాడు రేవంత్‌రెడ్డికే సాధ్యమైందని అన్నారు. రానున్న రోజుల్లో కొడంగల్ అద్భుతంగా అభివృద్ధి చెందబోతున్నదని పేర్కొన్నారు. ‘‘రేవంత్‌రెడ్డిని కొడంగల్ప్రజలు ఎన్నుకోవడం.. తెలంగాణ ప్రజల అదృష్టం. సీఎం కమిట్‌మెంట్, సేవా దృక్పథం, దార్శనికత్వంతో కొడంగల్ఆదర్శ నియోజ కవర్గంగా నిలిచిపోతుంది” అని అన్నారు.
