జైపాల్ రెడ్డి లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు.. ఆయన సహకారం ఎప్పటికీ మరువలేం: CM రేవంత్

జైపాల్ రెడ్డి లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు.. ఆయన సహకారం ఎప్పటికీ మరువలేం: CM రేవంత్

హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో దివంగత నేత జైపాల్ రెడ్డి పాత్ర ఎన్నటికీ మరువలేనిదని, ఆయన సహకారం లేకుంటే ప్ర్యతేక రాష్ట్రం వచ్చేది కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆయన సమయస్ఫూర్తి ఎంతో పనికొచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జైపాల్ రెడ్డి ఎంతో చొరవ చూపారని సోనియా గాంధీ కూడా ఓసారి చెప్పారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. శనివారం (జూలై 26) హైదరాబాద్‌లో క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ, ICFAI నిర్వహించిన ఎస్. జైపాల్ రెడ్డి స్మారక అవార్డు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

ప్రముఖ ఆర్ధిక నిపుణులు మోహన్ గురుస్వామికి జైపాల్ రెడ్డి డెమెక్రసీ తొలి అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. జైపాల్ రెడ్డికి ప్రతిపక్ష పార్టీలతో కేవలం సిద్ధాంతపరంగా మాత్రమే విభేదాలు ఉండేవని, రాజకీయాల్లో ఆయన 40 ఏళ్ల పాటు అజాతశత్రువుగా ఉన్నారని కొనియాడారు. సమాచార హక్కు చట్టం రావడంలో జైపాల్ రెడ్డి పాత్ర ఎంతో ఉందన్నారు. సంస్కరణల అమలుకు జైపాల్ రెడ్డి ఎంతో తాపత్రయపడేవారన్నారు. కల్వకుర్తి ప్రాంతంలో మార్పుల కోసం జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారని అన్నారు. 

ALSO READ | భారీ వర్షాలు.. జిల్లాలకు రూ. 33 కోట్లు రిలీజ్ చేసిన ప్రభుత్వం

తెలంగాణ నుంచి పీవీ నర్సింహా రావు తర్వాత అంత పేరు తెచ్చుకున్నది జైపాల్ రెడ్డి మాత్రమేనన్నారు. రాజకీయాల్లో ధన ప్రవాహం తగ్గాలని జైపాల్ రెడ్డి చెప్తుండేవారని ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని మేం ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. వ్యక్తిగత రాజకీయాలకంటే సిద్ధాంతపరమైన రాజకీయాలు ముఖ్యమన్నారు. ప్రస్తుతం ఐడియోలాజికల్ పాలిటిక్స్ పోయి స్విగ్గీ పాలిటిక్స్ వచ్చాయని.. సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసేవాళ్లు దేశ రాజకీయాల్లో తగ్గుతూ వస్తున్నారని.. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదమని అభిప్రాయపడ్డారు. యూనివర్శిల నుంచే సిద్ధాంతపరమైన రాజకీయాలు తయారు అవుతాయని పేర్కొన్నారు.