హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా శనివారం పలువురు జాతీయ, రాష్ట్ర నేతలు, ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. వీరిలో ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ, స్టాలిన్, సిద్ధరామయ్య, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి రాంమోహన్ నాయుడు, జాతీయ నేతలు సచిన్ పైలెట్ తదితరులు ఉన్నారు. రాహుల్ గాంధీ ఫోన్ ద్వారా రేవంత్ కు శుభాకాంక్షలు తెలియజేయగా, రేవంత్ దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని మోదీ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
సినీ ప్రముఖులు, రాజకీయ నేతల విషెస్
బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గణ్, తెలుగు సినీ నటులు చిరంజీవి, బాలకృష్ణ, మహేశ్ బాబు, రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా రేవంత్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. ఇక రాష్ట్ర నేతలు పలువురు నేరుగా సీఎంను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో స్పీకర్ గడ్డం ప్రసాద్, డిప్యూటీ సీఎం భట్టి, రాష్ట్ర మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, వాకిటి శ్రీహరి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ సీనియర్ నేతలు, కార్పొరేషన్ చైర్మన్ లు ఉన్నారు.
రేవంత్ బర్త్ డే సందర్భంగా యాదగిరి గుట్ట ఆలయ అర్చకులు ఆయన ఇంటికి వచ్చి ప్రత్యేక ఆశీర్వాదం అందజేశారు. ఇదే రోజున హైటెక్స్ లో రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి కూతురు వివాహానికి సీఎం హాజరు కావడంతో అక్కడ కూడా ఆయనకు పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.
