సర్కార్ స్కూళ్ల పర్యవేక్షణ బాధ్యత మహిళా సంఘాలకు!

సర్కార్  స్కూళ్ల పర్యవేక్షణ బాధ్యత మహిళా సంఘాలకు!

 

  •     పరిశీలించాల్సిందిగా అధికారులకు సీఎం రేవంత్​రెడ్డి ఆదేశం
  •     సర్కార్​ బడుల్లో అన్ని సౌలతులుండాలి
  •     స్కూళ్లకు, కాలేజీలకు ఫ్రీ విద్యుత్​ అందించాలని రివ్యూలో సూచన
  •     సెక్రటేరియెట్​ నుంచి కింది స్థాయి ఆఫీసుల వరకు ఫేషియల్​ అటెండెన్స్​పైనా చర్చ 

హైదరాబాద్​, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల యూనిఫాంలు, మౌలిక వసతుల కల్పన, పర్యవేక్షణ బాధ్యతను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలని అధికారులను సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశించారు. దీని వల్ల స్కూల్స్​పై నిరంతర పర్యవేక్షణ ఉండడంతో పాటు మహిళలకు ఆర్థికంగా చేయూతను అందించినట్టు అవుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలకు ఉచిత విద్యుత్​ అమలయ్యేలా చూడాలని చెప్పారు. సోలార్​ ప్యానెళ్ల ఏర్పాటుపైనా దృష్టి సారించాలన్నారు. స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిపై ఆదివారం ఎంసీఆర్​హెచ్​ఆర్డీలో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్​రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. స్కూళ్లలో అన్ని సౌలతులు కల్పించాలని, స్పష్టమైన మార్పు కనిపించాలని అధికారులకు సూచించారు. ప్రజలు గవర్నమెంట్​ స్కూళ్లను నమ్మేలా చర్యలుండాలని తేల్చిచెప్పారు. సర్కారు బడుల్లో డిజిటల్​ క్లాసులను ఏర్పాటు చేయాలని.. అనుభవమున్న టీచర్లతో టీశాట్​ ద్వారా డిజిటల్​ పాఠాలు చెప్పించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని గవర్నమెంట్​ స్కూళ్ల పరిస్థితులపై వివరాలన్నింటినీ వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచాలన్నారు. ఎండా కాలం సెలవులు ముగిసేలోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. 

ఎన్నారైల సహకారం తీసుకోవాలి

ఇతర రాష్ట్రాల్లోని సర్కారు బడుల్లో అమలు చేస్తున్న మౌలిక సదుపాయాలను పరిశీలించి రాష్ట్రంలో అమలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. మౌలిక వసతుల కల్పనకు గ్రీన్​చానెల్​ ద్వారా నిధులను మంజూరు చేయాలన్నారు. సీఎస్​ఆర్​ ఫండ్స్​ కోసం ప్రయత్నం చేయాలని, సౌకర్యాల మెరుగుపరిచేందుకు ఎన్నారైల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై సమగ్ర అధ్యయనం చేయాలని..  విద్యావేత్తలు, మేధావులతో చర్చించాలన్నారు. స్కిల్​ యూనివర్సిటీ కోసం ఐఎస్​బీ తరహాలో గవర్నింగ్​ బాడీని ఏర్పాటు చేయాలని తెలిపారు. సెక్రటేరియెట్​ నుంచి కిందిస్థాయి వరకు ఫేషియల్​ రికగ్నిషన్​ అటెండెన్స్​ సిస్టం తీసుకొచ్చే యోచనపై  చర్చ జరిగింది.